జాతకం అంటే జన్మకు సంబంధించినది అని అర్థం. బౌద్ధంలో జాతక కథలు అంటే బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించిన కథలని అర్థం. మనిషి సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సమ్యక్ సంబుద్ధుడుగా పరిణితి చెందడానికి ఒక జన్మ చాలదు. ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఎంతో సాధన చేయవలసి వస్తుంది. సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు కాక ముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తాడు. ఏ జన్మ ఎత్తినా అందులో ఆయన అత్యుత్తమ గుణాన్ని, శీలాన్ని కలిగి ఉండేవాడు.
బుద్ధుడు నిర్యాణం చెందిన మూడు నెలలకు బుద్ధుని శిష్యులైన 500 మంది భిక్షకులు ఒకచోట సమావేశమై బుద్ధ వచనాలను మూడు గ్రంథాల్లో పొందుపరిచారు. అలా పొందుపరిచిన వాటిని ప్రాకృత భాషలో త్రిపీటకాలు అన్నారు.
బుద్ధుని బోధనలు ఉన్న పీటకాలను వినయ పిటకం, సుత్త పిటకం, అభిదమ్మ పిటకం అని పిలిచారు. ఇవి చాలా పెద్ద గ్రంథాలు. ఇక, జాతక కథలు ఉన్నది సుత్త పిటకంలో. ఈ కథలు మొత్తం 547. అంటే బుద్ధుని పూర్వజన్మకు ఒకటి చొప్పున కథలన్న మాట. సింహళ భాషలోని జాతక కథల్ని పాళీ భాషలోకి అనువదించిన బుద్ధఘోషుడు మన తెలుగు వ్యక్తే కావడం గర్వకారణం. విసుద్ధిమగ్గ అనే ప్రామాణిక గ్రంథం రాసిందీ, ధమ్మపదం కథలు చెప్పిందీ ఈయనే. అందుకే బౌద్ధ ప్రపంచం యావత్తూ ఈయనను నేటికీ నెత్తిన పెట్టుకుని పూజిస్తుంది. నాగార్జునకొండకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట నెమలిపురి ఈయన పుట్టిన ఊరు. ఈయనతో పాటు బౌద్ధంలో మహామహులైన నాగార్జునుడు, అనురుద్ధుడు, దిఞ్నగుడు కూడా తెలుగు వారే.
జాతక కథలు ఐదు రకాలని అంటున్నా.. ముఖ్యంగా ఉన్నవి రెండే రకాలు. ఒకటి- వర్తమాన కథ. రెండు- అతీత కథ. వర్తమాన కథ అంటే బుద్ధుడు ఉండగా జరిగిన ఏదో ఘటన గురించి చెప్పినది. అతీత కథ అంటే ఆ సంఘటనను పురస్కరించుకుని బుద్ధుడు చెప్పిన తన పూర్వ జన్మ కథ
Review బుద్ధుడి పూర్వజన్మ కథలు.