మంచిని పంచే కథలు

పంచతంత్ర కథలు, కాశీ మజిలీ కథలు.. తెలుసు కదా.. వీటి కంటే ప్రాచీనమైనవి బౌద్ధ జాతక కథలు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతక కథలు ఎన్నో భాషల్లోకి అనువాదమయ్యాయి. మన తెలుగులోనూ ఇవి చాలా ప్రసిద్ధి. మంచి మంచి విషయాలను బోధిస్తూ, మెదడుకు పదును పెట్టే ఘట్టాలతో ఆసక్తికరంగా సాగే జాతక కథలు అందరూ చదవదగినవి.

సాధారణంగా కథలు.. ‘అనగనగా..’ అంటూ మొదలవుతాయి కదా.. ఈ జాతక కథలు ‘బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో..’ అంటూ మొదలవుతాయి. గౌతమ బుద్ధుడి పూర్వజన్మల్లో జరిగిన గాథలే ఈ జాతక కథలు.
బోధిసత్త్వుడు (బుద్ధుడికి గల అనేక పేర్లలో ఇదీ ఒకటి) రాజకుమారుడిగా, తపస్విగా, ఏనుగు, సింహం, లేడి.. ఇలా వివిధ జన్మలు ఎత్తి తన తెలివితేటలతో అనేక చిక్కు సమస్యలను పరిష్కరిస్తుంటాడు. విశాల దృక్పథం, అహింస, కరుణ వంటి గొప్ప లక్షణాలతో ఆదర్శప్రాయంగా నిలుస్తుంటాడు.

సిద్ధార్థుడు బుద్ధుడిగా మారేలోపు 547 జన్మలు ఎత్తాడని బౌద్ధ సాహిత్యంలో ఉంది. అందుకు గుర్తుగానే జాతక కథలు కూడా 547 ఉన్నాయని బౌద్ధులు చెబుతారు. ఇవి మొదట్లో సింహళ భాషలో ఉండేవి. ఐదవ శతాబ్దంలో మన తెలుగు వారైన బుద్ధఘోషుడు వీటిని పాళీ భాషలోకి అనువదించారు. ఆ తరువాత నేరుగా తెలుగులోకి తల్లావజ్జుల శివశంకరశాస్త్రి ఏడు సంపుటాలుగా వీటిని వెలువరించారు. అనేక ప్రచురణ సంస్థలు వాటిని మరింత క్లుప్తం చేసి, వాడుక భాషలోకి మరెన్నో పుస్తకాల రూపంలో తెచ్చాయి.

వేల సంవత్సరాలుగా తరతరాలను అలరిస్తున్న కథలివి. వీటిని పోలిన కథలు కొన్ని ఈసప్‍ కథల్లో, పంచతంత్ర కథల్లోనూ కనిపిస్తాయి. అద్భుతాలు, సాహసాలు, ఊహించని మలుపులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. కథా రూపంలో అలరిస్తూనే మనిషిగా మనం పాటించాల్సిన ధర్మాలు, నీతి, నిజాయతీలను తెలియచెబుతాయి.

Review మంచిని పంచే కథలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top