
కారణాలు ఏవైనా.. మన కోరికలు, ఆశలు, ఇంటా బయటా నెలకొన్న ఒత్తిళ్లు మనల్ని మనమెవరో క్షణం తీరిక చేసుకుని ఆలోచించుకునే అవకాశాన్ని ఇవ్వడం లేదు. చివరకు పోటీ పేరుతో పతనావస్థలో పడిపోతున్నాం. అయితే, ప్రయత్నం చేస్తే ఆ పతనం నుంచి బయటపడవచ్చు. అప్పుడంతా వెలుగే. ఈ సందేశాన్నే ఇస్తుంది నరక చతుర్దశి.
అవసరం అయినప్పుడల్లా శ్రీకృష్ణుడు దుష్టశిక్షణ, శిష్టరక్షనే కర్తవ్యంగా వివిధ అవతారాలు దాల్చాడు. నరసింహుడై హిరణ్యకశిపుడిని, మోహినీ అవతారంలో భస్మాసురుడిని అంతమొందించాడు. ఇదే క్రమంలో ఇటు మనుషుల్నీ, అటు దేవతల్నీ పీడిస్తున్న నరకాసురుడిని సత్యభామా సమేతుడై సంహరించాడు. రాక్షస విముక్తి కావడంతో అంతా ఆనందించారు. అలా సకల జనావళి ఆనందించిన రోజే నరక చతుర్దశి.
మన ప్రతి పండుగా వెనుకా ఓ పరమార్థం ఉంటుంది. పండుగలు ఆనందాన్ని ఇస్తూనే జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి వీలుగా అనేక సందేశాలను కూడా అందిస్తాయి. వాటిని అందిపుచ్చుకుని వ్యక్తిత్వానికి మెరుగులు పెట్టుకుంటూ తోటి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు సాగిపోవడమే మనిషిగా మన కర్తవ్యం.
లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణసత్యభామలు అంతమొందించిన ఆశ్వయుజ బహుళ చతుర్దశే నరక చతుర్దశి (2022, అక్టోబర్ 24, మంగళవారం). నరకాసురుడి పీడ విరగడయిందని ఆనంద పారవశ్యంతో ఆ మర్నాడు జరుపుకునే పర్వమే దీపావళి. వరాహావతారంతో హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత విష్ణుమూర్తికి, భూదేవికి పుట్టిన వాడే నరకుడు. అతనిలో అసుర లక్షణాలు ఉన్నాయని విష్ణుమూర్తి చెప్పగా, బిడ్డ ప్రాణానికి ముప్పు ఉంటుందేమోనని భూదేవి భయపడి కొడుకును రక్షించాలని వేడుకుంటుంది. అయితే, తల్లి వల్లే మరణిస్తాడని విష్ణుమూర్తి చెప్పగా, ‘ఏ తల్లీ కొడుకును చంపేసుకోదు కదా.. కాబట్టి నా బిడ్డకు ఏ ఆపదా రాదులే’ అని భూదేవి ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది.
నరకుడు ప్రాగ్‍జ్యోతిషపురాన్ని రాజధానికి చేసుకుని కొన్ని యుగాల పాటు చక్కగా పాలన సాగించాడు. స్త్రీలను మాతృభావనతో చూడటం అతని సుగుణాల్లో ఒకటి. అయితే, క్రమంగా అతనిలోని మంచి లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగయ్యాయి. దీనికి కారణం, నరకుడు బాణాసురుడితో చేసిన స్నేహం. ఆరు నెలల సహవాసంతో వారు వీరవుతారన్నట్టుగా బాణాసురుడితో మైత్రితో నరకుడు అతనిలోని అసుర లక్షణాలను సంతరించుకున్నాడు. గర్వాంధుడై దేవతలను బాధిస్తూ, మునులను వేధిస్తూ, పరస్త్రీలను చెరపడుతూ లోకకంటుకుడిగా మారాడు.
ద్వాపర యుగంలో దేవతలు, మానవులు సత్యభామ (భూదేవి), శ్రీకృష్ణుల వద్దకు వచ్చి, నరకాసురుడి బారి నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. దీంతో కృష్ణుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. సత్యభామ యుద్ధం చూస్తానని అనడంతో కృష్ణుడు సతీసమేతుడై బయల్దేరాడు.
లేమా! దనుజుల గెలువగ
లేమా? నీవేల కడగి లేచితివిటురా
లే, మాను, మానవేనిన్
లే! మా విల్లందుకొనుము లీలంగేలన్
అంటూ కృష్ణుడు సత్యభామను యుద్ధానికి ప్రేరేపించాడు. ఇంకా..
కొమ్మా! దానవనాధుని
కొమ్మాహవమునకు దొలగె గురువిజయము గై
కొమ్మా మెచ్చితినిచ్చెద
గొమ్మాభరణములు నీవు గోరినవెల్లన్
అంటూ భార్య యుద్ధ నైపుణ్యాన్ని కృష్ణుడు ప్రశంసించాడు. ఇలా లీలగా, హేలగా సత్యభామా శ్రీకృష్ణుడు కలిసి నరకాసురుడిని సంహరించి లోకాలకు భద్రతను, వెలుగును అందించి అందరికీ సంతోషాన్ని కలిగించారు.
ఇంతకీ నరక చతుర్దశి పర్వం మానవాళికి అందించే సందేశం ఏంటి?
నరకాసుర వధ వృత్తాంతం మానవాళికి గొప్ప సందేశం అందిస్తుంది. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి చెడు స్నేహాల చెరలో చిక్కుకుపోవడం వల్ల మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాక, ఒక్కోసారి మన ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తలెత్తుతాయని గ్రహించాలి.
‘మణినా భూషిత:సర్ప: కిమసౌ నభయంకర:’ అన్నట్టు సంపదలను బట్టి స్నేహం కాకుండా, శీలాన్ని బట్టి స్నేహం చేయాలని ఈ వృత్తాంతం చెబుతుంది.
అష్టాదశ పురాణాలలోనూ వ్యాసుడు చెప్పాలనుకున్నవి రెండే రెండు మాటలు.
పరోపకారాయ పుణ్యాయ
పాపాయ పరపీడనం
ఇతరులకు మేలు చేయడమే పుణ్యం. ఇతరులను బాధించడమే పాపం.
సంతానం పాప కార్యాలు చేస్తున్నపుడు, ఇతరులను బాధిస్తున్నపుడు తల్లిదండ్రులు ఉపేక్షించకూడదు. పక్షపాత వైఖరి లేకుండా శిక్షించాలనే కర్తవ్యబోధను చేస్తుంది నరకాసుర వధ అనే కథ.
తల్లిదండ్రులో, పెద్దవాళ్లో ఎవరో మనని దండించే స్థితికి రాకుండా ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతో మెలగాలని అందరికీ ఈ కథ మార్గదర్శనం చేస్తుంది.
నరక చతుర్దశి నాడు విధిగా అభ్యంగన స్నానం చేయాలి. మన తెలుగు మాసాల తిథానుసారం బహుళపక్ష చతుర్దశి మాస శివరాత్రి. ఆనాడు తలంటు నిషిద్ధం. కానీ, ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు తలంటు తప్పనిసరి. వెలుగు రాకముందే నువ్వుల నూనెను తలకు, శరీరానికి పట్టించి, శనగపిండితో నలుగుపెట్టుకుని తలంటుకోవాలి. తర్వాత రాబోయే శీతాకాలానికి తగినట్టుగా శరీరాన్ని సన్నద్ధం చేయడం దీని ఉద్దేశం. నరక చతుర్దశి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి కొలువై ఉంటారట.
ఇక, దీపలక్ష్మిని రోజూ ఆరాధించే సంప్రదాయం మనది. అలాంటిది స్త్రీలు నరక చతుర్దశి నుంచి ప్రారంభించి కార్తీక మాసం అంతా ఉభయ సంధ్యాకాలాలలో దీపాలను వెలిగించాలి. అంతేకాకుండా ఈ నరక చతుర్దశి నాడు సాయం సమయంలో దీపదానం చేయాలి.
నరక చతుర్దశి పర్వదినాన పితృదేవతలను తలుచుకుంటూ సాయంకాలం దక్షిణ దిక్కున దీపాలు వెలిగించడం వలన నరకంలో ఉన్న పితృదణాలు స్వర్గలోక ప్రాప్తి పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, భూలోకవాసులకు యమమార్గాధికారుల నుంచి బాధలు తప్పుతాయని అంటారు. యముడికి ఇష్టమైన మినప పిండివంటలు ఈరోజు నుంచి తప్పక తినాలని అంటారు.
ఇలా ఎన్నో విషయాలతో ముడిపడిన నరక చతుర్దశి పర్వదినం పిల్లలూ, పెద్దలూ అందరికీ కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. చెడుపై మంచే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఈ పర్వం ఇస్తుంది. సాటి మనిషి జీవితంలో నిస్స్వార్ధంగా ఆనందాల వెలుగు నింపడానికి నరక చతుర్దశి పర్వం స్ఫూర్తినిస్తుంది.
ప్రాగ్‍జ్యోతిషపురంలో ‘జ్యోతిష’ అంటే కాంతికలిగిన, ‘ప్రాగ్’ అంటే పోయిన అని అర్థం. అంటే ఒకప్పుడు ఉన్న కాంతిని కోల్పోయిన నగరం అని అర్థం. ఈ ప్రాగ్‍జ్యోతిషపురానికి (ప్రస్తుతం అస్సాంలోని గౌహతి నగరానికి ప్రాగ్‍జ్యోతిషపురం అనేది పూర్వనామం) నరకాసురుడు రాజు. ఒకప్పుడు మనకు మంచి శరీరాలు, మంచి మనసు ఉండేవట. వాటి స్వచ్ఛత ఫలితంగా ఏది కోరుకుంటే అది నెరవేరేదట. ఎప్పుడైతే మనసు ఇంద్రియాల లోలత్వంలో పడిందో అప్పటి నుంచి శరీరాలు, మనసులు మురికిపట్టినట్టు మారిపోయాయి. ‘నేను ఈ శరీరం కాదు.. వేరే ఒకడిని ఉన్నాను’ అని తెలియని స్థితిలో బతికేస్తున్నాం. అటువంటి స్థితి నుంచి బయటపడి పూర్వపు స్థితిని అనుభవానికి తెచ్చుకోవడమే నరక చతుర్దశి పర్వదినం మనకు అందించే దివ్య సందేశం. శరీరం, అది అనుభవించే గుణాలు, జ్ఞానేంద్రియాలు, మనసును అన్నిటినీ శ్రీకృష్ణమయం చేస్తే ఈ ప్రాగ్‍జ్యోతిషపురం అనే మన శరీరం ఆనందమయం అవుతుంది. అంటే కొత్త కాంతిని సంతరించుకుంటుంది. నరకాసురుడి వద్ద ఆ రాజ్యంలోని పదహారు వేల మంది స్త్రీలు బందీలుగా పడి ఉండేవారట. అలాగే రాక్షసరాజైన అతడు రుషులను హింసించే వాడు. తన భార్య సత్యభామ సహకారంతో ఒకానొక నాడు కృష్ణుడు ఈ నరకాసురుడిని వధించాడు. అతని మరణానంతరం ఈ రాజ్యంలోని వారంతా అంధకారం నుంచి వెలుగులోకి వచ్చారు. ఆ సంతోషానికి చిహ్నంగా దీపాలతో అలంకరించుకుని పండుగ చేసుకున్నారు. అదే దీపావళి పండుగ. దీపావళికి ముందు జరుపుకునేదే నరక చతుర్దశి. అయితే ఈ ఏడాది (2022) ఈ రెండు పర్వాలూ ఒకే తేదీన వచ్చాయి
(అక్టోబరు 24, 2022 నరక చతుర్దశి, దీపావళి).
Review మనసంతా వెలుగు.