మనిషి బతుకింతే!

ఒకసారి బ్రహ్మదేవుడు ఈ భూమ్మీద జీవసృష్టి చేస్తూ మొదటగా మనిషిని, ఎద్దును, కుక్కను, గుడ్లగూబను పుట్టించాడు. ఒక్కొక్కరు భూమిపై నలభై సంవత్సరాల చొప్పున బతకండి అని ఆదేశించాడు.
సహజంగానే కోరికలు ఎక్కువగా కలిగిన మనిషి- ‘దేవా! మరీ నలభై సంవత్సరాలేనా?’ అన్నాడు నిరాశగా.
అప్పుడు బ్రహ్మదేవుడు- ‘ఒకసారి తన నోటి నుంచి మాట వెలువడిందీ అంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం, సరిదిద్దడం ఉండదని మనిషికి చెప్పాడు.
అక్కడే ఉన్న ఎద్దు కల్పించుకుని- ‘నాకు నలభై సంవత్సరాలు ఎందుకు స్వామీ! ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బండ్లను లాగుతూ ముల్లకర్రతో పొడిపించుకుంటూ నలభై సంవత్సరాలు బతకడం కష్టమే. దానికంటే ఇరవై సంవత్సరాలు నాకు ఆయుష్షు ఇవ్వండి చాలు’ అని ఇంకా ఎద్దు చెప్పబోతుండగానే, మనిషి వెంటనే అందిపుచ్చుకున్నాడు.
‘ఆ ఎద్దు వద్దంటున్న ఇరవై సంవత్సరాలు నాకు ఇవ్వండి దేవా!’ అన్నాడు మనిషి.
‘మీలో మీరు సర్దుబాటు చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు’ అని చెప్పి ఎద్దు వద్దన్న ఇరవై సంవత్సరాల ఆయుష్షును మనిషి ఖాతాలో కలిపాడు. దీంతో ఇప్పుడు మనిషి ఆయుర్దాయం నలభై నుంచి అరవై సంవత్సరాలకు పెరిగింది.
పక్కనే ఉన్న కుక్క కూడా కల్పించుకుంది.
‘నాకు మాత్రం నలభై సంవత్సరాలు ఎందుకు స్వామీ! ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం.. అందరూ ఛీ.. ఛీ.. అనే బతుక్కి ఇరవై సంవత్సరాలు చాలు’ అంది శునకం.
మళ్లీ మనిషి రెచ్చిపోయాడు. అసలే తన జీవితకాలాన్ని పెంచుకోవాలని చూస్తున్న అతను వెంటనే బ్రహ్మదేవుడితో- ‘కుక్క వద్దంటున్న ఆ ఇరవై సంవత్సరాలు కూడా నా ఖాతాలో కలపండి’ అని కోరాడు.
బ్రహ్మదేవుడు సరేనన్నాడు. దీంతో మనిషి ఆయుర్దాయంలో మళ్లీ మరో ఇరవై సంవత్సరాలు పెరిగాయి. మొత్తం అతని ఆయు:కాలం 80 సంవత్సరాలయ్యింది.
చివరిగా గుడ్లగూబ కూడా బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంది-
‘స్వామీ! నన్ను చూస్తేనే అందరూ అసహ్యంగా, అపశకునంలా భావిస్తూ తల తిప్పేసుకుంటారు. ఎప్పుడూ తల అటూఇటూ తిప్పుతూ కూర్చుంటాను. సరిగా కనిపించదు కూడా. కాబట్టి ఎద్దు, కుక్క మాదిరిగానే నాకూ ఇరవై సంవత్సరాల జీవితకాలం చాలు స్వామీ!’ అంది గుడ్లగూబ.

ఆ అవకాశం కోసమే చూస్తున్న మనిషి ‘గుడ్లగూబ వద్దన్న ఇరవై సంవత్సరాల ఆయుష్షు కూడా నాకే.. నాకే..’ అని మనసులోనే సంబరపడ్డాడు.
అయితే, అందుకు బ్రహ్మదేవుడి అనుమతి కావాలి కాబట్టి ఆయనతో- ‘స్వామీ! దయచేసి ఆ గుడ్లగూబ వద్దన్న ఇరవై సంవత్సరాల ఆయుష్షు కూడా నా జీవితకాలంలోనే కలపండి’ అని ప్రార్థించాడు.
‘నీ కర్మ’ అని మనసులో అనుకుంటూ పైకి ‘సరే’నన్నాడు బ్రహ్మదేవుడు.
తన జీవితకాలం నలభై సంవత్సరాలు.. ఎద్దు, కుక్క, గుడ్లగూబల నుంచి 20 సంవత్సరాల చొప్పున తీసుకున్న ఆయు:కాలం అంతా కలిపి మనిషి ఆయుర్దాయం వంద సంవత్సరాలకు చేరింది.
మనిషి ప్రపంచాన్ని గెలిచినంత సంబరపడ్డాడు.
ఈ కథను బట్టి మనిషి గెలిచాడా?. అది తెలుసుకోవాలంటే ఇది చదవండి మరి..
మనిషి తనకు మొదట లభించిన నలభై ఏళ్లు మాత్రమే మనిషిగా బతుకుతాడు.
ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుంచి తీసుకున్న కారణంగా మనిషి తన 40 – 60 ఏళ్ల మధ్య ఎద్దులా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్లిళ్లు చేసి, ఇల్లు కట్టుకోవడం వంటి వాటి కోసం విపరీతంగా శ్రమిస్తాడు.
ఇక ఆ తరువాత 20 సంవత్సరాలు కుక్క నుంచి తీసుకున్న కారణంగా మనిషి తన 60 – 80 ఏళ్ల మధ్య కాలంలో తన ఇంటికి తానే కాపలాదారుగా మారిపోయి, వచ్చి, వెళ్లే వాళ్ల ఆరా తీస్తూ, కొడుకు, కోడలు, మనవళ్ల ప్రాపకం కోసం పాకులాడుతూ కాలక్షేపం చేస్తాడు.
ఇక, చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుంచి తీసుకున్న కారణంగా మనిషి తన 80 – 100 సంవత్సరాల వయసులో ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్లిపోతానా అని మదనపడుతూ గడుపుతాడు. ఇంట్లో వాళ్లు కూడా ‘ఇతను వెళ్లిపోతాడా?’ అన్నట్టే చూస్తారు. మకాం ఇంట్లో నుంచి వరండాలోకి మారుతుంది. కుక్కి మంచంపై పడి, తల అటూఇటూ తిప్పుతూ, కంటిచూపు సరిగా ఉండక ‘దేవుడు ఎప్పుడు పిలుస్తాడా’ అని ఎదురుచూస్తుంటాడు.

నీతి: దురాశ దు:ఖానికి చేటు. దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదు.

Review మనిషి బతుకింతే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top