‘చతుర వచ్చిందా?’.. ‘విపుల ఉందా?’.. ఈ మాటలు వింటే ఎవరో కుటుంబసభ్యుల గురించి ఆరా తీస్తున్నట్టుగా అనిపిస్తోందా? కానీ, కుటుంబసభ్యుల కంటే కూడా ఎక్కువే ఇవి. 1978 నుంచి నిరాటంకంగా వెలువడుతోన్న ‘చతుర’, ‘విపుల’.. ఇక మనల్ని పలకరించవు. వీటితో పాటు తెలుగువెలుగు (2012), భాల భాకతం (2013) కూడా. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నష్టాలు భరించలేక వీటి ప్రచురణను నిలిపివేస్తున్నట్టు రామోజీ గ్రూపు తరఫున మేనేజింగ్ ట్రస్టీ అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇవి ఏ ఫార్మాట్‍లోనూ (ప్రింట్/డిజి•ల్) కనిపించవు.
చతుర, విపుల, తెలుగు వెలుగు, బాల భారతం.. ఇక ఇవి వెలువడబోవనే ప్రకటనతో తెలుగు పాఠక ప్రపంచం నివ్వెరపోయింది. కోవిడ్ వైరస్ పంజా దెబ్బకు ప్రపంచమే అల్లకల్లోలమైంది. ఇక, ఆయా రంగాల పరిస్థితి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రింట్ మీడియా అయితే కోలుకోలేని విధంగా దెబ్బతింది. పాఠకులు డిజిటల్ వార్తలకే ఎక్కువ మొగ్గు చూపుతుండటం, దినపత్రికలపై పాఠకాసక్తి కోల్పోవడం, ముద్రణ వ్యయం పెరిగిపోవడం, ప్రకటనలు రాకపోవడం వంటి పలు కారణాలతో పత్రికల నిర్వహణ భారంగా మారింది. దీంతో బడా దిన పత్రికలే తమ రోజువారీ పేజీల్లో కొన్నింటిని తగ్గించాయి. ప్రత్యేక పేజీల మాటే లేదు. వీటిని ఈ-పేపర్‍గా ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉంచుతున్నాయి.
ఈ క్రమంలోనే రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు మాస పత్రికల ప్రచురణను నిలిపి వేస్తున్నట్టు ఫౌండేషన్ అధికారికంగా ప్రకటించింది. కరోనా సృష్టించిన కల్లోలానికి తోడు పాఠకుల అభిరుచి మారిపోవడంతో వీటికి ఆదరణ లేదని ముద్రణను నిలిపివేస్తున్నట్టు షౌండేషన్ ప్రకటనను బట్టి తెలుస్తోంది.
1978లో చతుర, విపుల మాస పత్రికలు ప్రారంభమయ్యాయి. విపులలో- ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వేర్వేరు భాషల్లోని కథలను తెలుగులో అనువదించి ఇచ్చేవారు. ఇలా ఇప్పటి వరకు విపులలో ఎనిమిది (8) వేల కథలను ప్రచురించారు.
ఇక, చతురలో ప్రతి నెలా ఒక తెలుగు నవలను అందించే వారు. ఈ మాస పత్రిక ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 518కి పైగా నవలను చతురలో ప్రచురించారు.
ఇక, తెలుగు భాష, సాహిత్య వికాసాలే లక్ష్యంగా 2021, సెప్టెంబర్‍లో తెలుగు వెలుగు మాస పత్రిక ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది విశేష ఆదరణ చూరగొంది. తెలుగు సాహితీ లోకమంతా ముక్తకంఠంతో ‘తెలుగు వెలుగు’ ప్రయత్నాన్ని అభినందించడంతో పాటు తమ వంతు భాషా సేవలను ఈ పత్రికకు సమకూర్చింది. అలాగే, తెలుగు వెలుగు ప్రారంభమైన మరుసటి ఏడాదే 2013, జూన్‍లో బాల భారతం మాస పత్రికను ప్రారంభించారు. పిల్లలకు మాతృభాషపై ఆసక్తి పెంచడం, వినోదంతో పాటుగా విలువలను నేర్పే ఉద్దేశంతో ఈ పత్రికను నడిపారు.
అయితే, ఒక ఉద్దేశంతో ప్రారంభించిన ఈ నాలుగు మాస పత్రికలను నష్టాలు వస్తున్నా నామమాత్రపు ధరకే అందించామని, కానీ, ఆ నష్టాలు మరీ భరించలేని స్థాయికి చేరడంతో.. విధి లేని పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి ఈ నాలుగు మాస పత్రికల ముద్రణను నిలిపివేస్తున్నట్టు రామోజీ ఫౌండేషన్ ప్రకటించింది.
ఇకపై ఈ నాలుగు పత్రికలు ప్రింట్, ఆఫ్‍లైన్, ఆన్‍లైన్.. ఏ ఫార్మాట్‍లోనూ లభ్యం కావు. ఈ నిర్ణయం తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు నిజంగా షాక్ వంటిదే. ముద్రణలో నష్టాలు వస్తున్నాయని భావిస్తే, ఈ పత్రికలను కనీసం ఆన్‍లైన్‍లోనే సాహితీ అభిమానులకు అందుబాటులో ఉంచాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
43 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఇక కనుమరుగు..
చతుర, విపుల మాస పత్రికలవి నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. ఒక నిర్ధిష సాహిత్య ప్రయోజనానికి కట్టుబడి తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి నిరుపమాన సేవలందించిన జంట పత్రికలివి. నిజానికి ‘ఈనాడు’ ప్రారంభించిన రామోజీరావు.. ఈ దినపత్రికలో సాహిత్యానికి స్థానం ఇవ్వలేదు. ఇప్పటికి కూడా. అయితే, తాను సాహిత్యానికి వ్యతిరేకం కాదని చెప్పే ఆయనే, ప్రత్యేకించి సాహిత్యం కోసమే చతుర, విపుల ప్రారంభించారు. వివిధ దేశాల్లోని అత్యుత్తమ కథా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువ చేసిన చరిత్ర విపులది. ప్రతి నెలా స్వల్ప ధరకే ఒక నవలను అందించి ఇంటింటా అందరినీ పలకరించిన ఘనత చతురది. కొద్ది నెలల క్రితమే నష్టాల కారణంగా ఈ రెండు పత్రికలను ముద్రణ నుంచి మినహాయించి.. ఆన్‍లైన్ ఎడిషన్‍గా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఇవీ ఆగిపోతుండటమే విషాదకరం.
1978, ఫిబ్రవరిలో చతుర, విపుల ప్రారంభమైనపుడు వీటి ధర రూపాయి పావలా!
‘ప్రతి నెలా ఒక నవల.. అత్యంత తక్కువ ధరకి’ అనే కాన్సెప్ట్తో చతుర ఇంటింటికీ చేరింది. ఈ పత్రికలో చాలా మంది నవలలు వచ్చాయి. ప్రముఖ రచయితలంతా చతుర కోసం నవలలు రాశారు. ఆ రోజుల్లో కొమ్మిరెడ్డి విశ్వమోహన్‍రెడ్డి నవలలు నాలుగు వరుసగా చతురలో ప్రచురితమయ్యాయట. ఇదో రికార్డుగా అప్పట్లో చెప్పుకునే వారు. ఇక, చతుర వంద సంచికలు పూర్తయిన సందర్భంగా పెట్టిన నవలల పోటీలో ఓల్గా రాసిన ‘స్వేచ్ఛ’కు మొదటి బహుమతి లభించింది. చతురలో వచ్చిన చాలా నవలలు సినిమాలుగానూ రూపొందాయి.
ఇక, ప్రపంచ సాహిత్యాన్ని మన భాషలోకి అనువదించి అందరికీ చేరవేయడం.. ఈ పనిని బహుశా విపుల మాత్రమే చేసిందనేది కాదనలేని సత్యం. మన తెలుగునాట సరే.. అసలు ప్రపంచంలోని వేరే దేశాల్లో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరగలేదనే చెప్పాలి. విపులలో వచ్చే వివిధ దేశాల కథలు చదవడం, తద్వారా అక్కడి సంస్క•తీ సంప్రదాయాలను గురించి తెలుసుకోవడం తెలుగు పాఠకుల అభిరుచిలో భాగంగా మారిపోయింది. ఆయా దేశాల నవలలను, కథలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఎంతోమంది అనువాదకులకు చేతినిండా పని కల్పించింది విపుల. కరోనా సృష్టించిన కల్లోలమా? మరేదైనా కారణమా? తెలియదు కానీ నలభై మూడేళ్ల పాటు నిరాటంకంగా నడిచిన లెజండరీ మాస పత్రికలు మూతపడటం ఒక విషాదం. దీంతో పీరియాడికల్స్ పత్రికలు మాయమైపోతున్న చరిత్రలో చతుర, విపుల కూడా ఆగిపోవడంతో పీరియాడికల్స్ శకం ఇక ఆగిపోయినట్టే.
ఎనిమిదేళ్ల ప్రాయంలోనే..
ఇక, తెలుగు వెలుగు, బాల భారతం మాస పత్రికలది మరో కథ. 2012లో తెలుగు వెలుగు ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే పిల్లల కోసం చాలా ఉత్తమ ప్రమాణాలతో బాల భారతం ప్రారంభమైంది. తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం ప్రారంభించిన తెలుగు వెలుగు పత్రిక ఒక వెలుగు వెలిగింది. తెలుగు భాషాభిమానుల వ్యాసాలు, తెలుగుకు పట్టం కట్టాలంటే ఏం చేయాలనే చర్చలు.. మన సంస్క•తీ సంప్రదాయాలు, కనుమరుగైపోతున్న పదబంధాలు.. ఇత్యాది ఎన్నో విషయాలపై ఆసక్తికరమైన కథనాలను ఈ పత్రిక ప్రచురించింది.
మరోపక్క పిల్లల్లో నైతిక విలువలను పెంచడం, వారిలో భాషాభిమానాన్ని చిన్ననాటే రేకెత్తించడమే లక్ష్యంగా బాల భారతం ఉత్తమ ప్రమాణాలతో వెలువడింది. ఈ రెండు పత్రికలు కూడా కాల గమనంలో కలిసిపోవడం దురదృష్టకరం. ఈ రెండు పత్రికలు ప్రారంభమైన ఎనిమిది సంవత్సరాలకే ముద్రణ ఆగిపోవడం.. అదీ రామోజీరావు వంటి మీడియా మొఘల్.. ఈ నిర్ణయం తీసుకోవడం చాలామందికి మింగుడుపడని అంశమే.
నిరాదరణే కారణమా?
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు ఏదైనా ప్రారంభించారంటే దానిని విజయవంతం చేసి తీరుతారని ఒక పేరు. అటువంటి సంస్థ నుంచి వెలువడే నాలుగు పత్రికలు ఒకేసారి ఆగిపోవడం అనేది అందరినీ షాక్‍కు గురిచేస్తోంది. ఈ పత్రికలను నిలిపివేయడం గురించి రామోజీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ.. తన వెబ్‍సైట్‍లో ఒక సుదీర్ఘ లేఖను ఉంచింది. దాని ప్రకారం.. కరోనా అనంతర పరిణామాలు, ఫలితంగా మీడియా రంగంలో ఏర్పడిన ఒడిదుడుకులు ఈ పత్రికల ఆయువు తీసినట్టు కనిపిస్తోంది. నిజానికి ఈ నాలుగు పత్రికల ముద్రణను చాలా నెలల క్రితమే ఆపివేసి.. కేవలం ఆన్‍లైన్ ఎడిషన్‍లో మాత్రం అందుబాటులో ఉంచేవారు. ఆన్‍లైన్‍లో చదివే వెసులుబాటు అందరికీ లేకున్నా.. మొత్తానికి ఏదో విధంగా నాలుగు మంచి పత్రికల మనుగడ కొనసాగుతోందని, అందుబాటులో ఉన్నాయని తెలుగు భాషాభిమానులు, సాహితీప్రియులు సరిపెట్టుకున్నారు. కరోనా సంక్షోభం ముగిశాక.. ఇవి తిరిగి ముద్రణ రూపంలో అందుతాయని భావించారు. అయితే, పెరుగుతున్న ముద్రణ భారం, అంతర్జాతీయంగా మీడియాలో వస్తున్న మార్పుల కారణంగా వీటిని మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడం అభిమానులు కంగుతిన్నారు. కరోనా దెబ్బకు ‘ఈనాడు’ వంటి లెజండరీ సంస్థ కూడా చిగురుటాకులా వణికిపోయిందా? అనేది అంతుబట్టని విషయం. వీటిని తిరిగి ఆన్‍లైన్ రూపంలోనైనా అందించాలనేది తెలుగు పాఠకుల కోరిక.
ప్రియమైన
తెలుగుపత్రిక పాఠకులకు..
‘నిత్యం ఉషోదయాన సత్యం నినదించినట్టుగా..’ ఎన్నటికీ, ఎప్పటికీ ఈనాడు గ్రూపు సంస్థల నుంచి ప్రచురణలు కొనసాగుతూనే ఉంటాయని దేశ విదేశాల్లోని తెలుగు పాఠకులు భావించారు. కానీ, కరోనా సృష్టించిన సంక్షోభం ఈ నినాదాన్ని మింగేసింది. మీడియా రంగంలో గుత్తాధిపత్యాన్ని ఏళ్లపాటు కొనసాగిస్తున్న సంస్థ.. చతుర, విపుల, తెలుగు వెలుగు, బాల భారతం పత్రికలను మూసివేయడం బాధాకరం. కరోనా సంక్షోభానికి తోడు మారుతున్న పాఠకుల అభిరుచి, భాష, సాహితీ అంశాలకు ఆదరణ లేకపోవడం వంటి కారణాలు ఇంకా గుండెల్ని మెలిపెడుతున్నాయి.
మన ‘తెలుగు’ సంస్క•తీ, సంప్రదాయాలు, భాషా సాహిత్యాలకు ఆదరణ లేకపోవడం అంటే అర్థమేంటి? మన గురించి మనమే చదువుకోవడం ఇష్టం లేదనేగా? ‘తెలుగు’కు మార్కెట్ లేదా? అవుననే చెప్పాల్సి రావడం విషాదం.
మారుతున్న సాంకేతిక విప్లవం, మీడియా ధోరణులు, అంతర్జాల విస్త•తి, పాఠకుల అభిరుచుల్లో మార్పు కూడా తమ పత్రికల మూసివేతకు ఒక కారణమని రామోజీ షౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రకటించింది.
నిజంగా ఈ పరిణామం దురదృష్టకమే.
ఇదే క్రమంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశీ గడ్డపై ‘తెలుగు పత్రిక’ కొన్ని సంవత్సరాలుగా వెలువడుతోంది.
మన భారతీయ, తెలుగు సంస్క•తీ సంప్రదాయాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విశేషాలతో వెలువడుతున్న ఈ పత్రిక కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
అయినా వెరవకుండా, తెలుగు భాషా, సంస్క•తుల సేవకు కట్టుబడి తన ప్రస్థానాన్ని భారంగానైనా కొనసాగిస్తోంది.
విజ్ఞులైన తెలుగు పాఠకులు ఇటువంటి పత్రికలను ఆదరించడంతో పాటు ప్రకటనలు, స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం తదితర రూపాల్లో ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మారుతున్న ధోరణులతో మనం మన అభిరుచులను మార్చుకుంటుండొచ్చు. కానీ, మన మూలాలను తెలిపే, మన ఆపాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఇటువంటి పత్రికలను పది కాలాల పాటు నిలుపుకునే బాధ్యత మనపైనే ఉంది. లేదంటే భావి తరాలకు మన గురించి మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.
విజ్ఞులైన తెలుగు పాఠకులు, భాషాభిమానులు, భారతీయ సంస్క•తీ ప్రియులు ఈ విషయమై పునరాలోచించాలని, తెలుగు పత్రికను ‘మన పత్రిక’గా చేసుకుని ఆదరించాలని కోరుకుంటూ..
Review రామోజీ సర్.. ఆలోచించండి.