పేరుకే పిల్లల కథలు.. పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. అటువంటి కొన్ని కథల పరిచయం.
మన గుణాలు, ప్రవర్తన మనం తినే ఆహారం మీద, మనం చేసే స్నేహాల మీద, మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి.
అందుకు ఈ కథ చిన్న ఉదాహరణ.
ఒక మర్రిచెట్టుపై రెండు చిలుక పిల్లలు ఉండేవి. ఒక బోయవాడు వలపన్ని వాటిని పట్టుకుని ఒకటి సాధువుకు, మరొకటి సైనికుడికి విక్రయించాడు. ఆ సాధువు దానికి ‘రాముడు’ అని పేరు పెట్టి, గోదావరీ తీరంలోని మాటలు, ప్రవర్తన నేర్పుతూ తన ఇంటిలో దానిని పెంచుకోసాగాడు. సైనికుడు తన చిలుక పిల్లకు ‘దుర్ముఖుడు’ అని పేరు పెట్టాడు. దానిని పంజరంలో బంధించి దాని బాగోగులు చూడసాగాడు. ‘రాముడు’ చిలుక ఆ సాధువు ఇంట్లో మధురమైన మాటలతో, మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. సాత్త్విక ఆహారాన్ని తిని, అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకుని ఇంటికి వచ్చిన వారందరికీ తన మంచి మాటలతో, చిలుక పలుకులతో సంతోషపెడుతూ అలరించేది.‘దుర్ముముఖు’ చిలుక సైనికుడి ఇంట్లో మాట్లాడే దుష్ట వాక్యాల్ని వినడం వల్ల, హింసాపూరిత కార్యాల్ని చూస్తుండటం వల్ల రోజు రోజుకీ దుష్ట సంస్కారాన్ని పొంది, సైనికుడి ఇంటికి వచ్చే వారందరితో పరుషమైన మాటలు మాట్లాడుతూ, ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది.
ఇలా రెండు చిలుకలు తమ పరిసరాల పరిశీలనను బట్టి, తమను పెంచి పోషిస్తున్న వారి స్వభావ సంస్కారాలను బట్టి ఆయా దృక్పథాలను పొందాయి. కొంత కాలానికి పంజరం నుంచి ఎగిరిపోవాలని రెండు చిలుకలు తలపోశాయి. ఒకనాడు యజమానుల కళ్లుగప్పి పంజరం నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయాయి. రాముడు చిలుక మామిడి చెట్టు మీద, దుర్ముఖుడు చిలుక మర్రి చెట్టు మీద తొర్రల్లో గూడు ఏర్పాటు చేసుకుని ఉండసాగాయి.ఒకసారి ఒక బాటసారి ఆ దారిన వెళ్తూ ఎండకి అలసిపోయి దుర్ముఖుడు ఉంటున్న మర్రిచెట్టు కింద నడుం వాల్చాడు. అతనిని చూడగానే దుర్ముఖుడు ఇతర పక్షులతో- ‘ఎవరో మనిషి ఇక్కడకు వచ్చాడు. వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి’ అంటూ ఇరుగుపొరుగు పక్షులంన్నిటినీ తీసుకుని వచ్చింది. దీంతో బాటసారి వాటి ధోరణిని కనిపెట్టి భయపడి రాముడు చిలుక ఉంటున్న మామిడిచెట్టు కిందకు వచ్చాడు. రాముడు చిలుక ఆ బాటసారిని గమనించి, ఇతర పక్షులతో- ‘ఎవరో అతిథి వేసవి తాపానికి అలసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు కిందకు వచ్చాడు. స్వాగతం పలికి, పండ్లను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి. ఆపై ఆయనకు సేవ చేసి తరించండి అని పురమాయించింది.
ఇద్దరు పిల్లలు ఒకే తల్లి కడుపున పుట్టినా వారి ప్రవర్తన ఒకే విధంగా ఉంటుందని, ఉండాలని భావించలేం. పెరిగిన వాతావరణాన్ని బట్టి వారికి చెడు లేదా మంచి ప్రవర్తనలు అలవడుతాయని ఈ కథ చాటుతుంది.
Review రెండు చిలుకలా కథ.