ధనుర్మాసం ప్రారంభం కాగానే వినిపించే పేర్లు- గోదాదేవి, తిరుప్పావై పాశురాలు..శ్రీరంగనాథుడు. ఆ విశేషాల నేపథ్యమేమిటంటే..
తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతంలోని తులసి వనంలో గోదాదేవి అయోనిజగా దర్శనమిచ్చింది. విష్ణుచిత్తుడనే భక్తుడు ఆమెను ప్రేమతో పెంచి పెద్ద చేస్తాడు. గోదాదేవి బాల్యం నుంచీ శ్రీరంగనాథుడిని పవిత్రంగా కొలుస్తుండేది. క్రమేణా ఆ సర్వాంతర్యామినే తన భర్తగా ఊహించుకుంటూ ఆ పరమాత్ముడిని పొందడం కోసం నిత్యం ఇంటిని శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులూ, పూలతో వాకిలిని అందంగా అలంకరించి ధనుర్మాస వ్రతాన్ని చేపట్టేది. నెల రోజుల పాటు పాశురాలు (తిరుప్పావై ప్రబంధంలోని భక్తి గీతాలు) ఆలపిస్తూ శ్రీరంగనాథుడికి తానే సరిజోడని మురిసిపోతూ ఆయన కోసం పూలమాలలను అల్లి ఆ దేవాధిదేవుడికి సమర్పిస్తుండేది. ఒకరోజు విష్ణుచిత్తుడు.. శ్రీరంగనాథుడికి సమర్పించిన పూలమాలలో ఓ వెంట్రుకను గమనిస్తాడు. స్వామికి అర్పించే ముందు ఆ దండలను గోదాదేవి ధరిస్తోందని తెలుసుకుంటాడు.
‘స్వామీ! మహాపరాధం జరిగిపోయింది. మమ్మల్ని క్షమించండి’ అని విష్ణుచిత్తుడు రంగనాథుడిని వేడుకుంటాడు.
‘స్వామి ఆశీర్వాదం తీసుకోవడం వరకే మనకు అర్హత. అంతేగాని మనం ధరించిన వాటిని రంగనాథుడికి అర్పించడం, ఆయనను వరించాలని వ్రతం చేయడం మహాపరాధం’ అంటూ విష్ణుచిత్తుడు గోదాదేవిని మందలిస్తాడు.
అయినా పట్టువిడవకుండా గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని కొనసాగిస్తూ ఆ పరమాత్ముడికి తను పట్టపురాణిని అవుతానంటూ ప్రతినబూనింది.
ఒకరోజు శ్రీరంగనాథుడే కలలో కనిపించి, గోదాదేవితో తన కల్యాణానికి అనుమతి ఇవ్వాలని కోరడంతో విష్ణుచిత్తుడు అంగీకరిస్తాడు. తరువాత గోదాదేవి రంగనాథ స్వామిలో ఐక్యమైపోతుంది.
శ్రీమహావిష్ణువు దేవేరులు భూదేవి, శ్రీదేవి అని తెలుసు కదా! వీరిలో భూదేవి అవతారానికి ప్రతీకగా గోదాదేవిని చెబుతారు. ఆమెకు ఆండాళ్ అనే పేరు కూడా ఉంది. ఆమె భగవంతునిలో ఐక్యమైన అద్భుత ఘట్టానికి ప్రతీకగా మూడు రోజుల సంక్రాంతి పర్వంలోని మొదటిదైన భోగి రోజున వైష్ణవాలయాల్లో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తారు. అప్పటికి ధనుర్మాసం ముగింపునకు వస్తుంది.
ఇలా గోదాదేవి సంప్రదాయాన్ని అనుసరించే.. కోరిన కోరికలు నెరవేరాలని, మంచి వరుడు రావాలని యువతులు ధనుర్మాసంలో పవిత్రంగా పూజలు చేస్తారని చెబుతారు.
యువతులు ధనుర్మాసంలో వేకువజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని దీపాలు వెలిగిస్తారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి భోగి పండుగ వరకు పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. గోదాదేవి నెల రోజుల పాటు గానం చేసిన ముప్పై పాశురాలను రోజుకొకటి చొప్పున పాడుతుంటారు. ఇలా లోగిళ్లను అందంగా తీర్చిదిద్ది పూజలు చేయడం వలన కోరిన వరుడు వస్తాడని పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల విశ్వాసం.





































































































































































































































































































































































Review విరులు సమర్పించి.. కోరి వరించి...