
రాముడు ధర్మానికి ప్రతీక. ఆదర్శ మానవుడు. మనిషి పరిపూర్ణతను సాధించి చివరకు దేవతల నమస్కారాలనే అందుకున్న భగవంతుడు. శ్రీరాముడిని స్తుతించే స్తోత్రాలలో శ్రీరామ రక్షా స్తోత్రమ్ అనర్ఘమైనది. దీనిని బుధ కౌశిక మహర్షి రచించారు. ఒకనాటి తెల్లవారుజాము వేళ పరమశివుడు సాక్షాత్కారమై మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించారని అంటారు. దివ్యమైన రామనామంతో నిరంతరం లయిస్తుంటానని పార్వతీదేవికి శివుడు ఒక సందర్భంలో చెప్పాడని అంటారు. ఈ స్తోత్రంలోని కొన్నిటి అర్థతాత్పర్యాలు..
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ।।
శ్రీరఘునాథుని చరిత్ర శతకోటి పరివ్యాప్తం. దానిలోని ప్రతి అక్షరం మానవమాత్రుని మహా పాపాలను నశింపచేస్తుంది.
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర: ప్రియ: శ్రుతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సల: ।।
కౌసల్యానందనుడు నేత్రాలను రక్షించు గాక! విశ్వామిత్ర ప్రియుడు కర్ణాలను సురక్షితంగా ఉంచుగాక! యజ్ఞ రక్షకుడు జానేంద్రియాలను, సౌమిత్రి వత్సలుడు ముఖాన్ని రక్షించుగాక!.
పాతాళ భూతల వ్యోమ చారిణ శ్చద్మచారిణ: ।
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభి: ।।
పృథివ్యాకాశ పాతాళ లోకాలలో ఛద్మవేషంతో పరిభ్రమించే ఏ జీవి అయినా సరే రామనామ సురక్షితుడైనట్టి పురుషుడిని కన్నెత్తి కూడా చూడలేదు.
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ।।
‘రామ’, ‘రామభద్ర’, ‘రామచంద్ర’- ఈ నామాలను స్మరించడం వలన మనిషి పాప విముక్తుడు కావడమే కాక భోగ మోక్షాలనూ పొందుతాడు.
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితమ్:।
య: కంఠే ధారయేత్తస్య కరస్థా: సర్వ సిద్ధయ: ।।
జగత్తును జయించే ఏకమాత్ర మంత్రమైన రామనామంలో సురక్షితమైన ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసే వ్యక్తికి సకల సిద్ధులూ కరతలామలకం.
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞ: సర్వత్ర లభతే జయమంగళమ్ ।।
వజ్రపంజర నామకమైన ఈ రామకవచాన్ని స్మరించే వ్యక్తి ఆజ్ఞలనెవరూ ఉల్లంఘించలేరు. అతడికి సర్వేసర్వత్రా జయ మంగళాలు ప్రాప్తిస్తాయి.
రూపం రమ్యం..
నామం రమణీయం
అటూఇటూ సీతాలక్ష్మణుడు, పాదాల చెంత హనుమంతుడు, నడుమ కొలువున్న రామభద్రుని ముద్ర (రూపం).. ఇది ప్రసిద్ధి చెందిన రామమూర్తి.
‘వామభాగాన సీత, కుడివైపు లక్ష్మణుడు, ఆ వైపునే పాదాల చెంత కూర్చుని ఉన్న హనుమంతుడు.. మధ్యన భాసిల్లే రాముడు’ అనే భావార్థ వర్ణనలు, ధ్యాన శ్లోకాలు రామాయణంలో చాలా ఉన్నాయి.
కుడివైపు శక్తికి, ఎడమ వైపు భక్తికి రాముడే ఆలంబన. అందుకే వాటికి కేంద్రమై నడుమ
ఉన్నాడు శ్రీరాముడు. ఆశ్రయించుకున్న శక్తీ, అర్పించకున్న భక్తి ఆ జగదేక సార్వభౌముడి సొంతం. ఆ రమ్యభావమే ఈ నాలుగు మూర్తుల కొలువులో ధ్వనించే తత్త్వం.
ప్రతి రామ రూపం శాస్త్ర సమ్మతమైన దివ్యభావాలకు సాకారమే.
లక్ష్మణ సమేతంగా ఉన్న రాముడు రక్షా స్వరూపమని ఉపాసనా శాస్త్రాలు చెబుతున్నాయి.
‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ’ అని హనుమంతుడు రాముడిని ప్రార్థించాడు. హనుమత్సమేత రాముడు జ్ఞానానికి, అభయానికి వ్యక్తీకరణ రూపం. సీతమ్మతో కూడిన రాముడు సర్వసంపదలకు అధినాథుడని భావం.
మొత్తానికి రామ రూపమే రమణీయం. రామ నామమే కడు రమ్యం. కల్పవృక్షాలతో కూడిన ఉద్యానవం వంటి వాడూ, సమస్త ఆపదలనూ రూపుమాపే వాడూ, ముల్లోకాల్లోనూ అత్యంత సుందరుడూ అయిన శ్రీరామచంద్రుడే మన ప్రభువు.
Review శ్రీరామ రక్ష.. సర్వజగద్రక్ష.