
‘‘గాడిద కొడకా అంటే.. తమరు తండ్రులు,
మేం బిడ్డలం అన్నాట్ట’’
కొన్ని సామెతల్లో అర్థాల కంటే హాస్యమే ఎక్కువ తొంగి చూస్తుంది. ఎవరినైనా ఏదైనా అంటే, వెంటనే తగిన సమాధానం చెప్పడం అనే ధోరణి నుంచి ఇటువంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు నేటి సినిమాల్లో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో ‘ఏం చేస్తుంటారు?’ అని అడిగితే, ‘ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాను’ అని ఠక్కున బదులిస్తాడు. ఇటువంటివే ప్రస్తుతం సినిమాల్లో ‘పంచ్’ డైలాగులుగా పేరొందాయి. అటువంటి డైలాగుల సరసన నిలిచేటటువంటి సామెత- ‘గాడిద కొడకా అంటే, అవును మరి! తమరు తండ్రులు. మేం కొడుకులం’. ఎదుటి వారిపై కోపంతోనో లేదా కించపరిచే లాగునో ఇటువంటివి ఉపయోగించినపుడు వెంటనే అందుకు బదులుగా వచ్చే ఉపయోగించే సామెతలివి. ఒకాయన తానప్పగించిన పని సరిగా చేయలేదని ‘గాడిద కొడకా..’ అని సంబోధిస్తూ మాట్లాడాడు. వెంటనే ఆ జీతగాడు ‘అవును. తమరు తండ్రులు. మేం బిడ్డలం’ అని బదులిచ్చాడు. ఇదీ సందర్భం. ఒక్కోసారి ఇటువంటి సామెతల ప్రయోగం.. అందుకు ప్రతిగా స్పందించడం అనేవి ఘర్షణలకు కూడా దారితీసే ప్రమాదం ఉంది సుమా!. కాబట్టి సామెతలైనా, పొడుపు కథలైనా, జాతీయాలనైనా ఆచితూచి ఉపయోగించాల్సి ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు పడక తప్పదు. అన్ని సామెతలను, అన్ని వేళలా, అన్నిచోట్లా ఉపయోగించలేమనే విషయాన్ని అందరూ గమనించాలి.
పగటి మాటలు పనికి చేటు రాత్రి మాటలు నిద్రకు చేటు’’
సమయానుగుణంగా, సమయాను కూలంగా మనిషి నడుచుకోవాలనే గొప్ప వ్యక్తిత్వ పాఠాన్ని ఈ సామెత మనకు నేర్పుతుంది.
సాధారణంగా మన దినచర్య అంతా పగటి వేళలోనే ఉంటుంది. అంటే, ఈ సమయంలోనే మనం ఆయా రోజువారీ పనుల్ని చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తానికి వర్తించే విషయం. అటువంటి సమయంలో ఉబుసుపోని కబుర్లు, కాలక్షేపం కహానీలు చెప్పుకుంటూ గడిపేయరాదనే నీతిని ఈ సామెత బోధిస్తుంది. పగటి వేళ పని చేయడం మానుకుని పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం వల్ల పూట గడవదు. అది కుటుంబపోషణకు ఏమాత్రం ఉపకరించదు. పైగా ఏ
ఉపయోగం ఉండదు.
అదేవిధంగా పగలంతా శ్రమించి రాత్రికి విశ్రమించేలా మన మానవ జీవితాలు రూపొందించబడ్డాయి. అటువంటి విశ్రాంతి సమయాన్ని కూడా కాలక్షేపం కబుర్లతో వృథా చేసుకోకూడదు. రాత్రంతా కించిత్తు ఉపయోగం లేని కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తే తెల్లారి నిద్ర వెంటనే లేవలేం. అలాగే, ఆ రోజు చేయాల్సిన పనులను చేయలేం. దీనివల్ల మనిషి జీవితం రెంటికీ చెడిన రేవడి అవుతుంది.
అలా కాకూడదనేదే ఈ సామెత సారాంశం.
పగటి వేళలో, రాత్రిళ్లు చాలామంది యువకులు ఎక్కడ చూసినా.. సమూహంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తుంటారు. వారి వల్ల వారికి కానీ, వారి కుటుంబానికి కానీ కాణీ ఉపకారం జరగదు. అటువంటి కబుర్లు కట్టిపెట్టి ఏదైనా ప్రయత్నం చేస్తే పని దొరుకుతుంది.
Review సామెత కథ.