మంత్రపుష్పం

సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన వేదమంత్రం- గాయత్రీ మంత్రం. సూర్యుడి (సవితు)ని ఉద్దేశించి బుద్ధిని సన్మార్గంలో నడపాలని కోరే ప్రార్థన ఇది. రుగ్వేదంలోని ఈ మంత్రాన్ని తొలుత విశ్వామిత్ర మహర్షి దర్శించి లోకానికి పరిచయం చేశారు. దీనిని నిత్యం జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయి.

న గాయత్య్రా: పరంమంత్రం నమాతు: పరదైవతమ్‍
తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదని పై శ్లోకార్థం.
‘గయ’, ‘త్రాయతి’ అనే పదాలతో కూడినది ‘గాయత్రి’.
‘గయాన్‍ త్రాయతే ఇతి గాయత్రి’ అని ఆదిశంకరులు తన భాష్యంలో వివరించారు. ‘గయలు’ అంటే ప్రాణాలు. ‘త్రాయతే’ అంటే రక్షించడం. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రీ మంత్రం.
వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదట ఒక్కో గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి 24 అక్షరాలతో 24 వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణాన్ని రచించారు.
ఇది గాయత్రి మంత్రం:
ఓం భూర్భువస్వ:
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోన: ప్రచోదయాత్‍
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక్కో బీజాక్షరమని, అది మహిమాన్వితమైనదని మన మహర్షులు చెప్పారు. ఈ ఒక్క మంత్రం జపిస్తే సర్వ దేవతలను స్తుతించినట్టే.
ఇదీ గాయత్రీ మంత్రార్థం:
ఓం= పరమేశ్వరుడు సర్వ రక్షకుడు
భూ:= సత్‍ స్వరూపుడు (ఉనికి గలవాడు)
భువ:= చిత్‍ (జ్ఞాన) స్వరూపుడు
స్వ:= ఆనంద స్వరూపుడు (దు:ఖ రహితుడు)
తత్‍= అటువంటి సచ్చిదానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు
సవితు:= ఈ సృష్టికర్త
వరేణ్యం= సుఖ స్వరూపుడగుటచే జీవులందరిచే ఆరాధింపబడేవాడు
భర్గ:= శుద్ధ స్వరూపుడు (పాపరహితుడు)
దేవస్య:= అటువంటి అనేక దివ్య గుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపము
ధీమహి= హృదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
య:= ఆ పరమేశ్వరుడు
న:ద్య:= మా బుద్ధులను
ప్రచోదయాత్‍= సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములను పొందేలా సమర్థం చేయుగాక!
గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది. ఈ 24 దేవతా మూర్తులకు మూలాధారమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు లభిస్తాయని మహర్షుల ఉవాచ.
(2026, జూన్‍ 24: గాయత్రి జయంతి)

చతుర్వింశతి గాయత్రి
గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు దేవతామూర్తుల శక్తి మిళితమై ఉంది. అందుకే ఈ ఇరవై నాలుగు దేవతామూర్తులకు చతుర్వింశతి గాయత్రి అని పేరు. గాయత్రి మంత్రంలోని 24 దేవతా మూర్తులు, వారికి సంకేతమైన అక్షరాలు..
తత్‍: విఘ్నేశ్వరుడు
స: నరసింహస్వామి
వి: మహావిష్ణువు
తు: శివుడు
వ: శ్రీకృష్ణుడు, రే: రాధాదేవి
ణ్యం: శ్రీమహాలక్ష్మి
భ: అగ్నిదేవుడు
ర్గో: ఇంద్రుడు, దే: సరస్వతీదేవి
వ: దుర్గాదేవి,
స్య: ఆంజనేయస్వామి
ధీ: భూదేవి, మ: సూర్యభగవానుడు
హి: శ్రీరాముడు, ధి: సీతాదేవి
యో: చంద్రుడు, యో: యముడు
న: బ్రహ్మ, ప్ర: వరుణుడు
చో: శ్రీమన్నారాయణుడు
ద: హయగ్రీవుడు
య: హంసదేవత
త్‍: తులసీమాత

Review మంత్రపుష్పం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top