ఉత్తమ ధర్మం

ఆధ్యాత్మి‘కథ’

ఏరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.
ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి
ఈశ్వరునితో ఇలా అంది-
‘మహాదేవా! ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా! అందులో ఉత్తమమైన ధర్మం ఏది?’ అని అడి గింది.
అందుకు పరమేశ్వరుడు- ‘పర్వతరాజపుత్రీ! పురుషార్థములు నాలుగు. అవి- ధర్మము, అర్థము, కామము, మోక్షము. అందులో మొదటి మూడు అయిన ధర్మ, అర్థ, కామములు వలన కలిగే సుఖములు అశాశ్వతములు. అవి ఎన్నటి కైనా నశిస్తాయి. కానీ, చివరిది అయిన మోక్షము శాశ్వతమైనది. సుఖప్రదమైనది. అది ఎన్నటికీ నశించదు. కనుక మొదటి మూడు పురుషార్థ ముల కంటే మోక్షము అత్యుత్తమమైనది. అటు వంటి మోక్షమును ఎలా పొందాలో నేను నీకు చెబుతాను విను’ అంటూ ఇలా వివరించాడు.
‘మానవుడు గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత రుణములు అన్నీ తీర్చుకుంటాడు. అంటే, దేవ రుణం, పితృ రుణం, రుషి రుణం, మనుష్య రుణం తీర్చుకుంటాడు. తరువాత వానప్రస్థమునకు వెళ్తాడు. అక్కడ అడవులలో నివసిస్తాడు. ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన మనసుతో మునుల నుంచి ప్రసాదములను అభ్యసిస్తాడు. సాంఖ్యం అంటే, 25 తత్వముల యొక్క జ్ఞానమును తెలుసుకోవడమే. తరువాత యోగాభ్యాసము చేస్తాడు. సాంఖ్యము, యోగము.. రెండూ ఒక్కటే. తరువాత సుఖదుఖాలు, రాగద్వేష ములు మొదలైన ద్వందములను జయిస్తాడు. తరువాత శౌచము, బ్రహ్మచర్యము, శాంత జీవనం, మితాహారం తీసుకోవడం వంటివి పాటి స్తాడు. మనసును అంతర్ముఖం చేస్తాడు. మధ్య మధ్య వచ్చే అవాంతరాలను తొలగించుకుంటూ మోక్ష మార్గాన పయనిస్తాడు. ఇదీ మోక్ష మార్గం. ఇది నిరంతర అభ్యాసము వలన మాత్రమే కలుగుతుంది. ఈ మోక్ష మార్గమును మానవుడిని జనన మరణ చక్రం నుంచి విముక్తిడిని చేస్తుంది.
మానవుడు సంసారం నుంచి విముఖత చెంద నంత వరకు మోక్ష మార్గంలో పయనించలేడు. ఈ ప్రాపంచిక విషయాల మీద మనసు విరక్తి కలిగినపుడే మానవుడు మోక్షమును పొందగలడు.
పార్వతీ! మనసులో ఉన్న చింతలన్నీ వదిలి పెడితే కానీ అందరియందు సమానత్వం, సమ భావన కలిగి కానీ తృష్ణ, ఆశ, లోభత్వం విడిచిపెడితే కానీ, పైన చెప్పిన విరక్తి కలగదు. వాటి స్వభావం గురించి వివరిస్తాను. విను.
ధనం ఉన్నా పోయినా, దగ్గరి బంధువులు చనిపోయినా విరక్తి భావంతో ఉన్న వాడు వాటి గురించి చింతించడు. లేదా విచారించడం మాను
కోవాలి. పోయిన ధనం గురించి, చనిపోయిన బంధువుల గురించి దు:ఖించడం వల్ల దు:ఖం పెరుగుతుందే కానీ తరగదు. కనుక దు:ఖించడం అనవసరం.
ఎందుకంటే, సుఖం, దు:ఖం ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతుంటాయి. స్వర్గలోకాధిపతి దేవేంద్రుడికి కూడా సుఖం, దు:ఖము ఒకదాని వెంట మరొకటి కలిగాయి. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే ప్రతి ప్రాణి ప్రతి వస్తువు పరిణామం చెందడం కానీ, నాశనం కావడం కానీ తథ్యం. ఈ సత్యం తెలిస్తే దు:ఖం కలగదు. కనుక నాశనం అయ్యే వాటి గురించి చింతించడం అవివేకం. ఇతరుల నుంచి ధనమును, వస్తువును స్వీకరించే వాడు పట్టు పురుగు తన దారములతో తనను ఎలా బంధించుకుంటుందో అలా తనను బంధించుకుంటాడు.
పార్వతీ! మానవుడికి ధనం సంపాదించడం, సంపాదించిన ధనాన్ని కాపాడుకోవడం, ఆ ధనమును ఖర్చు చేయడం, ఆ ధనము పోతే మళ్లీ దానిని సంపాదించేందుకు ప్రయత్నించడం లేదా పోయిన దాని కోసం దు:ఖించడం ప్రధాన వ్యాపకాలు. కనుక ధనము అన్ని దు:ఖములకు మూల కారణం. ధనం లేకపోతే దు:ఖం ఉండదు’ అని పార్వతికి ఈశ్వరుడు ఉత్తమమైన మోక్ష ధర్మం గురించి వివరించాడు.

Review ఉత్తమ ధర్మం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top