మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం
తిలోదకాలు
ఆ వస్తువులు ఇక రావు, ఆ డబ్బు ఇక తిరిగి రాదు అని చెప్పాల్సిన సందర్భాల్లో ఉప యోగించే జాతీయం ఇది.
నువ్వులను తిలలు అని అంటారు. నీటిని ఉదకం అని అంటారు. ఈ రెండింటినీ కలిపి తిలోదకాలు అంటారు. అపకర్మలు చేసేటప్పుడు నీళ్లలో నువ్వుల్ని కలిపి వదులుతారు. చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్లినప్పుడు ఆ దారిలో ఈ తిలోదకాలు సహాయంగా ఉంటాయనేది ఒక నమ్మకం.
చనిపోయిన వాళ్ల నుంచి మనకి తిరిగొచ్చేది అంటూ ఏమీ లేదు. వారి కోసం సమర్పించిన తిలోదకాలు కూడా అంతే కదా!.
ఏనుగుకు కొమ్ములు వచ్చినట్టు..
ఏనుగుకు కొమ్ములు వచ్చినట్టు! ఏనుగు బలశాలి. మరి అలాంటి బలమైన ఏనుగుతో తలపడటానికి ఎవరికైనా భయమే కదా! ఏనుగు సహజ బలానికి కొమ్ములు తోడైతే..? అమ్మో? అనుకుంటాం. బలవంతుడికి మరింత బలం చేకూర్చే అధికారమో, అవకాశమో వచ్చినప్పుడు.. ‘ఏనుగుకు కొమ్ములు వచ్చినట్టుంది’ అంటుంటారు.
అరచేతిలో మాణిక్యం
ఒక విషయంలో స్పష్టత, సులువు, పారదర్శకతను సూచించడానికి ఉపయోగించే జాతీయం ఇది.
‘అరచేతిలో ఉసిరికాయ’ లాంటి వాటికి ఇది సమానార్థకమైన జాతీయం. అరచేతిలో మాణిక్యం కనిపిస్తే.. ‘ఇదీ విషయం’ అని ఎవరూ మనకు పనిగట్టుకుని చెప్పాల్సిన పనిలేదు. అది కంటికి కనిపిస్తూనే ఉంటుంది.
అంటే ఎలాంటి అయోమయం, అస్పష్టత అక్కర్లేదు.
ఉదాహరణ: బుర్ర పాడు చేసుకుని ఆలోచించేంత విషయం కాదు. అది అరచేతిలో మాణిక్యం.
ఇసుక తక్కెడ.. పేడ తక్కెడ
ఒక గ్రామంలో ఇద్దరు ప్రయాణికులు ఒకచోట బస చేశారు. వారు ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు.
ఒకడి కావడిలో ఇసుక ఉంది. మరొకడి కావడిలో పేడ ఉంది.
‘నీ దగ్గర ఉన్నదేమిటి?’ అని మొదటి వాడు రెండో వాడిని అడిగాడు.
’ముడి బియ్యం’ అని రెండో వాడు బదులిచ్చాడు.
‘మరి నీ దగ్గరున్నదేమిటి?’ అని రెండో వాడు మొదటి వాడిని అడిగాడు.
‘వండిన అన్నం’ అని మొదటి వాడు చెప్పాడు.
దీంతో ఒకరి వస్తువు మీద మరొకరు కన్నేశారు.
ఎవరి దారిన వారు వెళ్లే సమయంలో ఒకరినొకరు మోసం చేసుకుని ఒకరి కావడిని మరొకరు తీసుకున్నారు.
‘అబ్బ వీడి కావడి కాజేశాను’ అని ఎవరికి వారు సంతోషించారు.
కొంతదూరం వెళ్లాక కావడి దింపి చూసుకున్నారు. ఒకడికి ఇసుక కనిపించింది. ఇంకొకడికి పేడ కనిపించింది.
మోసగించబోయి మోసపోయిన సందర్భాల్లో, పరస్పరం మోసం చేసుకునే సందర్భంలో
Review ఏనుగంత బలం...