సృష్టిక్రమంలో 121వది శ్రీ శార్వరి నామ సంవత్సరం

బ్రహ్మ సృష్టి ఆరంభమై ఇప్పటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 121 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు 2020, మార్చి 25న వచ్చిన శ్రీ శార్వరి నామ సంవత్సరం 121వది. కలియుగం ప్రారంభమై ఈ ఉగాదికి 5,121 సంవత్సరాలు. శ్రీ మహా విష్ణువు మత్స్యావ తారంలో సోమకాసురుడనే రాక్షసుడిని సంహరించి, వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగించినది ఉగాది నాడేనని అంటారు. కలియుగం ప్రారంభమైందీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగిందీ, కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు పీఠాన్ని అధిష్టించినదీ, వెయ్యి సంవత్సరాల పాటు పాలన సాగించిన విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్టించినదీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసిందీ ఈ పర్వదినం నాడే. అందుకే ఉగాది నాడు పనులు మొదలుపెడితే అందులో తిరుగుండదనేది చాలా మంది నమ్మకం. ఈ కారణంగానే కొన్ని ప్రాంతాలలో రైతులు కొత్త నాగళ్లకు పూజలు చేసి, లాంఛనంగా వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. ఉగాది రోజు ఇంటి ముందో, వీధిలోనో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. శుభ్రమైన చోట అలికి ముగ్గుపెట్టి, కొత్త కుండల్లో నీరు నింపాలి. గణపతినీ, ఇష్టదేవతలనూ ధ్యానించి కొబ్బరికాయ కొట్టి చలివేంద్రాన్ని ప్రారంభించాలి. ఈ రోజు చల్లని మజ్జిగనో లేక పానకాన్నో అతిథులకు, బాటసారులకూ ఇచ్చినా పుణ్యమని శాస్త్ర వచనం. ఎందుకంటే, ఉగాది నాటికి వాతావరణం క్రమేపీ వేడెక్కుతుంది. ఎండలు మండుతుంటాయి. ఈ కాలంలో దాహార్తి వేస్తుంది. జనులకు దప్పిక తీర్చేందుకే ఉగాది నాడు చలివేంద్రాల ఏర్పాటు పక్రియను పెద్దలు ఏర్పాటు చేశారు. ప్రకృతి పండుగలో ఎంత సామాజిక హితమో కదా!.
ఇంతగా కాలంతో ముడిపడిన పర్వం కాబట్టే ఉగాదిని కాల పురుషుని ఉత్సవం అంటారు. కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనసే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగు వారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు. జ్యోతిషం ప్రకారం చంద్రుడు మన: కారకుడు. అంటే మనసుపై ప్రభావం చూపుతాడు. చాంద్రమానంలో పూర్ణిమ నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆయా మాసాల పేర్లు పెట్టారు. చిత్త పూర్ణిమ నాడు వస్తే చైత్రం. విశాఖ పౌర్ణిమ నాడు వస్తే వైశాఖం. ఇలా రాని సమయంలో అధిక మాసం లేదా క్షయ మాసాలు వస్తుంటాయి. వైదిక మంత్రాలలోనే ఈ మాసాల ప్రశస్తి మనకు కనిపిస్తుందంటే పూర్వకాలంలో సృష్టి ప్రారంభ పూర్వమే సౌర, చాంద్ర మానాల వినియోగం మనవారు చేసే వారని మనకు స్పష్టమవుతుంది.

Review సృష్టిక్రమంలో 121వది శ్రీ శార్వరి నామ సంవత్సరం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top