కొండెగాడు చావ కొంపదనుక బోవు
వంతు కింతె గాని వగపు లేదు
కొంకనక్క జావ గొర్రె లేమిటి కేడ్చు?
విశ్వదాభిరామ! వినురవేమ!
అర్థాలు:
కొండెగాడు = చాడీలు
చెప్పే వాడు,
వగప = బాధ,
కొంకనక్క = చిన్న జాతి నక్క.
భావం:
చాడీలు చెప్పే వాడు చస్తే ఏదో మర్యాద కోసం ఇంటి దాకా వెళ్లి వస్తారు. అంతేకాని వారికి అతడు పోయినందుకు బాధేమీ ఉండదు. చిన్న నక్క చస్తే గొర్రెలు ఎందుకు ఏడుస్తాయి?
వివరణ:
కొందరు కొండేలు (చాడీలు) చెబుతూ నిష్కారణంగా అందరికీ అపకారం తలపెడుతూ ఉంటారు. అటువంటి వారి వల్ల సమాజానికి అపకారమే గాని ఉపకారం ఉండదు. అలాంటి వారు చనిపోతే ఆనందించరు కానీ.. పీడ విరగడైందని మనసులో ఏ మూలనైనా అనుకుంటారు. అటువంటి వారు చనిపోతే పెద్దగా బాధపడరు కూడా. మర్యాద కోసం ఇరుగుపొరుగు వారు వారి ఇంటి దాకా వెళ్లి కాసేపు నిలబడి వస్తారు. వంకర బుద్ధి కలిగిన నక్కల వల్ల గొర్రెలు ఎప్పుడూ బాధలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ నక్కలు చస్తే పీడ విరగడైనందుకు పండుగ చేసుకుంటాయి. కానీ, బాధపడవు. అయ్యో.. అని కన్నీరు కార్చవు.
మనిషి తప్పుడు పనులు చేసి ఇతరులను బాధించకూడదు. చేతనైతే కాసింతైనా ఉపకారం చేసి, అభిమానం సంపాదించుకోవాలి. అప్పుడే ఇతరులు తన కష్టనష్టాలలో తోడుగా నిలుస్తారు.

























































































































































































































































































































































































































Review దుష్టుడిపై జాలి కలగదు.