తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం నిర్వహిస్తారని తెలుసు.
దీపావళి ఆస్థాన మహోత్సవం కూడా నిర్వహిస్తారని ఈమధ్యే తెలిసింది. ఈ వేడుక ఎలా నిర్వహిస్తారు? తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో దీపోత్సవానికున్న ప్రాధాన్యం ఏమిటి?
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం నిర్వహిస్తారని తెలుసు. దీపావళి ఆస్థాన మహోత్సవం కూడా నిర్వహిస్తారని ఈమధ్యే తెలిసింది. ఈ వేడుక ఎలా నిర్వహిస్తారు? తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో దీపోత్సవానికున్న ప్రాధాన్యం ఏమిటి?
అవును. శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం మహా వైభవంగా నిర్వహిస్తారు. మొదట శ్రీవారి దీపోత్సవ వైభవం గురించి తెలుసుకుందాం.
దీపజ్యోతి పరబ్రహ్మం దీపజ్యోతి జనార్దన: ।
దీపోహరతు యే పాపం దీపజ్యోతి నమోస్తుతే: ।।
దీపం వెలుగులను విరజిమ్ముతూ అంధకారాన్ని తొలగిస్తుంది. సృష్టి సమస్తం త్రిమూర్త్యాత్మకం. బ్రహ్మ సృష్టి చేస్తే, విష్ణువు స్థితికారకుడు. ఈశ్వరుడు లయకారకుడు. జనార్దనుడు స్థితికారకుడు కాబట్టి ‘దీపజ్యోతి జనార్దన’ అన్నారు. జీవి జీవనానికి ఆనందాన్ని, శుభాలను కలిగించి వెలుగులను పంచేవాడు జనార్దనుడు. కేవలం చీకట్లను తొలగించడం మాత్రమే కాకుండా జనుల పాపాలను కూడా తొలగించు జ్యోతిస్స్వరూపుడైన నారాయణునికి తొలి నమస్కారం అర్పించాలి. సూర్యనారాయణుడు ఇరవై నాలుగు గంటలూ ప్రకాశిస్తూ వెలుగులను పంచే ప్రత్యక్ష దైవం. ఆయన నిత్య చైతన్యమూర్తి.
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం దీపోత్సవాలు చేస్తారు. దీపం నుంచి వెలువడే
కాంతి చీకటిని, అజ్ఞానాన్ని, చెడును తొలగిస్తుంది. కాబట్టి దీపం వెలుగు శ్రేయస్సును కలుగచేస్తుంది. నిత్యం తిరుమల శ్రీవారి ఆలయం బయట జరిగే సహస్ర దీపాలంకరణ సేవను చూసిన భక్తులందరూ తమ పాపాలను తొలగించుకుంటారు. ఆలయం వెలుపల మాత్రమే కాకుండా అయినామహల్ అనే అద్దాల మండపంలో కూడా ఈ సహస్ర దీపాలంకరణ ఉత్సవం జరుగుతుంది. ఆరుబయట జరిగేది భక్తులందరూ దర్శిస్తారు. అద్దాల మండపంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత సేవ. అందువల్ల కొందరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. వారు మాత్రమే చూడగలరు. ఈ సహస్ర దీపాలంకరణ సేవ ప్రతి నిత్యం సాయంకాలం ప్రదోష సమయంలో నిర్వహిస్తారు. సంధ్యా సమయంలో వెలిగించే దీపాలను చూస్తూ-
దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే
సర్వం సంధ్యా దీపం నమోస్తుతే
అంటూ భక్తులంతా సహస్ర దీపాలంకరణ సేవలను దర్శిస్తారు.
ఇక శ్రీవారి దీపావళి ఆస్థాన మహోత్సవం గురించి తెలుసుకుందాం.
శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానాన్ని దీపావళి పండుగ రోజున అనగా, ఆశ్వయుజు బహుళ చతుర్దశి/అమావాస్య, ఆదివారం (నవంబరు 8, 2026) నాడు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం స్వామికి దీపావళి ఆస్థానం శ్రీవారి సమక్షంలో నిర్వహిస్తారు. ఆ రోజున శ్రీవారికి తోమాల, అర్చన, కల్యాణోత్సవ సేవలను నిర్వహించిన తరువాత ఆర్జిత సేవలను నిలిపివేస్తారు. మొదటి గంట సేవలు అయిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామిని సర్వభూపాల వాహనంపై అధిష్ఠింపచేసి బంగారు వాకిలి ముందున్న ఘంటామండపంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. మరొక పీఠంపై విష్వక్సేనుని దక్షిణాభిముఖంగా వేంచేపు చేసి అర్చకులచే ప్రత్యేక పూజ, హారతి, నివేదన, తిరుచందనాలు సమర్పిస్తారు. శ్రీవారికి నూతన వస్త్ర సమర్పణ, అక్షతారోపణ చేస్తారు.
ఈ దీపావళి ఆస్థానం పూర్తయిన తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. భక్తులంతా స్వామిని దర్శించి స్వామి కృపాకటాక్షములకు పాత్రులై పునీతులవుతారు.
‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అని పెద్దలు అంటుంటారు. దీని వెనకున్న నిగూఢార్థం ఏమిటి?
‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అనేది సాధారణ తెలుగు సామెత. పుర్రెకో బుద్ధి అంటే- అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. ప్రతి ఒక్కరి ఆలోచన విధానం, అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒకరి ఆలోచన మరొకరికి నచ్చకపోవచ్చు. ఎవరి ఆలోచన వారిదే.
అలాగే, జిహ్వకో రుచి అంటే- ప్రతి ఒక్కరి నాలుక ఒక్కొక్క రుచిని కోరుతుంది. ఒకరికి పులుపు ఇష్టమైతే మరొకరికి కారం, ఇంకొకరికి తీపి నచ్చుతుంది. అలా ఒకరికి నచ్చిన ఆహారం మరొకరికి నచ్చకపోవడం, ఎవరి నాలుకకు ఏ రుచి ఇష్టమో దానినే ఆనందంగా ఆస్వాదిస్తారు. ఈ క్రమంలోనే ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ అనే సామెత పుట్టింది.
దానకర్ణుడని ఎందుకంటారంటే..
కర్ణుడికి దానకర్ణుడనే పేరెలా వచ్చింది? దానం విషయంలో ఒకసారి అర్జునుడు కర్ణుడితో పోటీ పడ్డాడని అంటారు. ఈ పోటీలో ఎవరు గెలిచారు?
ఒకసారి అర్జునుడికి ఓ సందేహం వచ్చింది. నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి ‘కృష్ణా! అందరూ కర్ణుడిని దానకర్ణుడని అంటారు. నేను కూడా విరివిగా దానాలు చేస్తున్నాను కదా! మరి దాన అర్జునుడని నన్నెందుకు పిలవరు? ఒకసారి నువ్వు అవకాశం ఇస్తే మరింత విరివిగా ప్రజలకు దానం చేసి ‘దాన అర్జునుడ’నే బిరుదును సార్థకం చేసుకుంటాను’ అన్నాడు.
కృష్ణుడు సరేనన్నాడు. మర్నాడు కృష్ణుడు పెద్ద బంగారుకొండను సృష్టించారు. అర్జునుడిని పిలిచి, ‘ఇందులో బంగారం. ప్రజలను పిలిచి పంచిపెట్టు’ అన్నాడు.
అర్జునుడు దండోరా వేయించి జనులందరినీ పిలిపించాడు. ప్రజలంతా పెద్ద పెద్ద సంచులు, డబ్బాలతో బారులుదీరారు. అర్జునుడు ఒక్కొక్కరికే బంగారాన్ని దోసిళ్లలోకి తీసుకుని పంచుతున్నాడు. అలా సాయంత్రం వరకు పోస్తూనే ఉన్నాడు. జనం తరగడం లేదు.. బంగారం తరగడం లేదు. సాయంత్రానికి చేతులు నొప్పి పుట్టి ‘కృష్ణా! ఇక నావల్ల కాదు. ఇంకా అంతమంది ఉన్నారు. వాళ్లకు నేను పంచలేను’ అని అలసిపోయి కూర్చుండిపోయాడు.
ఈసారి కృష్ణుడు కర్ణుడిని పిలిచాడు. మర్నాడు మరో బంగారుకొండను సృష్టించి, ప్రజలకు పంచమన్నాడు. కర్ణుడు ఏం చేస్తాడో చూద్దామని అర్జునుడు ఉబలాటంతో ఉన్నాడు.
ప్రజలు మునుపటి కంటే పెద్దసంఖ్యలో రాసాగారు. వెంటనే కర్ణుడు కృష్ణుడికి నమస్కరించి, బంగారుకొండపైకి ఎక్కి, ‘ప్రజలారా! ఇదిగో బంగారం. మీకు ఎంత కావాలో అంత తీసుకెళ్లండి’ అని ప్రకటించాడు.
జనులంతా ఓపికున్న మేరకు ఎవరికి వారు బంగారాన్ని పట్టుకెళ్లారు. మధ్యాహ్నానికి కొండ ఖాళీ అయిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
‘పరమాత్మా! నేను సాయంత్రమైనా సగం కొండను కూడా ఖాళీ చేయలేకపోయాను. కర్ణుడు మధ్యాహ్నానికే ఎలా ఖాళీ చేసేశాడు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు.
కృష్ణుడు చిరునవ్వు నవి, ‘అర్జునా! నువ్వు చేతితో పంచినప్పుడు నీకు ఆ బంగారం మీద ఇంకా వ్యామోహం ఉందని అర్థం. నీ చేతితో దానం చేస్తున్నానని అనుకున్నావు కానీ.. నిజానికి ఆ బంగారంపై నీకు వ్యామోహం పోలేదు. కర్ణుడికి అలాంటి వ్యామోహం లేదు. అందుకే ఎవరికి కావాల్సింది వాళ్లు తీసుకెళ్లండని ప్రకటించాడు. నీకూ, అతడికీ అదే తేడా. అర్థమైందా? కర్ణుడినే దానకర్ణుడని ఎందుకంటారో!’ అన్నాడు. అర్జునుడు వినయంగా చేతులు జోడించి అక్కడి నుంచి నిష్క్రమించాడు.

































































































































































































































































































































































































































Review ధర్మసందేహం.