తిరుమల.. కలియుగ వైకుంఠ దైవం కొలువైన ఆ దివ్యక్షేత్రానికి ఎన్నిసార్లు వెళ్లినా అప్పుడే కొత్తగా అనిపిస్తుంది. నిండైన ఏడుకొండల వాడి రూపాన్ని నిలువెల్లా గుండెల్లో నిలుపుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు. అయితే, తిరుమల క్షేత్రంలో దిగింది మొదలు ఆయా సేవలు ఎలా పొందాలి? ఆయా చోట్లకు ఎలా వెళ్లాలి? దేవదేవుని దర్శనం ముందు, తరువాత చూడదగిన ప్రదేశాలేమిటి? అనేవి ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. కచ్చితమైన దారి తెలియక ఎప్పటికప్పుడు గందరగోళానికి గురవడం షరా మామూలే. అయితే ఇకపై ఆ చింత లేదు. అరచేతిలో ‘వైకుంఠం’ చూడొచ్చు ఇలా..
తిరుమల వెళ్తే గదులు ఎక్కడ దొరుకుతాయి?
గదులు తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని సంప్రదించాలి?
ఉచిత లాకర్లు ఎక్కడ దొరుకుతాయి?
తలనీలాలు సమర్పించే చోటెక్కడ?
అన్న ప్రసాద కేంద్రానికి ఎలా వెళ్లాలి?
ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఎలా వెళ్లాలి?
ఉచిత బస్సులు ఎప్పుడు వస్తాయి?
తిరుమల గిరులపై అడుగుపెట్టే భక్తుల మదిలో ఇలాంటి ప్రశ్నలెన్నో మెదులుతుంటాయి. దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరి అయ్యే భక్తులకు చేదోడువాదోడుగా నిలిచేందుకు ‘వేంకటాద్రి’ యాప్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించింది. దీనిని నవంబరు 10, 2026న ఆవిష్కరించారు.
దారి చూపే దైవం..
తిరుమల కొండపై ఉన్న వందకుపైగా ముఖ్యమైన ప్రదేశాలు, వసతులు ఎలా పొందాలి? ఎక్కడ పొందాలి? అనే విషయాలను సులభంగా తెలుసుకునేందుకు, ఆయా చోట్లకు చేరుకునేందుకు ఈ యాప్ కచ్చితమైన దారి (లొకేషన్ సర్వీసెస్) చూపుతుంది. దర్శన క్యూలైన్ల ప్రవేశ ద్వారాలు, ఉచిత బస్సులు తిరిగే రూట్లు, సమయాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం, ఇతర భోజన వసతులు, తాగునీటి కేంద్రాలు, మరుగుదొడ్లు, పోలీస్ సహాయ కేంద్రాలు, వసతి గదుల కౌంటర్లు, చెప్పులు, లగేజీ, మొబైల్ డిపాజిట్ కేంద్రాలు.. ఇలా ప్రతి ఒక్క దానికీ యాప్‌ను వినియోగించు కోవచ్చు.
ఎక్కడికి వెళ్లాలో అక్కడికే సులభంగా..
శ్రీవారి దర్శనానికి కావచ్చు.. మరేదైనా సేవ, వసతి సౌకర్యం పొందడానికి కావచ్చు.. తిరుమలలో వెళ్లిన దారినే రావడం అనేది కొంచెం కష్టమే. చెప్పులు ఒకచోట పెడతాం. తిరిగి వచ్చేటపుడు వేరే మార్గం మారిపోవచ్చు. లేదా అక్కడకు చేరుకోవడానికి దారి తెలియక దూరం ప్రయాణించాల్సి రావచ్చు. బస చేసిన గదికి చేరుకోవాలన్నా అంతే.. ఇలాంటి సందర్భాల్లో సాయపడుతుంది ‘మార్క్ మై స్పాట్’ ఫీచర్. యాప్‌లోని ఈ ఫీచర్ సాయంతో మనం ఎక్కడికి చేరుకోవాలో అక్కడికే కచ్చితంగా చేరుకోగలం.
ఉదాహరణకు రద్దీలో మన వాహనాన్ని ఎక్కడ పార్క్ చేశామో గుర్తించలేకపోవచ్చు. లేదా పార్క్ చేసి వెళ్లిన చోటు నుంచి తిరిగి అదే దారిలో రాలేకపోవచ్చు. అలాగే తిరుమల కొండపై ఏదైనా ప్రదేశంలో మన బంధుమిత్రులను ఉంచి మరేదైనా పనిపై ఒకరు ఎటైనా వెళ్లవలసి రావచ్చు. తిరిగి వారి వద్దకు చేరుకునే విషయంలో గందరగోళానికి గురయ్యే సందర్భాలు తరచూ ఏర్పడుతుంటాయి. అటువంటి సమయం, సందర్భాలలో యాప్‌లోని ‘మార్క్ మై స్పాట్’ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. మీరున్న చోట లేదా వాహనం నిలిపిన చోట ఈ ఫీచర్ ద్వారా స్పాట్‌ను సేవ్ చేసుకుంటే, మీ పని పూర్తయ్యాక సులువుగా అక్కడికే చేరుకోవచ్చు. కొండపై సిగ్నల్ సమస్యలు ఉన్నా.. భక్తుల మొబైల్స్‌లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా కూడా ఆఫ్లైన్లోనూ నిరాటంకంగా పని చేయడం ఈ యాప్ ప్రత్యేకత. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ నావిగేషన్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది.
దారి చూపే ‘గోవిందా’
ఇరవై నాలుగు గంటల పాటూ భక్తులకు సేవలందించేలా కృత్రిమమేథ (ఏఐ) సాంకేతికతతో ‘గోవిందా’ అనే వాయిస్ అసిస్టెంట్‌ను యాప్‌లో పొందుపరిచారు.
దగ్గరలో తాగునీరు ఎక్కడ దొరుకుతుంది?
దర్శన స్లాట్ క్యూలైన్‌కు ఎటు వెళ్లాలి?
.. ఇలా మీ సందేహాన్ని అడిగితే చాలు.. ‘గోవిందా’ మీ ప్రశ్నకు బదులిస్తాడు.
‘కాల్ పోలీస్‌స్టేషన్’ అని చెబితే ఫోన్ చేస్తాడు.
స్మార్ట్‌ఫోన్ వినియోగించలేని భక్తుల కోణంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచించింది. వారి కోసం తిరుమల ప్రధాన కూడళ్లలో స్టార్ట్ డిస్ప్లే బోర్డు (కియోస్క్)లు ఇరవై వరకు ఏర్పాటు చేయనుంది. భక్తులు తాము వెళ్లాల్సిన ప్రదేశం పేరు చెప్పగానే, ఆ బోర్డులో అక్కడికి వెళ్లే దారి, ఇతర వివరాలు ప్రత్యక్షమవుతాయి.

































































































































































































































































































































































































































Review తిరుమల దర్శిని.