అత్తగారు – కొత్త కోడలు

అనగనగా ఒక ఊళ్లో ఒక పెద్దమ్మ ఉండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. అతడికి యుక్త వయసు రాగానే మంచి అందమైన పిల్లను చూసి పెళ్లి చేసింది.
కొంతకాలం పోయిన తరువాత కోడలు కాపరానికి వచ్చింది.

అప్పుడు కోడలు అత్తతో అన్నది గదా- ‘అత్తా! అత్తా! నీ కోడలు కాపరానికి వచ్చింది గదా! ఇక నువ్వు చచ్చిపో అత్తా. ఇంటి పనులన్నీ నీ కోడలినైన నేను చూసుకుంటానులే’ అని.
అప్పుడు అత్త, ‘ఓసే! నీ కడుపున ఒక కాయ కాస్తే చూసిపోదామని ఉందే’ అన్నది.

ఇక కోడలు చేసేది లేక, ‘ఓసీ ఈ ముసలిముండ పడి చావ’ అని మనసులో అనుకుంది.

సరే. కొంతకాలం జరిగిన తరువాత పెద్దమ్మకు ఒక మనవడు పుట్టాడు.

అప్పుడు కోడలు అత్తతో, ‘నాకు కొడుకు పుట్టితే చూచావు గదా! ఇక చచ్చిపో అత్తా!’ అన్నది.
అప్పుడు అత్త, ‘కాస్త వాడి ముచ్చట్లు చూడవద్దటే. వాడిని బళ్లో వేసిన తరువాత పోతాలే’ అంది.
కొంతకాలానికి మనవడిని బడిలో వేశారు.

అప్పుడు అత్తని కోడలు పొమ్మంటే, అత్త అన్నది గదా- ‘కాస్త జందెప్పోగు వేసిన తర్వాత పోతాలేవే’ అంది.

కొంతకాలానికి మనవడికి వడుగు కూడా చేశారు. అప్పుడు కోడలు పొమ్మంటే అత్త, ‘కాస్త వాడిని ఒక ఇంటి వాడిని చేస్తే చూసి పోతానే’ అని సాకు చెప్పింది.

కోడలు కొడుకుకి తొందరగా పెళ్లి చేసి, ‘ఇక పోవా అత్తా!’ అని అడిగింది. అప్పుడు కోడలితో అత్త, ‘కాస్త మనవడూ, వాడి పెళ్లామూ కలిసి కాపరం చేస్తూంటే చూసి పోతానే’ అన్నది. సరే కొంతకాలానికి మనవడి పెళ్లాము కాపరానికి వచ్చింది. అప్పుడు కోడలు పొమ్మంటే అత్త- ‘నీకు కూడా కోడలు వచ్చింది గదే. ఇంటి పనులు అది చూస్తుంది లేవే. నువ్వు కూడా రావే ఇద్దరం పోదాము’ అంది.
ఇప్పుడు కోడలికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇది తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచించి, చివరికిపోయి అత్త వద్ద దొంగ ఏడుపు ఏడుస్తూ, ‘అత్తా! అత్తా! నీవు పోతానంటే నా కడుపులో గుబగుబలాడుతున్నది. ఏడుపు వస్తున్నది. నీవు పోవద్దులే అత్తా!’ అన్నది.
అత్త ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మనసులో తన తెలివికి తనే మెచ్చుకుంటూ, ‘సరేలేవే. మరి నేవుంటే నాకు చాకిరీ చేసే వాళ్లు ఉండద్దా? నువ్వు నేను చెప్పిన పనల్లా నాకు చేస్తానంటే ఉంటా’ అన్నది.
అప్పుడు కోడలు మనసులో ‘అమ్మయ్య! బతికాను’ అనుకుని అప్పటి నుంచి అత్త చెప్పినట్టల్లా వింటూ ఉన్నది.

Review అత్తగారు – కొత్త కోడలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top