అనసూయాత్రి సంభూత..అవధూత

దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి.
ఆయన పుట్టిన వారం బుధవారం.
తిథి మార్గశిర శుక్ల చతుర్దశి.
నక్షత్రం కృత్తిక.

దత్తాత్రేయ దేవాలయాల్లో ఈనాడు కీర్తనలు సాగుతాయి. దత్తాత్రయుడు ఉగ్ర దేవత అని గర్గ సంహిత చెబుతోంది. ఆయన ఉగ్ర దేవత కాబట్టే దేశంలో ఆయన ఆలయాలు తక్కువగా ఉన్నాయని అంటారు. ఈయన పుట్టినది బుధవారమైనా గురువారమే ప్రియమైనదని అంటారు.
మార్గశిర పౌర్ణమి నాటికి యమదంష్ట్రలనే కష్టదినాలు తుదముట్టినందుకు సంతోష సూచకంగా ఉగ్రదైవమైన దత్తాత్రేయుడికి ఈనాడు పూజలు ఆచారంలోకి వచ్చి ఉంటాయని అంటారు. దత్తాత్రేయ లేదా దత్తుడు అనేది సంస్క•త పదం. ఈయనను హిందువులు త్రిమూర్తి స్వరూపంగా ఎంచి కొలుస్తారు.
‘దత్తా’ అంటే ‘సమర్పించిన’ అనే అర్థముంది. త్రిమూర్తులు తమను తాము పుత్రుడి రూపంలో అత్రి, అనసూయ దంపతులకు సమర్పించుకున్నారు కాబట్టి ఈయనకు ‘దత్తా’ అనే పేరొచ్చింది. అత్రి కుమారుడు కాబట్టి ‘ఆత్రేయు’డయ్యాడు.
దత్తాత్రేయుని మహిమాన్విత శ్లోకం..


అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే
సర్వదేవాది దేవత్వం మమచిత్తం స్థిరీకురు
సర్వమంగళ మాంగళ్య సర్వాధి వ్యాధి భేషజ
సర్వసంకట హరీన్‍ త్వం మమచిత్తం స్థిరీకురు
సర్వపాపక్షయకర: స్తాపదైన్య నివారణ:
యో భీష్టద: ప్రభు: సత్వం మమ చిత్తం స్థిరీకురు
దత్తాత్రేయుని రూప సంకేతం

– ఈయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమాహారంగానూ, గతం, వర్తమానం, భవిష్యత్తు కలిగిన రూపంగా గోచరిస్తాడు.
– సృష్టి, సంరక్షణ, వినాశనాన్ని తెలిపే చైతన్య రూపం
– బాహ్య రూపాలైన నడక, స్వప్నం, స్వప్నరహిత నిద్రలను ప్రతిబింబించేవే మూడు తలలని అంటారు.
– కోరికలు తీర్చే కల్పవృక్షం కింద తన శక్తితో ధ్యానస్థితిలో కూర్చుని ఉంటాడు. కోరికలు తీర్చే కామధేనువు (ఆవు) ఈయనకు సహాయకారి. ఆయన ముందు నిత్యాగ్నిహోత్రం లేదా హోమగుండం ఉంటుంది. దీనిని బట్టి ఈయన యజ్ఞకర్త అని భావించవచ్చు.
– దత్తుని చుట్టూ నాలుగు శునకాలు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలకు ప్రతిరూపం.
– భారతీయ ఆధ్యాత్మికతలో దత్తాత్రేయుడు అతి పురాతన దైవం. ఈయన గురించి ప్రథమ ప్రస్తావన మహాభారతం, రామాయణంలో ఉంది. అధర్వణ వేదంలో దత్తాత్రేయ ఉపనిషత్తు ఒక భాగం.
– భారతదేశంలో వెయ్యి సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న తాంత్రిక సంప్రదాయాలను గమనిస్తే, దత్తాత్రేయుడు ఒంటి తలతో కనిపిస్తాడు.

శ్రీ గురుదేవ్‍ దత్తా
దత్తాత్రేయుడి మంత్రాలలోనే ఇది పరమ విశిష్టమైనది. శ్రీ అంటే శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి చిహ్నం. గురుదేవ్‍ అంటే సాక్షాత్తూ భగవంతుడే. ఈ మొత్తం విశ్వానికి ఆయనే యజమాని. దత్త అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక రూపం. అటువంటి దత్తాత్రేయుల వారిని భజిస్తున్నాను అని పై శ్లోకార్థం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇది కూడా దత్తాత్రేయుని మహిమాన్విత మంత్రాలలో ఒకటి.
నమస్తే భగవాన్‍ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో.. సర్వబాధా ప్రశమనం కురుశాన్తిం ప్రయచ్ఛమే అని ప్రార్థిస్తూ ఆ అవతార పురుషుని స్తుతిద్దాం.
దత్తాత్రేయుడు 16 అవతారాలు ధరించినట్టు చెబుతారు. అవి- యోగిరాజ్‍, అత్రివరద, దత్తాత్రేయ, కళాగ్నిషమాన్‍, యోగిజన వల్లభ, లీలావిషంభర్‍, సిద్ధరాజ్‍, ధన్యసాగర్‍, విషంభర్‍, మాయాముక్త, మాయాముక్త (2), ఆదిగురు, శివరూప్‍, దేవదేవ్‍, దిగంబర్‍, కృష్ణశ్యామ కమలనయన. ఈ 16 అవతారాల గురించి వాసుదేవానంద సరస్వతి రచించిన పుస్తకంలో వివరించారు. దశోపంత సంప్రదాయం అనేది దత్తాత్రేయ ఆరాధనలో ఒక భాగం. ఈ సంప్రదాయం ప్రకారం పై పదహారు అవతారాలను భక్తులు పూజిస్తారు. అలాగే దశోపంతను 17వ అవతారంగా కూడా భావిస్తారు.

Review అనసూయాత్రి సంభూత..అవధూత.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top