1. సకల ప్రాణికోటిపై దయ:
భగవంతునికి ప్రత్యేకంగా సాధించవలసిన అవసరం కానీ, అగత్యం కానీ ఏమీ ఉండదు. కానీ మానవాళి ఉద్ధరణ కోసం ఆయన ఎన్నో అవతారాలను దాల్చాడు. మనం ఒకరికి సహాయం చెయ్యగలిగి ఉన్నపుడు తప్పక సహాయం చేయాలి. ఇందుకు మనకు భగవంతుడే స్వయంగా దారి చూపించాడు. మన పక్క వారి బాధలను తీర్చాలనే భావనే కరుణ. కొందరికి స్వతహాగా కరుణా దృష్టి ఉంటుంది. మరికొందరికి వారితో పాటు ఉన్న వారి వలన జనిస్తుంది. శ్రీకృష్ణుడు గీతలో తనకు ఇష్టమైన లక్షణాలలో కరుణ, స్నేహభావం, ఇతరులపై ద్వేషం లేకపోవడం అని ప్రస్తావించిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నిత్య జీవితంలో కాసింత దయతో ప్రవర్తించడం ద్వారా ఎంతోమందిలో ఆనందాన్ని నింపిన వాళ్లమవుతాం. వాళ్ల ఆనందమే మనకు సంతోషదాయకం అవుతుంది.
ఒకరిపై ద్వేషం వలన మన శాంతం కోల్పోతాం. మనం ఇలా అనుకోవాలి-
‘నేను సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నాలాగే అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. నాకు బాధ కలిగితే ఎలా ఉంటుందో పక్క వారికి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా బాధ పడరాదు’.
ఇటువంటి భావనలు ఉన్న వారికి త్వరగా ప్రశాంతత లభిస్తుంది. కరుణ వలన క్రోధం కూడా అణగదొక్కబడుతుంది.
2. ఓర్పు:
సాధారణంగా ఎవరికైనా తనకు ఇష్టం లేని విషయం కానీ, పరిస్థితి కానీ ఎదురైనపుడు కోపోద్రిక్తులవుతారు. వెంటనే పగ తీర్చుకోవాలని అనుకుంటారు. అంత బలం ఉంటే వెంటనే ఆ పని చేసేస్తారు కూడా. ఇది గొప్ప వారి లక్షణం కాదు. తనకు శక్తి ఉండి కూడా కోపానికి వశం కాకుండా వివేచనతో క్షమించగలగడం చాలా గొప్ప లక్షణం. రామాయణంలో రాముని గురించి ఇలా అంటారు-
‘తనకు జరిగిన హానిని అసలు గుర్తుపెట్టుకోడు. ఆయన క్షమ ధరిత్రిని మించినది’.
కోపం వల్ల ఏం లాభం? మన ప్రశాంతత పక్క వారి శాంతం కూడా కోపం వల్ల హరించుకుపోతాయి. సర్వదా త్యాగనీయం ఈ క్రోధం. క్రోధానికి సంబంధించి గౌతమ మహర్షి కింది సలహా ఇస్తూ.. ‘ఇది ఉచితం అనిపిస్తే ఆచరించండి’ అంటారు.
‘పరులను సంతోషపెట్టడం ఒక పూజ వంటిది. కాబట్టి పక్క వాడికి నన్ను విభేదించడం వల్ల అతనికి సంతోషం నేను కలిగిస్తున్నానంటే నేను పెద్దగా కష్టపడకుండా దైవపూజ చేస్తున్నట్టు. అతనిని సంతోష పెట్టడం ద్వారా నేను పూజ చేస్తున్నట్టే. కాబట్టి అతనే నాకు మహదవకాశం ఇచ్చాడు’
ఇలా అనుకుని సంతోషపడితే, అనంతమైన ప్రశాంతత కలుగుతుంది.
3. పరనింద:
సాధారణంగా సంపూర్ణమైన విజయం సాధించినటువంటి వారు లేక ప్రావీణ్యం లేని వారు విషయపరులలోని లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. అటువంటి పరనింద కేవలం తమ లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నం తప్ప దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ఇది చాలా చెడ్డ అలవాటు. మనకన్నా ఉన్నతమైన ప్రావీణ్యం ఉన్న వారిని చూసి మనం సంతోషపడాలి. వారిని ప్రోత్స హించాలి. ఆది శంకరాచార్యులు- ‘ఇతరులను గేలి చేస్తున్నప్పుడు అటువంటి మాట విన్న వారు కూడా పాపం మూట కట్టుకున్న వారేన’ని అంటారు. కేవలం అటువంటి ఖండన మాటలు విన్న వారికే పాపం అంటే, అటువంటి పరుషమైన మాటలు మాట్లాడే వారు ఎంత పాపం మూట కట్టుకుంటు న్నారో ఆలోచించండి.
ఒక మనిషి ఆనందంగా ఉన్న వారితో స్నేహ బాంధవ్యాలను పెంచుకుంటున్నాడనుకుందాం. అప్పుడు తను కూడా ఆనందం పొందుతాడు. వారి విజయాలను ఆస్వాదిస్తాడు. వారితో పాటు తాను కూడా ఉన్నతిని పొందుతాడు. ఒక తండ్రి తన పిల్లల ఉన్నతిని చూసి ఎంత సంతోష పడతాడో, మనం కూడా మన పక్కవారి ఉన్నతిని చూసి ఆనందించాలి. సంకుచిత స్వభావులు నేను, నాది అని గిరి గీసుకుని కూర్చుంటారు. అదే విశాల హృదయులు జగమంతా తన కుటుంబ మనే అనుకుంటారు. కాబట్టి అసూయ వదిలి అందరి సంతోషంలోనూ తాను కూడా పాలు పంచుకోవాలి. అందువలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.
4. స్వచ్ఛత:
మన విధివశాత్తూ.. మాసిన బట్టలు వేసుకున్న, స్నానం చేసి రోజులైన, హేయమైన నడవడి, ఆహార్యం కలిగిన ఒకడిని చూస్తే ఏమనినిస్తుంది? అతని నుంచి దూరంగా తొలగి పోవాలనిపిస్తుంది. కానీ, అటువంటి మనిషి తాను అశుభ్రంగా ఉన్నానని అనుకోడు. అతనికి అదే అత్తరు వాసనలా ఉంటుంది. అదే మాదిరి ఎవరి కైనా మలినమైన, అనారోగ్యమైన అలవాట్లు ఉంటే అది అందరికీ చేటు అవుతుంది. ఉదాహర ణకు జనసమర్ధమైన ప్రదేశాల్లో ఉమ్మి వేసే వారు, పొగ తాగేవారు, ఇతరత్రా అలవాట్లు ఉన్న వారి వలన వారికే కాదు మొత్తం సమాజానికే చెడు కలుగుతుంది. మనం కేవలం శారీరకమే కాక మానసిక పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి.
5. బద్ధకం:
చాలామంది తాము ఒక పని చెయ్యలేని స్థితిలో ఉన్నామని సాకులు చెబుతుంటారు. అటువంటి బద్ధకస్తుడిని ఏ యజమానీ మెచ్చడు. తాను చదవాల్సిన పుస్తకాలను పక్కన పెట్టి, ఏ విద్యార్థీ పరీక్షలలో ఉత్తీర్ణుడు కాలేడు. ఎవరైతే తనకు అప్పజెప్పిన పని మీద పూర్తిగా మనసును లగ్నం చేసి ఉంటాడో అటువంటి వాడి మనసు ఇతర పనులపై కానీ, ఖాళీగా ఉండాలని కానీ కోరుకోదు. కాబట్టి అందరూ అత్యంత ఉత్సాహంతో తమ తమ కర్మలను ఆచరించాలి.
6. శుభప్రదంగా ఉండటం:
మనం ఎవరినైనా కలిస్తే వారినే కాక, వారి హావభావాలను కూడా గమనిస్తాం. మనం ఎప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. మన మాట, నడవడిక కూడా శుభప్రదంగా ఉండాలి. పెద్దవారు కనబడితే మనం కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి వారిని ఆహ్వానించాలి. మాట కూడా ప్రస న్నంగా, ఆహ్లాదంగా ఉండాలి. ఎప్పుడూ సత్యం మాట్లాడాలి. హాని కలిగించే సత్యం ఉన్నట్టయితే దానిని వారికి భయపెట్టేలా చెప్పకూడదు. మన పలుకులు ఆహ్లాదంగా, సత్యంగా ఉంటే అదే మనకు రక్ష.
7. ఉత్సాహంగా, ధర్మబద్ధంగా ఉండటం:
మనం నిత్యం దాన ధర్మాలతో కూడిన ధార్మిక జీవనం సాగించాలి. మోహం, లోభం.. ఇవి రెండూ కూడా నరకానికి మార్గాలు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. పలువురు యోగులు దానం గురించి మహనీయమైన మాటలు చెప్పారు. వాటిలో ఒకటి- ‘నీ మరణం తరువాత కూడా నీతో నీ సొమ్మును తీసుకుపోదాం అను కుంటే, నువ్వు నేటి నుంచి దానం చేయడం మొదలుపెట్టు’ అనేది అత్యంత ముఖ్యమైన సూచన. అంటే, ప్రతి మనిషిని తాను చేసిన ధర్మమే తనను కాపాడుతుంది. ఆ దానమే తనతో వెన్నంటి ఉంటుంది. తనకు ఉన్నంతలో దానం చెయ్యాలి. దాని వలనే అతనికి ఉన్నత గతులు కలుగు తాయి.
ఒకతను పెద్దలు చెప్పిన మాటలు విని, ఉన్నంతలో దానాలు చేశాడు. మరణా నంతరం అతను రాజుగా జన్మించాడు. అతనికి అదృష్టం కొద్దీ పూర్వజన్మ గుర్తుంది. ఈ జన్మలో కూడా రోజుకొక కూరగాయ దానం చేయసాగాడు. ఆశ్చర్యంగా అతను మరణించాక మరు జన్మలో భిక్షువుగా జన్మించాడు. ఈసారి కూడా అతనికి గత జన్మ గుర్తుంది. గత రెండు జన్మల గురించి తెలిసి తానే తప్పు చేయలేదని, ఎందుకు భిక్షువుగా పుట్టానని ఓ సాధువు వద్ద మొరపెట్టుకున్నాడు.
శక్తికొద్దీ దానం చేయాలని, రాజుగా ఎంతో సంపద కలిగి ఉన్నా పీనాసితనంతో కూరగాయ మాత్రమే దానం చేయడం వల్ల సరైన పుణ్యం సంపాదించలేకపోయానని సాధువు చెబుతాడు. కాబట్టి ఉన్నంతలో దానం చేయడం, అదీ అర్హులకు దానం చేయడం చాలా ముఖ్యం.
8. నిర్మోహతత్వం:
మనకు సంభవించే ఎన్నో అనర్థాలకు కారణం మన ప్రాపంచిక మోహం. నిర్మోహత్వం వలన సచ్చిదానందం కలుగుతుందని పంచదశిలో ఆది శంకరులు చెప్పారు. వారి వారి కరకమలాలను వాటి ఫలాలకు అతీతంగా ఆచరించడం తప్పక సాధ్యపడుతుంది. మోహం వలన మన కర్మ చెయ్యగలిగే సామర్థ్యం కుంటుపడుతుంది. మోహాన్ని వీడటం వలన కలిగే ఆనందం అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. మన రుషులంతా మోహాతీతంగా జీవించడం వల్లనే ముక్తిని సాధించగలిగారు. మనకు అక్షయమైన జ్ఞానాన్ని అందించారు.
Review అష్టైశ్వర్యాలివిగో..