ఆధ్యాత్మి‘కథ’

నీచ స్నేహితుడు
నీచబుద్ధి కలిగిన స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్లను చూసి ఓర్చుకోలేని వాళ్లు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంస కథ ఇది.
మహేంద్రపురంను ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమి నాటి చంద్రునిలా తెల్లగా నిగనిగలాడుతూ ఉండేది. దానికి చేతనయినంత వరకు ఇతర పక్షులకు సాయం చేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమ జాతికి చెందిన హంస తనకు స్నేహితుడని, తను మంచివాడు కావడం వల్లే ఆ హంస తనతో స్నేహం చేస్తోందని తన జాతి పక్షుల ముందు గర్వంగా చెప్పుకునేది. మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒకరోజు వేట కోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా అతడికి ఒక్క అడవి జంతువు కూడా దొరకలేదు. ఇవ్వాళ పొద్దున లేని ఎవరి ముఖం చూశానో కానీ, అడవంతా బోసిపోయినట్టు ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు కిందకు చేరి తన దురదృష్టానికి చింతిస్తూ కూర్చున్నాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస కింద వేటగాడి అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరీరంతో ఉస్సూరుమంటూ చెట్టు కింద కూర్చున్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేదదీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కలను విప్పి విసనకర్రలా మార్చి వాడికి గాలివిసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి ఇట్టే నిద్రపట్టేసింది.
అదే సమయంలో అక్కడకు వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, ‘నీది ఎంత జాలి మనసు? మనల్ని చంపడానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు. ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయడానికి నీకు సిగ్గుగా లేదా?’ అంది.
దానికి హంస బదులిస్తూ`
‘మిత్రమా! పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనయినంత సాయం చేయాలి’ అంది.
‘చెయ్యి! బాగా చెయ్యి! బాగా సాయం చెయ్యి!’ అంటూ పావురం ఎగతాళిగా నవ్వుతూ సరిగ్గా ఆ వేటగాడి ముఖం మీద పడేలా రెట్ట వేసి అక్కడి నుంచి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగా వేటగాడి ముక్కు మీద పడిరది. దాంతో వాడు కోపంగా కళ్లు తెరిచి, తల పైకెత్తి చూశాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. అదే తనపై రెట్ట వేసిందని భావించి, వెంటనే బాణం అందుకుని గురిచూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కల్లో గుచ్చుకుంది. ఆ దెబ్బకు హంస ప్రాణాలు వదిలేసింది.
నీతి:
మన స్నేహితులు ఎలాంటి వారనేది వాళ్లతో స్నేహం చేసే ముందే సరిచూసుకోవాలి. అర్హతకు తగని వారితో స్నేహం చేస్తే ఈ కథలోని హంసకు వచ్చినట్టుగా ప్రాణాలకే ఎసరు వస్తుంది. మనతో స్నేహం నటిస్తూ మనల్ని ఎగతాళి చేసే వారిని, మనతో ఉంటూనే మనకు చెడు చేసే వాళ్లను ఆమడ దూరంలో ఉంచాలని ఈ కథ చెబుతోంది.

Review ఆధ్యాత్మి‘కథ’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top