ఆధ్యాత్మిక స్ఫూర్తి ఆరోగ్య దీప్తి

సన్మార్గానికి తోవ చూపే అయ్యప్ప స్వామి దీక్ష

ఏటా కార్తీక మాసం నుంచి అయ్యప్ప దీక్షల సందడి మొదలవుతుంది. మార్గశిర-పుష్య మాసాల వరకు ఈ దీక్షాధారణలు కొనసాగుతాయి. మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో దీక్షను ముగిస్తారు.

ఆరోగ్య దీప్తి.. సామూహిక సామాజిక స్ఫూర్తి.. సత్యం వైపు నడిపించే జ్యోతి మార్గం.. అయ్యప్ప దీక్ష. మోక్షాన్ని పొందడమే మానవ జన్మ పరమార్థం. ఆ మోక్షసాధనకు మనిషి చేసే ఆధ్యాత్మిక ప్రయత్నానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు అనుక్షణం అడ్డుపడుతుంటాయి. వీటిని అధిగమించే నలభై ఒక్క రోజుల (మండల) దీక్షే- అయ్యప్ప దీక్ష. అదే అయ్యప్ప మాలధారణ. ఈ దీక్షాధారణతో మనిషిలోని చిత్తవృత్తులు అణగారిపోతాయి. మాలధారణ సమయంలో దీక్షాధారులు పాటించే కఠిన నియమాలతో శాంతం, సౌశీల్యం ఏర్పడతాయి. మండల కాల (41 రోజుల కాలం) దీక్ష పూర్తి కాగానే భక్తులు ఇరుముడులు నెత్తిన పెట్టుకుని చేసేదే శబరిమల యాత్ర. దీక్షధారణ నుంచి శబరిమల యాత్ర వరకు పాటించే నియమాలు, త్రికరణ శుద్ధిగా సాగించే సాధన మనసును, శరీరాన్ని ప్రక్షాళన చేస్తాయి. ఆధ్యాత్మికతను ఇనుమడింప చేస్తాయి. శబరిమలలో కొలువై సూదంటురాయిలా భక్తులను ఆకర్షిస్తున్న అయ్యప్పస్వామి.. ఆయన భక్తుల దీక్ష, జ్యోతియాత్రలపై ప్రత్యేక కథనం..

అయ్యప్ప స్వామి మాలధారణ చేసే భక్తులు పాటించే నియమాలు ఇంద్రియ నిగ్రహానికి, ఆత్మసంయమనానికి, దుర్వ్యసనాల నుంచి విముక్తికి దోహదపడతాయి. దీక్షలో ఉండే భక్తులు సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యాస్తమయం తరువాత చన్నీటితో స్నానం చేస్తారు. ఉదయం, రాత్రివేళల్లో కేవలం అల్పాహారం తీసుకుంటారు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారు. అల్పాహారమైనా, భోజనమైనా పూర్తిగా సాత్వికాహారమే తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలకు, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ధూమపానం, మద్యపానం, తాంబూలం వంటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. దీక్ష పూర్తయ్యే వరకు క్షురకర్మ సహా అన్ని బాహ్యాలంకారాలకు దూరంగా కేవలం దీక్షా వస్త్రాలతోనే ఉంటారు. కటిక నేల మీదే శయనిస్తారు. అయ్యప్ప దీక్షలో కొనసాగే భక్తులకు విధి నిషేధాలు చాలానే ఉన్నాయి. అయ్యప్ప మాలధారులు అనవసర ప్రసంగాలకు, అసత్యాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. పాదరక్షలను ధరించకూడదు. ఇతరులను మాటలు/చేతలతో హింసించే పనులేవీ చేయకూడదు. గురుస్వామి ద్వారా దీక్ష తీసుకున్నది మొదలు శబరిమల యాత్ర పూర్తి చేసుకుని మాలను తీసివేసేంత వరకు అయ్యప్ప భక్తులు ఈ కఠిన నియమాలను తు.చ. తప్పకుండా పాటించాలి. దీక్షలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం సత్సంగాలతోనూ, అయ్యప్ప స్వామి భజనల్లోనూ కాలం గడపాలి. ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ అనే శరణుఘోష నిత్యం నాలుకపై పలుకుతుండాలి. ఇంత నియమబద్ధంగా మండల దీక్ష పాటించే వారిలో శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి. దీక్షకు ముందు క్రమశిక్షణ లేకుండా గడిపే వారిలో సైతం దీక్ష పూర్తయ్యే నాటికి నియమబద్ధ జీవితం అలవడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంయమనం, సహనం, ఆత్మనిగ్రహం, ఏకాగ్రత పెరుగుతాయని చెబుతారు. ఒకసారి దీక్ష తీసుకున్న వారు ఏటేటా మళ్లీ మళ్లీ దీక్ష తీసుకుని అయ్యప్పను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతారు. ఏటేటా దీక్షలు చేపట్టే భక్తులు ఆధ్యాత్మిక చింతనతో తామసిక ప్రవృత్తికి దూరంగా ఉంటారు. అయ్యప్ప దీక్షబూనిన వారిని ‘స్వామి’ అని పిలుస్తారు. వీరంతా బృందాలుగా ఉంటూనే సామూహికంగా దీక్షలు సాగిస్తారు. ఈ దీక్షలు వారిలో సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు దోహదపడతాయి.

హరిహర పుత్ర అయ్యప్ప..

అయ్యప్ప స్వామి హరిహర సుతుడిగా ప్రసిద్ధుడు. మోహినీ అవతారంలోని విష్ణువును చూసి శివుడు మోహించిన ఫలితంగా అయ్యప్ప జననం సంభవించిందనే కథనం బాగా ప్రచారంలో ఉంది. మోహినీ అవతారం గురించి భాగవతంలో ప్రస్తావన ఉంటుంది. అయితే ఇందులో అయ్యప్ప జనన ప్రస్తావన కనిపించదు. అయితే హరిహర నందనుడిగా అయ్యప్ప జననానికి సంబంధించిన గాథ ‘శ్రీ భూతనాథ పురాణం’లో వివరంగా ఉంది. ఈ గాథ ప్రకారం.. భక్తులు అయ్యప్పస్వామిని హరిహర సుతుడిగానే భావిస్తారు. శివకేశవులకు పుట్టిన వాడైనందున శైవులు, వైష్ణవులూ కూడా అయ్యప్పను ఆరాధిస్తారు.
మెడలో మణిహారంతో అడవిలో దొరికి..

అయ్యప్ప స్వామి జనన కారణానికి సంబంధించిన ఒక గాథ ఉంది. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించాక, అతడి సోదరి మహిషి దేవతలపై పగబట్టింది. దేవతలపె పగదీర్చుకునే శక్తుల కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించింది. శివకేశవులకు పుట్టిన సంతానం తప్ప తననెవరూ జయించరాదని, అది కూడా ఆ హరిహర సుతుడు భూలోకంలో ఒక రాజు వద్ద పన్నెండేళ్లు సేవాధర్మం నిర్వర్తించిన తరువాత మాత్రమే తనను జయించాలని, లేకుంటే తన చేతిలో ఓడిపోవాలని వరం కోరింది. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇక అప్పటి నుంచి మహిషి దేవతలను పీడించసాగింది.
ఇదిలా ఉంటే, హరిహర నందనుడిగా మెడలో మణిమాలతో మణికంఠుడిగా జన్మించిన అయ్యప్ప తన తండ్రి శివుడి ఆజ్ఞపై పంపా సరోవర తీరాన ఉన్న అరణ్యంలో బాలకుడిగా అవతరించాడు. సంతానం లేని పందళ దేశాధీశుడైన రాజశేఖరుడు వేట కోసం అడవికి వెళ్లినపుడు దివ్య తేజస్సుతో ఉన్న ఈ బాలకుడు కనిపించాడు. భగవంతుడే తనకీ కుమారుడిని ప్రసాదించాడనే సంతోషంతో రాజశేఖరుడు ఆ పసివాడిని తన అంత:పురానికి తీసుకువెళ్తాడు. ముద్దులొలికే శిశువును చూసి మహారాణి సంతోషిస్తుంది. ఆ పసివాడు అంత:పురంలో అడుగుపెట్టిన వేళా విశేషంతో మహారాణికి కడుపు పండి, కొద్దికాలానికి మగ శిశువుకు జన్మనిస్తుంది. అడవిలో దొరికిన బాలకుడిని కూడా రాజ దంపతులు తమ కన్న కొడుకుతో సమానంగా అల్లారుముద్దుగా పెంచుతారు. బాలకుడిగా ఉన్నపుడే అయ్యప్ప జనులకు ధర్మవర్తనపై మార్గదర్శక సూత్రాలను బోధిస్తాడు. బాల్యంలోనే ఆయన ధర్మనిష్టకు ముగ్ధులైన జనులు ఆయనను ‘ధర్మశస్త’ పేరుతో పిలవసాగారు. మెడలో మణిహారంతో దొరికిన కారణంగా ‘మణికంఠుడ’నీ పిలిచేవారు. మణికంఠుడి సాత్విక గుణాల వల్ల కొందరు ఆయనను ‘అయ్య’ అనీ, ఇంకొందరు ‘అప్ప’ అనీ పిలిస్తే, మరికొందరు ఈ రెండు పదాలను కలిపి ‘అయ్యప్ప’ అనీ పిలవసాగారు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తిస్తాడు. విద్యాభ్యాసానికి తగిన వయసు రాగానే రాజశేఖరుడు అయ్యప్పను, తన కొడుకును గురుకులానికి పంపిస్తాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన తరువాత అయ్యప్పకు రాజు రాజ్యభారాన్ని అప్పగించాలని భావిస్తాడు. మహారాణికి అది నచ్చదు. తన కన్న కొడుకే రాజు కావాలనే కాంక్షతో తనకు భరించలేని తలనొప్పి అంటుకుందని, దాన్ని తగ్గించడానికి పులిపాలు కావాలని అంటుంది. దాంతో పులి పాలు తెస్తానంటూ అయ్యప్ప అడవికి బయల్దేరతాడు.

మహిషితో యుద్ధం
అయ్యప్ప అడవికి బయల్దేరే సమయంలో నారదుడు కూడా అడవికి వెళ్తాడు. అడవిలో తిరుగుతూ మునులను, దేవతలను పీడించే మహిషిని నారదుడు కలుస్తాడు. సహజంగానే కలహప్రియుడైన ఆయన, ‘నిన్ను చంపేందుకు రాజకుమారుడు ఈ అడవికి వస్తున్నాడు’ అని ఉప్పందిస్తాడు. దీంతో మహిషి రెచ్చిపోతుంది. పులి పాల కోసం అడవికి వచ్చిన అయ్యప్పను చంపడానికి మహిషి గేదె రూపంలో రంకెలు వేస్తూ బయల్దేరుతుంది. తనకు ఎదురుపడిన అయ్యప్పపైకి లఘిస్తుంది. అయ్యప్ప అమాంతం అక్కడే ఉన్న కొండపైకి ఎక్కి తాండవమాడుతూ మహిషిని ఎదుర్కొంటాడు. మహిషితో అయ్యప్ప చేస్తున్న యుద్ధాన్ని చూడ్డానికి దేవతలంతా అదృశ్య రూపంలో అక్కడికి చేరుకుంటారు. భీకర యుద్ధంలో అయ్యప్ప మహిషిని ఒడిసిపట్టుకుని నేలకేసి విసిరి కొట్టడంతో ఆమె మరణిస్తుంది. మహిషి పీడ విరగడ కావడంతో ఇంద్రాది దేవతలు హర్షాతిరేకాలతో అయ్యప్పను వేనోళ్ల ప్రస్తుతిస్తారు.
‘స్వామీ! నిన్నెలా సేవించుకోవాలి?’ అని దేవతలు అడుగుతారు.
‘నేను పులిపాల కోసం ఈ అడవికి వచ్చాను. మీరంతా పులులుగా మారి నాకు తోడ్పడండి’ అంటాడు అయ్యప్ప.
దేవతలంతా పులులుగా మారిపోయారు. ఇంద్రుడు పులి రూపంలో తానే అయ్యప్పకు వాహనంగా మారాడు. పులుల దండుతో అయ్యప్ప రాజ్యానికి చేరుకుంటాడు. పులిపాల కోసం పంపితే ఏకంగా పులుల దండుతో వచ్చిన అయ్యప్పని చూసి రాజ పరివారం, జనులు ఆశ్చర్యపోతారు.

రాజ్యం వద్దు.. ఆలయం చాలు!
అడవి నుంచి రాజ్యానికి చేరుకున్న అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలని రాజశేఖరుడు భావిస్తాడు. అయ్యప్ప తనకు రాజ్యం వద్దని, తనకు ఒక ఆలయాన్ని నిర్మించి ఇస్తే చాలని అంటాడు. తాను ఇక్కడి నుంచి సంధించి విడిచిపెట్టిన బాణం ఎక్కడ పడుతుందో అక్కడే ఆలయం నిర్మించాలని సూచిస్తాడు. అయ్యప్ప విడిచిన బాణం శబరిమల కొండపైన పడుతుంది. అక్కడ కట్టించిన ఆలయంలోనే అయ్యప్ప స్థిరనివాసం ఏర్పర్చుకుని జనుల మంచిచెడ్డలు చూసేవాడు. ఈ ఆలయంలో కొలువైన అయ్యప్ప ఇప్పటికీ తమ కోర్కెలు తీరుస్తుంటాడని భక్తుల నమ్మకం. అయ్యప్ప వెలసిన ఈ శబరిమల లోగడ రామభక్తురాలైన శబరికి ఆవాసంగా ఉండేదని అంటారు. శబరి శ్రీరాముడికి ఎంగిలి పండ్లను రూచి చూపించిన ప్రదేశం ఇదేనని ప్రతీతి.

మకరజ్యోతి దర్శనంతో..
అయ్యప్ప దీక్ష స్వీకరించి, నియమబద్ధంగా మండలం రోజులు గడిపిన భక్తులు శబరిమల యాత్రకు బయల్దేరుతారు. స్వామి సన్నిధానాన్ని సందర్శించుకుని ఇరుముడిని స్వామికి సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరించడంతో యాత్ర ముగుస్తుంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లా పడమటి కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది శబరిమల. దట్టమైన అడవులు ఉన్న ఈ ప్రాంతంలో పద్దెనిమిది కొండల నడుమ ఉన్న శబరిమల అయ్యప్ప సన్నిధానానికి యాత్రలు ఏటా నవంబరు నెలలో ప్రారంభమవుతాయి. జనవరి నెలలో మకర సంక్రాంతి నాటికి సాగించే జ్యోతి యాత్రతో ముగుస్తాయి. కార్తీక మాసంలో మండల దీక్ష తీసుకునే స్వాములు సాధారణంగా నవంబరు నెలలో స్వామిని దర్శించుకుని యాత్రను ముగిస్తారు. ‘మకర విళక్కు’ యాత్రకు వెళ్లే వారు మకర సంక్రాంతి నాడు స్వామిని దర్శించుకుంటారు. ఇదే రోజు ఆలయం నుంచి చూసే వారికి ‘మకరజ్యోతి’ కనిపిస్తుంది. దీని దర్శనంతో జ్యోతి యాత్ర ముగుస్తుంది.

గురుస్వామి నుంచే దీక్షధారణ..
అయ్యప్ప దీక్ష చేపట్టే భక్తులు గురుస్వామిని సాక్షాత్తూ అయ్యప్ప స్వామికి ప్రతిరూపంగా భావిస్తారు. గురుస్వాములే మిగిలిన స్వాములకు మాలధారణం గావిస్తారు. తొలిసారి అయ్యప్ప మాల ధరించే వారిని కన్నెస్వాములని అంటారు. రెండోసారి మాలధారణ చేసిన వారిని కత్తిస్వాములని, మూడోసారి దీక్ష చేపట్టే వారిని ఘంటస్వాములని, నాలుగోసారి మాలధారణ చేసిన వారిని గద స్వాములని, ఐదోసారి మాలధారణ చేసే వారిని పెరుస్వాములని, ఆరోసారి మాలధారణ చేసే వారిని గురుస్వాములని పిలుస్తారు.

‘పడిపూజ’ అంటే..
అయ్యప్ప దీక్షా సమయంలో బాగా వినిపించే మాట- ‘పడిపూజ’. అయ్యప్ప స్వామి దీక్షలో కొనసాగే భక్తులు శక్తి మేరకు తోటి స్వాములను ఆహ్వానించి భిక్ష (భోజనం) పెడతారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని తలపించే రీతిలో పద్దెనిమిది మెట్లతో పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై అయ్యప్పను నిలిపి పూజలు చేస్తారు. భజనలు, పూజలు, శరణుఘోషతో భక్తి పారవశ్యాలతో గడుపుతారు. ఈ కార్యక్రమాన్నే ‘పడిపూజ’ అంటారు.

ఇరుముడిలో ఏమేం ఉంటాయంటే..
అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమల వెళ్లే భక్తులు నెత్తి మీద ‘ఇరుముడి’ని పెట్టుకుని
వెళ్తుంటారు. ఇరుముడి అంటే రెండు అరలు ఉండే మూట. ఈ ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ ఒకటి, రెండు మామూలు కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, నాణేలు, పసుపు, గంధపు పొడి, విభూతి, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, అరటిపండ్లు, కలకండ, అగరవత్తులు, కర్పూరం, మిరియాలు (వావరు స్వామి కోసం), తేనె, ఎండుద్రాక్ష, తువ్వాలు తదితరమైనవి పెట్టుకుంటారు. దీక్ష స్వీకరించే భక్తులు ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని ‘కెట్టునిరా’ లేదా ‘పల్లికట్టు’గా వ్యవహరిస్తారు.
అయ్యప్పకు జోలపాట.. హరివరాసనం
అయ్యప్ప స్వామి పూజ చివరిలో ‘హరివరాసనం’ లేదా ‘శ్రీ హరిహరాత్మజాష్టకం’ గానం చేయడం సంప్రదాయం. శబరిమలతో పాటు ఇతర ప్రాంతాల్లోని అయ్యప్ప స్వామి ఆలయాల్లోనూ ‘హరివరాసనం’ గానంతో అయ్యప్ప పూజలను ముగిస్తారు. ఇది స్వామి వారికి జోలపాట వంటిది. ఇందులో ఎనిమిది శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతున్నప్పుడు ఆలయంలోని ఒక్కొక్క దీపాన్ని కొండెక్కిస్తారు. చివరిగా గర్భగుడిలో ఒక్క దీపాన్ని మాత్రమే ఉంచుతారు. ‘హరివరాసనం’ స్తోత్రాన్ని కుంబకుడి కులతూర్‍ అయ్యర్‍ రచించారు. స్వామి విమోచానంద ఈ స్తోత్రాన్ని 1955లో శబరిమలలో గానం చేశారు. అప్పట్లో ఈ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగా ఉండేది. ఆ కాలంలో వీఆర్‍ గోపాలమీనన్‍ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తుండే వాడు. ఆయన అయ్యప్ప సన్నిధానంలో నిత్యం ‘హరివరాసనం’ స్తోత్రాన్ని గానం చేస్తూ వచ్చేవాడు. కొన్నాళ్లకు గోపాలమీనన్‍ శబరిమల నుంచి వెళ్లిపోయారు. తరువాత కొంతకాలానికి కాలం చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న అయ్యప్ప స్వామి ఆలయ అర్చకుడు ఈశ్వరన్‍ నంబూద్రి ఆలయాన్ని మూసివేసే సమయంలో ‘హరివరాసనం’ స్తోత్రాన్ని గానం చేశాడు. అప్పటి నుంచి ఆలయం మూసివేసే సమయంలో ఈ స్తోత్రాన్ని గానం చేయడం సంప్రదాయంగా వస్తోంది.

నలుపు దుస్తులే ఎందుకు?
అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు దీక్షా వస్త్రాలుగా నలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారనేందుకు ఒక నేపథ్యం ఉంది. ఒకసారి శనీశ్వరుడు అయ్యప్పస్వామితో తలపడి ఓటమి చెందాడు. శనీశ్వరుడు శరణువేడటంతో క్షమించిన అయ్యప్ప స్వామి ఆయనకు ‘నా దీక్ష చేపట్టే భక్తులు నీకు ఇష్టమైన నలుపు రంగు దుస్తులే ధరిస్తారు’ అంటూ వరమిచ్చాడు. అందుకే అయ్యప్ప భక్తులు నలుపు రంగు వస్త్రాలను ధరించే సంప్రదాయం ఏర్పడింది. అలాగే, అయ్యప్ప భక్తులకు శనీశ్వరుడు ఎలాంటి ఇక్కట్లూ కలిగించడని ప్రతీతి.

18 మెట్ల ప్రత్యే‘కథ’
శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో వారి ముద్దుల తనయుడైన అయ్యప్ప స్వామిని స్మరిస్తూ భక్తులు మాలధారణ చేస్తారు. 41 రోజులు కఠిన నిష్టతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఇరుముడితో సన్నిధానంలోని పద్దెనిమిది మెట్లెక్కి మణికంఠుడిని దర్శించుకుని దీక్షను చాలిస్తారు. ఈ 18 మెట్ల విశిష్టత ఏమిటంటే..

శబరిగిరి అయ్యప్ప స్వామి ఆలయాన్ని సన్నిధానం అనీ, ఇక్కడి మెట్లను ‘పదునెట్టాంబడి’ అనీ పిలుస్తారు. ఈ సోపానాలే కైవల్యపథమని భక్తుల విశ్వాసం. ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని అంటారు. పద్దెనిమిది మెట్లే ఎందుకన్న ప్రశ్న కలగడం సహజం. పౌరాణిక కథను అనుసరించి.. ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతున్న మహిషిని సంహరించేందుకు మణికంఠుడు అవతరించాడు. ఈ రక్కసిని వధించిన అనంతరం తనను పెంచిన తండ్రి అయిన పందళం రాజుకు తాను శబరిగిరిపై కొలువు దీరనున్నట్టు తెలిపాడు. ఆ స్వామి ఉన్నత స్థానంలో ఆశీనుడయ్యేందుకు వీలుగా చతుర్వేదాలు, ఆరు శాస్త్రాలు, అష్ట దిక్పాలకులు పద్దెనిమిది మెట్లుగా అమరాయి. అయ్యప్ప వాటిపై తన పాదాలను మోపాడు. పట్టబంధాసనంలో కూర్చుని యోగముద్రతో దర్శనమిచ్చి జ్యోతిరూపంలో అంతర్థానమయ్యాడు.

మెట్టు మెట్టుకో అధిష్ఠాన దేవత..
మండలం రోజులు దీక్ష చేసి ఇరుముడితో వచ్చిన భక్తులు ‘పదునెట్టాంబడి’ మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుకుంటారు. ఈ మెట్లలో వీరమణికంఠుడు తన అస్త్రశక్తిని నిక్షిప్తం చేశాడని అంటారు. ఈ పరమ పవిత్ర మెట్లకు మహంకాళి. కళింకాలి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, బేతాళ, నాగరాజ, కర్ణ, వైశాఖ, పుళిందిని, రేణుకా పరమేశ్వరి, స్వప్న వారాహి, ప్రత్యంగిర, నాగయక్షిణి, మహిషాసురమర్దిని, అన్నపూర్ణేశ్వరి మాతలు అధిష్ఠాన దేవతలు. ఈ పద్దెనిమిది మెట్లకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అవి- అణిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశిత్వ, ఈశత్వ, ఇచ్ఛ, బుద్ధి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వ ప్రియంకర, సర్వమంగళకర, సర్వదు:ఖ విమోచన, సర్వ మృత్యుప్రశమన, సర్వవిఘ్న నివారణ, సర్వాంగసుందర, సర్వసౌభాగ్యదాయక.

సన్మార్గానికి సోపానాలు
ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో దుర్గుణాన్ని వదిలేయాలన్నదే అయ్యప్ప దీక్ష ముఖ్యోద్దేశమని స్థల పురాణం తెలియచేస్తోంది. ఇది సాధన, క్రమశిక్షణలతోనే సాధ్యం. అందుకు తగినట్టుగా మాలధారణ నియమాలు ఉంటాయి. సద్గుణాలను అలవర్చుకోవాలనే లక్ష్యంతోనే భక్తులు పలుమార్లు శబరిగిరి యాత్ర చేస్తారు. మొదటి ఆరు మెట్లు అరిషడ్వర్గాల (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు)ను వదిలేయాలని సూచిస్తాయి. 7, 8, 9 మెట్లు త్రికరణ శుద్ధిని పొందాలని, 10, 11, 12, 13, 14 మెట్లు ఇంద్రియ నిగ్రహం (కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మం.. వీటి కారణంగా కలిగే అవలక్షణాలను అధిగమించే శక్తి) అలవర్చుకోవాలని తెలియజెబుతాయి. 15, 16, 17 మెట్లు సత్వ, రజో, తమో గుణాలను త్యజించాలని చెబితే.. 18వ మెట్టు అజ్ఞానాన్ని విడనాడాలనే సంకేతాన్నిస్తుంది. వీటన్నింటినీ అధిగమించిన తరువాతే భగవంతుని చేరుకోగలమనడానికి సంకేతమే ఈ 18 మెట్లను ఎక్కిన తరువాత కలిగే అయ్యప్ప స్వామి దర్శనంగా చెబుతారు. అలాగే, ఈ పద్దెనిమిది మెట్లు అష్టాదశ పురాణాలకు ప్రతీక అని కూడా అంటారు.
ఇరుముడితోనే అధిరోహణం..

అయ్యప్ప దీక్షాధారులు ఇరుముడితో మాత్రమే ఈ 18 మెట్లను అధిరోహించాలనేది నియమం. స్వామి దర్శనం చేసుకునేందుకు ఉత్తరాన ఉన్న మెట్ల మీదుగా వెళ్లాలి. పడి పూజ చేసే ఆలయ అర్చకులకు మాత్రమే ఇరుముడి లేకుండా పడిని ఎక్కే అర్హత ఉంటుంది. వీరు ఇందుకోసం దాదాపు ఒక సంవత్సర కాలం దీక్ష చేసి వస్తారు.

‘జ్యోతి’మార్గమిదిగో..
దీక్షబూనిన భక్తులు ఎప్పుడెప్పుడు శబరిమల యాత్ర పూర్తి చేసి అయ్యప్పను దర్శించుకుందామా అని తహతహలాడుతుంటారు. ఇలా సాగించే యాత్రనే వనయాత్ర అంటారు. దీక్ష ఇక కొద్దిరోజుల్లో ముగిసి జ్ఞానాన్ని, బుద్ధిని కలిగించేలా మార్పు తెచ్చే సందర్భం కాబట్టి దీనినే జ్ఞాన యాత్ర అనీ అంటారు. ఈ వనయాత్ర రెండు రకాలు. చిన్నపాదం, పెద్దపాదంగా పిలిచే ఈ యాత్రల్లో పెద్దపాదం యాత్ర కఠినతరమైనది. చిన్నపాదం యాత్ర పంబా నది నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు కొనసాగుతుంది. పెద్దపాదం యాత్ర ఎరుమేలి నుంచి సన్నిధానం వరకు దట్టమైన అరణ్యంలో 61 కి.మీ. మేర సాగుతుంది. పంబ వద్ద చిన్నపాదం, పెద్దపాదం స్వాములంతా కలుసుకుంటారు. అక్కడి నుంచే కలసికట్టుగా సన్నిధానానికి చేరుకుంటారు.

ఎరుమేలి నుంచి ఆరంభం..
పెద్దపాదంగా పిలిచే వనయాత్ర ఎరుమేలి నుంచి ఆరంభమవుతుంది. ఇక్కడే స్వాములు స్నానాలు చేసి ‘పేటైతుళ్లి’ ఆడతారు. అక్కడున్న ధర్మశాస్త ఆలయంలో స్వామి ధనుర్బాణాలతో ఆశీనుడై ఉంటాడు. చెంతనే వినాయకుడూ కొలువుదీరి ఉంటాడు. ఆయననే ఆదిమూలం గణపతి అని పిలుస్తారు. స్వాములు పేటైతుళ్లి ఆడుతూ మసీదులో ఉన్న వావరు స్వామిని దర్శిస్తారు. అనంతరం గురుస్వామి కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభిస్తారు. వావరు స్వామి మహమ్మదీయుడు. పులి పాల కోసం అడవికి వచ్చిన అయ్యప్పను బందిపోటు అయిన వావరు అడ్డగిస్తాడు. అతనిలో దుర్గుణాలను తొలగించి తన భక్తుడిగా మార్చుకుంటాడు అయ్యప్ప.

పేరూర్‍ తోడు.. ఇరుంబునిక్కర్‍.. కాలైకట్టి..
ఎరుమేలి నుంచి 4 కి.మీ. ప్రయాణిస్తే పేరూర్‍ తోడు వస్తుంది. ఇక్కడ ఏనుగులకు స్వాములు ఆహారం పెడతారు. ఇక్కడి నుంచి మరో 4 కి.మీ. నడిస్తే ఇరుంబు నిక్కర్‍ క్షేత్రం వస్తుంది. ఇక్కడ అమ్మవారు, గణపతి, శివుడు కొలువై ఉంటారు. ఇక్కడి నుంచి మరో 6 కి.మీ. ప్రయాణించి కాలైకట్టి చేరుకుంటారు. వనయాత్రలో ఉన్న స్వాములు తొలి మజిలీ చేసేదిక్కడే. మలయాళంలో ‘కాలై’ అంటే ఎద్దు. ‘కట్టి’ అంటే కట్టడం. అయ్యప్ప – మహిషి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో దాన్ని చూడ్డానికి పరమశివుడు ఇక్కడకు వచ్చి తన వాహనమైన నందిని కట్టింది ఈ ప్రాంతంలోనేనని అంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని కాలైకట్టి అంటారు.

అళుదా నది..
కాలైకట్టి నుంచి రెండు కి.మీ. ప్రయాణిస్తే అళుదా నది వస్తుంది. పంబా నదికి ఇది ఉపనది అంటారు. యుద్ధ సమయంలో మహిషి కార్చిన కన్నీరే అళుదా నదిగా మారిందని చెబుతారు. ఈ నదిలోంచి రెండు రాళ్లను తీసుకుని భక్తులు ముందుకు సాగుతారు. ఇక్కడి నుంచి నడక మార్గం చాలా క్లిష్టంగా మారుతుంది. అందువల్ల నడిచే ఓపిక లేని స్వాములు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇక్కడి నుంచి ఆటోల్లో పంబకు చేరుకోవచ్చు.

అళుదా కొండ
అళుదా నది దాటగానే వచ్చే అళుదా కొండ నిట్టనిలువుగా ఉంటుంది. దీన్ని ఎక్కడం సవాలే. అందుకు కొండ ఎక్కే సమయంలో స్వాములు అయ్యప్ప నామాలను బిగ్గరగా చదువుతారు. అలా 2 కి.మీ. ముందుకు వెళ్తే కాస్త సమతులంగా ఉన్న ప్రాంతం వస్తుంది. దీనినే ‘అళుదా మేడు’ అంటారు. అక్కడే ‘కాళిడం కుండ్రు’ ఉంటుంది. అళుదా నదిలోంచి తీసుకున్న రెండు రాళ్లను ఇక్కడ ఉంచుతారు. అనంతరం మళ్లీ కొండ ఎక్కడం ప్రారంభమవుతుంది. సన్నని కాలిబాట.. చుట్టూ దట్టమైన అరణ్యంలో యాత్ర సాగుతుంది.
ఇంజిప్పార్‍ కోట: అళుదా కొండను పూర్తిగా ఎక్కిన తరువాత వచ్చే సమతల ప్రాంతమే ఇంజిప్పార్‍ కోట. ఇక్కడ కోటయిల్‍ శాస్త్రి స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడే ఉదయనుడనే బందిపోటును అయ్యప్ప సంహరించాడని పురాణగాథ. ఈ ప్రాంతంలో ఇప్పటికీ శిథిలమైన ఓ కోట ఉంటుంది. ఇక్కడి నుంచే అళుదా కొండ దిగడం మొదలవుతుంది.

ముక్కలి: ఇంజిప్పార్‍ కోట నుంచి కిందకు దిగితే ముక్కలి అనే క్షేత్రం వస్తుంది. ఇక్కడ అమ్మవారు, అయ్యప్ప, గణపతి కొలువై ఉంటారు. ఇక్కడ స్నానాలు, కాలకృత్యాలు, విశ్రాంతి తీర్చుకునేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. యాత్ర కష్టమనుకునే భక్తులు ఇక్కడి నుంచి కూడా పంబకు ఆటోల్లో వెళ్లిపోతారు.

కరిమల పాదం: ముక్కలి నుంచి కరిమల కొండ ప్రారంభం వరకూ నాలుగు కి.మీ. కారడవిలో ప్రయాణించాలి. ఈ నడక మార్గాన్ని భక్తులు కరిమల పాదంగా వ్యవహరిస్తారు. కరిమల పాదం యాత్ర ముగింపు వద్ద కూడా పావన పంబా ఉపనది ప్రవహిస్తుంటుంది.

కరిమల తోడు: అళుదా కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం ఇంకా కష్టం. దట్టమైన చీకటి ప్రాంతంలో నడక సాగుతుంది. దిగే మార్గంలో కొండ అంచులు చాలా సున్నితంగా ఉంటాయి. అడుగులో అడుగేసుకుని దిగాక సన్నటి నీటి పాయ కనిపిస్తుంది. దీన్నే కరిమల తోడు అంటారు. కరి అంటే ఏనుగు. ఈ ప్రాంతంలో ఏనుగులు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరొచ్చింది.

కరిమల కొండ: మొత్తం వనయాత్రలో స్వాములు ఈ కరిమల కొండను దాటడమే కష్టమని గురుస్వాములు చెబుతారు. కరిమల కొండ ఎక్కే సమయంలో భక్తులు ‘కరిమల ఏట్రమే కఠినం.. కఠినం..’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతారు. ఈ కొండ ఏడంతస్తులుగా ఉంటుంది. కొండ ఎక్కే సమయంలో నిట్ట నిలువుగా ఉండటం ఒకెత్తయితే అంచుల చుట్టూ ఉన్న సన్నని బాటపై నడక సాగించడం మరో ఎత్తు. అయ్యప్ప నామమే ఆసరాగా స్వాములు ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొండ చివరకు చేరుకునే చివరి 5 కి.మీ. మాత్రం స్వాములకు తీవ్ర అలసట కలిగిస్తుంది.

కరిమల శిఖరం: దీక్షాధారులు కరిమల శిఖరం ఎక్కాక అక్కడ కరిమల భగవతి, కరిమలాంతన్‍, కొచ్చుక దుత్తస్వామి వార్ల ఆలయాలను దర్శించుకుంటారు. అమ్మవారికి కర్పూర హారతిని ఇస్తారు. కరిమల శిఖరం మీద గల కరిమల భగవతి సమక్షంలో కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. భగవతి ఆలయానికి కొద్ది దూరంలో నజిక్కిన్నార్‍ అనే నీటి బావి ఉంటుంది. ఇందులో నీరు సర్వకాలాల్లోనూ ఊరుతూనే ఉంటుంది. ఈ బావిలోని నీళ్లు తీయగా ఉంటాయని, రోగాలను హరిస్తాయంటారు.

పెరియాన వట్టం.. శిరియాన వట్టం: కరిమల శిఖరం నుంచి స్వాములు చాలా జాగ్రత్తగా కిందకు దిగాలి. ఇక్కడ కొండ చివరి అంచు నుంచి కిందకు జారిపడిపోయే ప్రమాదముంది. కరిమల శిఖరం నుంచి సరిగ్గా రెండు కి.మీ. కిందకు దిగాక ఒక పెద్ద బండరాయి వస్తుంది. అది జారుడుబల్లలా ఉంటుంది. ఈ బండ దిగేటపుడు స్వాములు ఒకరికొకరు సాయం చేసుకుంటూ దిగుతారు. వనయాత్రలో ఈ ప్రాంతమే కఠినమైనది. తరువాత అడవిని దాటుకుంటూ ముందుకు సాగితే, మొదట పెరియానవట్టం.. తరువాత శిరియానవట్టం వస్తాయి. పెరియానవట్టంలో ఏనుగులు ఎక్కువగా దాహం తీర్చుకునేందుకు వస్తాయి. మరో రెండు కి.మీ. దూరంలో శిరియానవట్టం వస్తుంది. ఇక్కడ స్వాముల కోసం అన్నదానాలు నిర్వహిస్తారు.

పంబా నదీ తీరం: కరిమల కొండను దిగాక పావన పంబా నదీ తీరం కనిపిస్తుంది. శిరాయనవట్టం నుంచే భక్తులకు ఈ నది కనువిందు చేస్తుంటుంది. ఇక్కడే అయ్యప్ప శిశువుగా రాజశేఖరుడికి దొరికాడని అంటారు. పంబకు చేరుకున్న భక్తులు తప్పక నదిలో స్నానం చేసి పితృ దేవతలకు పిండ ప్రదానం చేసే సంప్రదాయం కూడా ఉంది. చాలామంది భక్తులు ఇక్కడ పంబా సద్ది చేస్తారు. అంటే సమూహంలోని స్వాముల ఇరుముడిలోని కొంత బియ్యాన్ని తీసి అన్నం వండుకుని అందరూ తింటారు. సాయంకాలం వేళ స్వాములంతా కలిసి మకర విళక్కు నిర్వహిస్తారు. ఇక్కడితో వనయాత్ర ముగుస్తుంది.

చిన్నపాదం: పంబా నుంచి స్వాములు చిన్నపాదం ప్రారంభం దగ్గరి నుంచి హారతి వెలిగించి ముందుకు సాగుతారు. కొద్దిదూరం వెళ్లాక కన్నెమూల గణపతి దగ్గర ఇరుముడి నుంచి తీసిన మొదటి కొబ్బరికాయను సమర్పిస్తారు. అక్కడే ఉన్న రాముడిని, హనుమంతుడిని, ఇతర దేవీదేవతలను దర్శించుకుంటారు. తరువాత క్షేత్ర పాలకుడైన పంబల వంశరాజును దర్శించి, ఆయన ఆశీర్వాదం పొంది యాత్రను కొనసాగిస్తారు. ఇక్కడి నుంచి అయ్యప్ప సన్నిధానం ఆరు కి.మీ. ఉంటుంది. చాలా వరకు క్యూలైన్లు ఉంటాయి.

నీలిమల: పంబా నది దాటగానే వచ్చే మొదటి కొండ ఇది. ఇది అళుదా, కరిమల మాదిరిగానే క్లిష్టంగా ఉంటుంది. మొదటి 2 కి.మీ. ఎక్కడం చాలా కష్టం. ఈ పర్వతం గురించి రామాయణంలో ప్రస్తావన ఉంది. అప్పట్లో దీనిని మాతంగి వనం అనేవారట.

అప్పాచిమేడు: నీలమల శిఖరం ఎక్కాక వచ్చే సమతల ప్రదేశమే అప్పాచిమేడు. ప్రస్తుతం భక్తులను ఇక్కడే ఆపి క్యూ లైన్లలో పంపుతున్నారు.

శబరి పీఠం: అప్పాచిమేడుకు కి.మీ. దూరంలో శబరి పీఠం.. ఇక్కడ కన్నెస్వాములు బియ్యం ఉండలను విసురుతూ మంచి జరగాలని కోరుకుంటారు. రామాయణ కాలంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు ఇక్కడే ఆరగించాడని అంటారు. అందుకే దీనికి శబరి పేరుపై శబరిపీఠం అనే పేరొచ్చింది. ఈ కొండనే శబరిమల.

శరంగుత్తి: శబరిమల కొండను కిలోమీటరు మేర ఎక్కాక శరంగుత్తి వస్తుంది. కన్నెస్వాములు ఎరుమేలి నుంచి తమతో తెచ్చుకున్న శరాలను ఇక్కడే గుచ్చుతారు. మహిషి తన శాపం తీరిపోయాక లీలావతిగా మారి తనను పెళ్లాడాలని అయ్యప్పను కోరుతుంది. అందుకు తిరస్కరించిన అయ్యప్ప.. ఏ సంవత్సరం అయితే కన్నెస్వామి నా కొండకు రాడో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. అయితే, ఏటా కన్నెస్వాములు కొన్ని వేల బాణాలను ఇక్కడ గుచ్చుతూనే ఉంటారు. లీలావతి మాళికాపురోత్తమ్మగా శబరి కొండపై అవతరించి
ఏటా మకరజ్యోతి సమయానికి ఇక్కడకు ఊరేగింపుగా వచ్చి బాణాలు ఉండటం చూసి నిరాశగా వెళ్లిపోతుందట.

శబరిమల క్షేత్రం: శరంగుత్తి దాటి ఫర్లాంగు దూరం నడిచి ఎడమపక్కకు తిరిగితే శబరిమల క్షేత్రం కనిపిస్తుంది. నెమ్మదిగా సన్నిధానం చేరుకుని దివ్య పదునెట్టాంబడి (పద్దెనిమి మెట్లు) ఎక్కి బంగారుస్వామిని దర్శించి, ఇరుముడులు సమర్పిస్తారు భక్తులు. శబరిమలకు ఎదురుగా ఉన్న కొండను కాంతిమల అని పిలుస్తారు. ఇక్కడే మకరజ్యోతి దర్శనం జరుగుతుంది. సంక్రాంతి రోజున మధ్యాహ్నం నుంచే స్వామి దర్శనాన్ని నిలిపివేస్తారు. పందళం నుంచి తెచ్చిన తరువాభరణాలను స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడితో శబరిమల యాత్ర పూర్తవుతుంది.

Review ఆధ్యాత్మిక స్ఫూర్తి ఆరోగ్య దీప్తి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top