ఆనందం అలలై.. బంగారు కలలై…

గురువులు
పూజ్యశ్రీ శివరామకృష్ణ గారికి ….
రక్షాబంధన శుభాకాంక్షలతో …
ప్రణామాలతో …
అవును నాకు తెలుసు. హృదయేశ్వరా, ఇదంతా నీ ప్రేమే, ఇంకేమీ కాదు.
చెట్ట ఆకులపైన చిందులు త్రొక్కే ఈ బంగారు కాంతి, ఆకాశంపైని
తేలిపోయే సోమరి మబ్బులు నా నుదుటి మీద తన చల్లని స్పర్శని వదలి
పోయేగాలి, ఇదంతా నీ ప్రేమే కాక ఇంకేమి కాదు
– ఠాగూర్
నిర్మల గంగాఝరీ ప్రవాహంలాంటి మీ ప్రేమలో తడవ గలిగిన అదృష్టం… కూడా ‘ఆయన’ ప్రేమే కాక, ఇంకేమీ కాదు. మీ ఉత్తరం తలుపు తెరవగానే తీయని సౌరభమేదో తీగలుగా సాగి మనసును పెనవేసుకున్న ఆనందం.
మీరు పంపిన పేజీలు చదివాను. చా…లా బావున్నాయి. మీ మేధోశార్దూల గర్జనలకు బెదరి, ఆనందాశ్చర్యామృతంలో మునగటం తప్ప, వాటిని కొలవగలిగే కొలతబద్ద నా దగ్గర లేదు. ఎన్నో ఏళ్లుగా మీరు బోధించే పాఠాలతో, మీ ఉపన్యాసాలతో, నా భావనాలోకాలనెన్నిటినో పావనం చేసుకున్నాను. మీరు ప్రయోగించే నవరసాల శబ్ద ధనుస్సు – మనసులో ఆనంద సాగరాలను సృష్టి స్తోంది. మీరు భాసర క్షేత్ర సందర్శన సందర్భంగా ఇక్కడకు వచ్చినపుడు చాలా ఆనందం పొందినట్లు రాశారు. నిజానికి నేను ఎన్నో ఏళ్లుగా నీ రాకకై శబరిలా నిరీక్షించాను. మీరు, మేడమ్గారు, మీ మామయ్యగారు… అందరూ కలసి, మమతల మధురామృతాన్ని పంచుతూ రావటం నన్ను సంతోష తరంగితాంతరంగుణ్ణి చేసింది. ఆనందం అలలై బంగారు కలలై మనసంతా ఆక్రమించింది. మీరు, మేడమ్గారు ఎంతో ప్రేమతో వెలిగించిన దీపం దు:ఖాల చీకట్లను దిశాంతాలకు పారద్రోలే మమతల మణిదీపంలా భాసిల్లింది.
నా గురించి ఎన్నో విన్నారని ఎంతో ఆప్యా యతతో రాశారు. మిత్రులంతా వారి వారి కమనీయానురాగ కుంభాకార కటకాల్లోంచి నన్ను చూస్తారు కాబట్టి – వాళ్ల కళ్లకు ‘పరమాణువు’ పర్వతంలా కనిపించవచ్చు. అదంతా వాళ్ల నయనాల్లోని అనురాగ ‘నయాగరా’ లా తుంపర సృష్టించే ఇంద్రధనుస్సుల ఇంద్రజాలం తప్ప మరేమి కాదు. తెలిసో, తెలియకో నేనేదైనా ఆనందం వాళ్లకు కలిగించి ఉంటే అది మీ అంతులేని ఆప్యాయత, ఆధ్యాత్మిక వెన్నెల వాన కురిపించే మీ ఉపన్యాసాలు నా జీవన వక్షస్థలంపై వదలిన చెరగి పోని చరణాల ముద్రల ప్రభావం తప్ప ఇంకేమీ కాదు. చెబితే మీరు నమ్మలేక పోవచ్చుగాని, ఎమ్.ఏ.లో, ఎమ్.ఫీల్.లో మీ విద్యార్థిని అయ్యే అవకాశం కనక నాకు లభించ నట్లై ఉంటే – జీవన శిథిలాలయంలో పగిలి పోయిన కలల శకలాలను ప్రోగుచేసు కుంటూ ఉండేవాడిని
ఆచార్య తిరుమలగారన్నట్లు :
చెట్టు ఎన్ని అడుగులు
పైకెదుగుతూ పోయినా
దాని వేళ్లు మాత్రం
అది మొలకెత్తిన నేలలోనే!
మీ జాబుతో నా జేబు నిండా నింపుకోవలసిన వాక్యాలు రాశారు. ఆర్ధ్రత, ఆపేక్ష ప్రేమల గురించి రాస్తూ, ఇవి ఎంత అమూల్యమో అంత అపురూప అంశాలు అంటూ అపురూపంగా రాశారు.
ఏ నూనె
ఏ వత్తీ
వెదకనవసరం లేకుండా
వెలిగే
విస్ఫులింగం – ప్రేమ
అంటూ ‘ప్రేమ’ గురించి మీరు రాసిన వాక్యాలు – కవితా సుమగంధ మాధురీ ధారలను జాలువారుస్తూ అద్భుతంగా ఉన్నాయి. నిస్వార్థ, వాంఛారహిత, నైర్మల్య ప్రేమ గురించి అంతకన్నా గొప్పగా చెప్పటం అసాధ్యమనిపిస్తూంది. అలాగే ‘‘అనుకోవటం ఒకటి – అనుభూతి వేరొకటి. రెంటికీ సమన్వయమే సాధన’’ అంటూ సూత్రీ కరించిన వాక్యాలు – ఆధ్యాత్మిక అంశాలతల్లా ఉన్నాయి. ఉత్తరం చాలా బాగా రాశారు. అంతరంగ జీవితం గురించి కూడా చాలా అమో ఘంగా రాశారు. అంతటి విలువైన ఉత్తరాన్ని, విలువైన మీ సమయాన్ని కరిగించి, అంత ప్రేమతో రాసిన మీకు కృతజ్ఞతలు తెలపటం కష్టంగాను, ఇష్టంగాను ఉంది. కృతజ్ఞత తెలపటం కూడా మరచిపోయేంత ఆనందం అంతరంగాన్ని ముంచెత్తుతూంది.
మీకు తెలియకుండానే మీరు – మీ మాటల ద్వారానే కాక, మీ ‘‘జీవితం’’ ద్వారా కూడా చాలా విషయాలను నాకు బోధించారు. అందుకే మీ దగ్గర కూర్చుంటే బోధివృక్షం క్రింద ధ్యానం చేసుకుంటున్నంత హాయిగా, శాంతిగా ఉంటుంది.
మీ ఉత్తరంలో నాకు సంబంధించిన (నాకు అర్హత లేకున్నా) పొగడ్తల పొగడపూల పరిమళాన్ని నింపి పంపారు. అందులోనూ మీ ఆశీస్సుల స్వరం రాగరంజితంగా వినబడుతూంది.
ఇక్కడ పిల్లలు, వాళ్ల అమ్మ … అంతా బావు న్నారు. సమయం చూస్తుండగానే అదృశ్య మౌతుంది. పిల్లలు, వాళ్ల చదువులు, నా కాలేజీ పనులు, ఇంటి పనులు, మిత్రులు, అతిథులు, అనుకోని అతిథుల్లా తలుపు తట్టే అనారోగ్యాలు ఇవన్నీ నా యాంత్రిక జీవన సామాగ్రి. మంత్ర ముగ్ధమైన యాంత్రిక జీవన జోలపాటలో నిరంతరం తేలుతూ ఉండటం ఇంకా కొనసాగు తూనే ఉంది. నీరజ దళంపై నీటి బొట్టులా జీవించగలిగే కళ ఇంకా పూర్తిగా అబ్బలేదు. అపుడపుడు బతుకు వీణియలోని స్మ•తుల తీగలను మీటుతూ మీ గురించిన అనుభూతుల స్మ •తులను వింటూ పులకరించిపోతూ జీవిత మృతకాయాన్ని లాగుతూ ఉన్నాను.
అణగారికి ఆశలకు ఊపిరిపోసే మీ ఆదరణ, మృత జీవితాన్ని అమృతమయంగా మార్చే మీ ఆత్మీయత, అజ్ఞానాంధకారాన్ని అంతమొందించే మీ అనంత మేధో ప్రతిభ, అన్నింటికీ పైగా పర వళ్లు తొక్కే మీ ప్రేమ జీవితానికి పరిపూర్ణతను చేకూర్చుతున్నాయి.
మీ ఉపన్యాసాలు వినే అవకాశం లేకుండా దూరంగా ఉంటున్నందుకు – మీ పెదాల్లోంచి రాలే జ్ఞాన ప్రసూనాలను ఏరుకోలేక పోతున్నాననే నిరాశ అపుడపుడు కలత పెడుతూ ఉంటుంది. క్యాసెట్టు రూపంలో ఉన్న మీ ఉపన్యాసాలు ఏవైనా సరే ఉంటే, అవకాశమున్నపుడు వాటిని కాపీ చేసుకుని తిరిగి ఇచ్చివేస్తాను. అందువల్ల వీలైనంత వరకు వాటిని అందుబాటలో ఉంచగలరని మనవి.
ఇప్పటికే మీ విలువైన సమయపు వెన్నెలలను చకోరపక్షిలా నా ఉత్తరం తినివేస్తూంది. ఇంకేమి రాయమంటారు చెప్పండి! నా గురించి చెప్పటాని కేముంది? చెట్టు తన గురించి రైతుకేమి చెప్ప గలదు! కాలం గడిచే కొద్దీ – ని•ష్ట్రవ వఅ• శీ• •శ్రీశ్రీ ••ష్ట్రఱవఙవఎవఅ• ఱ• అశీఅ-••ష్ట్రఱవఙవఎవఅ•• అన్న ‘అష్టావక్రగీత’ లోని వాక్యాలపై విశ్వాసం గాఢ మవుతూ వస్తూంది. అలాగే ‘ఆయన’ చేతిలో మనమంతా ఆటబొమ్మలం అన్న నమ్మకం పెరుగుతూ, అలా ‘ఆయన’ చేతిలో ఆటబొమ్మగా ఉండటంతో కూడా ‘ఆనందం’ పెరుగుతూంది. మరి నా అభిప్రాయాలు సరియైనవో కావో మీరే చెప్పాలి.
మీరు లభించక పూర్వం నా జీవితంలో గురువులంటూ ఎవరు తటస్థపడలేదు. నేను ఆడుకునేపుడు ప్రకృతిని పరిశీలిస్తూ నా మనసు కార్చే కన్నీటిని తుడుచుకునే వాడిని. ఉదాహరణకు నేను మా ఊళ్లో ఉన్నపుడు వేసవిలో దిగుడు బావుల్లో ‘ఈత’ కొట్టటం అలవాటు. అలా ఊరి బయట ఉండే బావికి వెళ్లేపుడు మార్గ మధ్యంలో ఉండే ఒక పెద్ద మర్రి చెట్టు కింద స్నేహితులతో కలిసి నీడలో సేద తీర్చుకునే వాడిని. ఆ చెట్టుకు చెట్టు మోయలేదేమో అన్నంత పెద్ద శాఖలు ఉండేవి. వాటిని చూస్తూ నా బాధల్ని తలచుకుంటూ ఉండే వాడిని. వాటికి తోడు ఆ శాఖలకు ‘ఊత’ వేళ్లు చాలా భారంగా వేలాడుతూ ఉండేవి. మొదలే భారంగా ఉండే శాఖలకు తిరిగి ఈ ‘ఊత’ వేళ్ల భారమేమిటని ఆశ్చర్యపడేవాడిని. బాధలు తగ్గించమని భగవంతుడిని ప్రార్థిస్తే, పెరిగే నా బాధలు గుర్తుకు వచ్చేవి. మళ్లీ ఒక సంవత్సరం తర్వాత తిరిగి వేసవిలో అదే చెట్టు కిందకు వచ్చి చూసినపుడు, ఇదివరకు చెట్టు శాఖలకు భారంగా వేలాడే ఊత వేళ్లు, నేలను తాకి, కాండంగా మారి శాఖల భారాన్ని అవి మోస్తూ ఉండటం కని పించేది. వాటిని చూస్తున్నపుడు భగవంతుడు కూడా మన బాధలను ఒక్కోసారి పెంచి తగ్గిస్తాడని అనిపించేది. మన బాధల భారాన్ని పెంచేట్టు కనిపించే విషయాలే కాస్త ఓపికతో ఆగితే – ఆ బాధల బరువును మోసే పరిక రాలుగా మారుతాయని నమ్మకం కలిగేది. నిజంగా జీవితంలో చాలాసార్లు అలాగే జరిగేది. ఆ మర్రి చెట్టు నేర్పిన పాఠం ఇప్పటికీ నాకు ఉపయోగపడుతూనే ఉంది.
ఈ విషయాలు మీకు రాస్తుంటే – స్కూలు నుంచి రాగానే అమ్మీ కొంగును పట్టుకుని ఆమె వెంట వంటింట్లోకి పరుగెత్తుతూ తమ స్కూల్లోని విశేషాలను అమ్మకు చెప్తూ ఆమె పనిని ఆటంక పరిచే – బాబు జ్ఞాపకం వస్తాడు.
మీ ఉత్తరం ముఖచంద్ర దర్శినం వల్ల కస్తూరి కౌగిలిలో తేలినంత ఆనందం కలిగింది. మీకు మళ్లీ మళ్లీ వేలాది కృతజ్ఞతలు. మేడమ్ గారి ఆరోగ్యం బావుందనుకుంటాను. వారికి శుభాకాంక్షలు అందజేయగలరు. రఘురామ్, శారద… క్షేమమని తలుస్తాను. చెల్లాయి శారద కూడా అపుడపుడు ఫోన్లో తన గొంతును వినిపిస్తూ శారదచంద్రికలను మనసుపై చల్లుతూ ఉంటుంది. రఘురామ్ అపుడపుడు మీ ప్రయాణమెపుడూ ‘అనంతం’ (ఱఅ•ఱఅఱ••) వైపు అనంతానికి చిహ్నమైన మమతామయి ‘అమ్మ (•శీ•ఎఱ• వీశీ•ష్ట్రవతీ) వైపు కాబట్టి అన్నీ సవ్యంగానే జరిగి ఉంటాయనుకుంటాను.
ఇప్పటికే క్షమించరానంతగా మీ సమయాన్ని దొంగిలించాను. అందుకని ఉత్తరం ముగించ టానికై ఈ అనుమతిని కోరుతూ, మీ కన్నులు వర్షించే సుకుమార కారుణ్య స్రవంతిలో ఎల్ల వేళలా కరిగిపోవాలని ఆశిస్తూ, ఆయాచితంగా మీరు పంచే అంతులేని ప్రేమానురాగ పారిజాత సుమదళాల సౌరభం కలిగించే ఆనందానికి కృతజ్ఞతగా మీ పసిడి పాదాలకు మరొక్కసారి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, ప్రపుల్లమైన మీ రూపు ప్రణవ స్వరూపమైన నా జీవితాన్నంతా ఆక్రమించాలని భగవంతుడిని ప్రార్తిస్తూ…..
ఎల్లవేళలా
మీ స్మ•తిపథాలపై
అడుగులు వేయాలని
ఆకాంక్షిస్తూ
మీ
శ్రీరామ్
(7.8.1995న శివరామకృష్ణ గారికి శ్రీరామ్ గారు నిజామాబాదు నుంచి రాసిన లేఖ…)

Review ఆనందం అలలై.. బంగారు కలలై….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top