ఆశల ఉగాది ఆచరణ కృత్యాలు పది

మన పండుగల్లో అత్యంత ప్రాచీనమైనది ఉగాదే. ఇది ఆర్యుల కాలం నుంచీ ఆచరణలో ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఉగాది నాడు ప్రధానంగా ఆచరించాల్సిన పది విధాయ కృత్యాలను మన శాస్త్రకారులు విస్పష్టంగా పేర్కొన్నారు. అవి-
ప్రతిగృహ ధ్వజారోహణం: అంటే ప్రతి ఇంటా ధ్వజారోహణ చేయడం. అంటే, ఇంటి గుమ్మం ఎదుట విజయచిహ్నంగా ధ్వజాన్ని ప్రతిష్ఠించాలి.
తైలాభ్యంగం: నువ్వుల నూనెతో తల స్నానం చేయాలి.
నవ వస్త్రభరణధారణం- ఛత్రచామరాది స్వీకారం: శుచిగా స్నానం చేసిన అనంతరం కొత్త బట్టలు, కొత్త నగలు ధరించడం, కొత్త గొడుగు, కొత్త విసనకర్ర స్వీకరించడం మూడవ విధి కిందకు వస్తుంది.
దమనేన బ్రహ్మ పూజనము: బ్రహ్మదేవుడిని దమనములతో పూజించడం నాల్గవ విధి.
సర్వాకచ్ఛాంతకర మహాశాంతి – పౌరుషప్రతిపద్వ్రతము: విఘ్నేశ్వరుడిని, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజిస్తూ శాంతిపూజ చేయడం ఐదవ విధి.
నింబకుసుమ భక్షణం: వేపపువ్వును లేదా వేపపువ్వుతో చేసిన పచ్చడిని స్వీకరించడం.
పంచాంగ పూజ – పంచాంగ శ్రవణం: పంచాంగ శ్రవణం ద్వారా ఏడాది కలిగే శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకోవడం ఏడవ విధి.
ప్రపాదాన ప్రారంభం: చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనుల దాహార్తి తీర్చడం ఎనిమిదవ కృత్యం.
రాజదర్శనం: మన శ్రేయస్సుకు కారకులైన వారిని, పెద్దలను దర్శించుకోవడం తొమ్మిదవ విధి.
వసంత నవరాత్రి ప్రారంభం: పై తొమ్మిది కృత్యాలు చేయగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్టు.
ఉగాది నాడు ఈ పది విధాయ కృత్యాలను విధిగా ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పర్వం నాడు ఆనందోత్సాహాలతో గడపాలనే వారంతా ఈ పది విధాయ కృత్యాలను విధిగా పాటించాలి.
చైత్ర మాసంలో దేవతలకు దమన పూజ
చై•త్ర మాసంలో దాదాపు అందరు దేవతలను దమనములతో పూజించాలని చతుర్వర్గ చింతామణి తదితర వ్రత గ్రంథాలలో ఉంది. దమనం మంచి పరిమళం గల పత్రం. వసంత రుతు మాసాలైన చైత్ర, వైశాఖ మాసాలలో ఇది ఏపుగా పెరుగుతుంది. విరివిగా దొరుకుతుంది. కాగా, దీనిని మన పెద్దలు చైత్ర మాసపు పూజా ద్రవ్యాలలో ప్రధానమైనదిగా చేశారు. ఆరోగ్యప్రదమైన ఈ మూలికా పత్రం హృదయానికి మిక్కిలి హితకరమైనది. స్త్రీలు దీనిని శిరసున ధరిస్తారు. విష దోషాలను, భూత బాధలను పోగొడుతుందని అంటారు. శరీర దుర్గంధాన్ని హరిస్తుంది. చైత్ర శుక్ల పక్షములలో వచ్చే వివిధ పర్వాలలో ఆయా దేవతలకు దమనములతో చేసే పూజలకు పరిభాషలో దమనారోపణమని పేరు.

Review ఆశల ఉగాది ఆచరణ కృత్యాలు పది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top