ఒకసారి బుద్ధుడు తన ధర్మాన్ని శ్రావస్తీ నగర పరిసరాలలో ఉపదేశిస్తున్నప్పుడు ఒక సంపన్నుడు ఆయన వద్దకు వచ్చాడు.
అనేక రోగాలతో బాధపడుతున్న ఆయన చేతులు జోడించి ఇలా అన్నాడు-
‘బుద్ధుడా! నీకు చేయవలసిన విధంగా ప్రణామం చేయనందుకు నన్ను క్షమించండి. ఊబకాయం, నిద్రమత్తు, ఇంకా ఇతర అనారోగ్య కారణాల వల్ల నేను బాధలు పడుతున్నాను. శరీరంలో ఏ అవయవాన్ని కదిలించినా తీవ్రమైన నొప్పులు’ అని వాపోయాడు.
అతని చుట్టూ అలముకుని ఉన్న విషయ భోగాలను చూసి ఆ సంపన్నుడితో తథాగతుడు ఇలా చెప్పాడు-
‘నీకు ఈ పరిస్థితులు ఏర్పడటానికి ఐదు కారణాలు ఉన్నాయి. మృష్టాన్న పానీయాలతో విందులు, నిద్రాసక్తి, భోగాసక్తి, ఆలోచనా రాహిత్యం, వ్యాపకం లేకపోవడం.. ఇవే కారణం.
భోజన సమయంలో ఆత్మ సంయమనం పాటించు. నీ శక్తి సామర్థ్యాలను వినియోగించుకునే విధంగా పనులు చేస్తూ తోటి వారికి సహాయపడు. నీ ఆయుష్షు పెరుగుతుంది’ అని బుద్ధుడు అతడికి హితబోధ చేశాడు.
బుద్ధుని హితవచనాలు ఆ సంపన్నుడికి నచ్చాయి. బుద్ధుడు చెప్పిన దానిని ఆచరణలో పెట్టాడు. దాంతో శరీరం తేలికైంది. ఆరోగ్యం బాగుపడింది. రుగ్మతలు పోయాయి. శక్తి, ఉత్సాహం వచ్చాయి.
ఇలా రోజువారీ జీవితంలో ఈ సూత్రాలను ఎలా అన్వయించుకోవాలో కూడా బుద్ధుడు బోధించాడు.
‘పామరుడు శరీరాన్ని పోషించుకుంటాడు. కానీ వివేకి తన మనసును పోషిస్తాడు. ఇంద్రియాలను తృప్తిపరుస్తూ, శారీరక వాంఛలను తీర్చుకుంటూ బతికేవాడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటాడు. అలాకాక, ధర్మ పథంలో నడిచే వాడికి ఆయుర్ధాయమూ పెరుగుతుంది. పాప విముక్తీ కలుగుతుంది’ అని బోధించాడు బుద్ధుడు.
Review ఆ అయిదే కారణం.