
మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యవహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
సున్నంలో సూక్ష్మం
తక్కువ సమయంలో ఒకరి గుణగణా లను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే.. సున్నంలో సూక్ష్మం.
ఒక పనిని వేగంగా, సులభంగా చేయ డానికి చేసే ప్రయత్నం.. సున్నంలో సూక్ష్మం. దీని వెనుక ఒక పిట్టకథ ఉంది. అబ్బాయి తరపు వాళ్లు ఒక ఇంటికి పెళ్లిచూపులకు వెళ్తారు. అమ్మాయికి పొదుపు చేసే గుణం ఉందా? ఖర్చు చేసే గుణం ఉందా? అనేది తెలుసుకోవాలని అనుకుంటారు. దీని కోసం భోజనాల తరువాత ఆకు, వక్క తీసుకుని సున్నం రాయమని అడుగుతారు. అమ్మాయి తక్కువ సున్నం రాయడంతో పొదుపు చేసే గుణం కలదనే అంచనాకు వస్తారు. ఇలా తక్కువ సమయంలో అవతలి వారి గుణాన్ని అంచనా వేసే ప్రయత్నాన్ని సున్నంలో సూక్ష్మంగా అభివర్ణిస్తారు.
నీటిమూటలు
ఈ ఆధునిక కాలంలో నీటిని మూట గట్టడం పెద్ద కష్టమైన పని కాకపోవచ్చు కానీ, ఒకప్పటి మాటేమిటి? నీటిని మూటగట్టడం అంటే ఇసుక నుంచి తైలం తీయడం వంటిదే. అసాధ్యమైన పని. ఈ అసాధ్యంలో నుంచి పుట్టిన జాతీయమే ‘నీటి మూటలు.
ఎవరైనా సాధ్యం కాని మాటలు మాట్లాడినా, ఆచరణ సాధ్యం కాని వాగ్దా నాల గురించి చెప్పినా.. ‘ఆయన మాటలు నీటి మూటలు’ అంటుంటారు. ఇది నేటి రాజకీయాల్లో తరచుగా వినిపించే జాతీయం. రాజకీయ పార్టీల మధ్య ఎక్కువ వినియోగంలో ఉంటుందీ జాతీయం.
తిలతండులాలు
కొందరిని కలపాలని తెగ ప్రయత్నిం చినా, కలవరు గాక కలవరు.
కొందరిని కలపాలని ప్రయత్నిస్తే, ‘దానిదేముంది?’ అంటూ కలుస్తారు. కలిసి పోవడం అనేది నోటిమాటకే పరిమితమైన వ్యవహారమై పోతుంది. ఇలాంటి కృత్రిమ స్నేహితులను చూసి, ‘తిలతండులాలు’ అనడం పరిపాటి.
ఇక, దాంపత్యం విషయానికి వస్తే, కొన్ని జంటలు చూడముచ్చటగా ఉంటాయి. చిలకాగోరింకల్లా ఉంటాయి. తీరా విషయంలోకి వెళ్తే.. ఒకరంటే ఒకరికి పొసగదు. ఇటువంటి వాళ్ల గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ‘తిలతండులాలు’ అంటారు.
చూడటానికి ఒక్కటైనట్టు కనిపించినా, ఇద్దరి మధ్య కనిపించని శత్రుత్వం, వైరుధ్యాలు ఉన్నప్పుడు ఉపయోగించే మాట ‘తిలతండులాలు’.
తిలలంటే నువ్వులు.
తండులాలు అంటే బియ్యపు గింజలు.
ఈ రెండింటిని కలిపినంత మాత్రాన గుర్తుపట్టకుండా ఉంటామా? రంగుల్లో, పరిమాణంలో వాటిని కలిపినా కూడా వేటికి అవిగా కనిపిస్తాయి కదా!
Review ఆ మాటలు నీటిమూటలు.