ఉపమన్యు మహర్షి

ఉపమన్యు మహర్షి కృతయుగంలో వ్యాఘ్రపాదుడనే మహర్షి పెద్ద కొడుకు. ఉపమన్యుడి తమ్ముడు ధౌమ్యుడు. ఇద్దరూ
ఒకనాడు బంధువుల ఇంటికి వెళ్లి పరమాన్నం తిన్నారు. ఇంటికొచ్చి అలాంటి పరమాన్నం చేసిపెట్టు అని తల్లిని కోరారు. అవసరమైన దినుసులు లేవని, కాబట్టి ఆ కోరిక తీరడానికి ఈశ్వరుడి గురించి తపస్సు చేయాలని, ఆయన ఏం అడిగినా ఇస్తాడని తల్లి చెబుతుంది. శివుడు ఎలా ఉంటాడని ఉపమన్యుడు తల్లిని అడిగాడు. తనకు తెలిసినంత ఆమె చెప్పింది. ఉపమన్యు తల్లికి నమస్కరించి ‘తపస్సుకు వెళ్త్తున్నా’పని తమ్ముడితో కలిసి వెళ్లిపోయాడు. అలా వెళ్లి, ఎడమ కాలి బొటనవేలిపై నిలబడి తపస్సు ప్రారంభించాడు. వందేళ్ల పాటు పండ్లు తిన్నాడు. ఇంకో వందేళ్లు ఆకులు తిన్నాడు. ఇంకో వందేళ్లు నీళ్లు మాత్రమే తాగి, మిగిలిన కాలం గాలే భోజనం అనుకుని.. అలా వెయ్యేళ్లు తపస్సు చేశాడు. ఈశ్వరుడు ఇంద్రుడి రూపంలోవచ్చి, ‘ఉపమన్యూ! నీ తపస్సుకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో’ అన్నాడు.
‘నువ్వు ఈశ్వరుడివి కాదు. నన్ను శివుడు వచ్చి ఏదైనా పురుగు అయిపో అంటే అయిపోతాను. చెట్టు అయిపో అంటే చెట్టయిపోతాను. అంతేకానీ, ఇంకెవరైనా వచ్చి రాజ్యాలిచ్చినా నేను తీసుకోను’ అని ఉపమన్యుడు బదులిచ్చాడు. ‘శివుడు శివుడు అంటున్నావు. అతడెలా ఉంటాడో చెప్పు’ అని ఈశ్వరుడు అడిగాడు.
‘మహర్షులంతా ఎవరినైతే సత్‌, అసత్‌, వ్యక్త, అవ్యక్త రూపం గలవాడంటారో, ఆది మథ్యాంతం లేని వాడెవడో, జ్ఞానవంతుడు, అచింత్యుడు, పరమాత్ముడెవడో, అన్ని సంపదలూ ఎవరి నుంచి వస్తున్నాయో, బీజ, అబీజ సంభూతుడెవడో, లోకం ఎవరిలో లీనమైందో అతడే ఈశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు వరం ఇస్తే తీసుకుంటాను. లేకపోతే లేదు. ఇంకెవరిచ్చినా నాకు వద్దు’ అని ఉపమన్యుడు ఖరాఖండీగా చెప్పాడు.
వెంటనే ఉపమన్యుడికి తెల్లని తోక, బూడిద రంగులో పర్వతమంత శరీరం, వజ్రాల్లాంటి కొమ్ములు, బంగారు నగలు ఉన్న ఐరావతం (ఏనుగు) కనిపించింది. తరువాత ఎద్దునెక్కి తెల్లటి బట్ట ధరించి మహా తేజస్సుతో పార్వతీదేవితో కలిసి ప్రశాంతమైన ముఖంతో పరమేశ్వరుడు కనిపించాడు. శివుడు అగ్నిశిఖలా వెలిగిపోతున్నాడు. ఆయనకు కుడివైపు హంస వాహనం మీద బ్రహ్మ, ఎడమవైపు గరుడ వాహనంపై గద, శంఖం, చక్రంతో విష్ణువు, నెమలి వాహనంపై కుమారస్వామి తల్లి పార్వతి దగ్గర శక్తిఘంటాలతో రెండవ అగ్నిలా కనిపిస్తూ దర్శనమిచ్చారు.
మనువులు, మహర్షులు, ఇంద్రాది దేవతలు శివుడి చుట్టూ ఉన్నారు. సర్వభూత గణాలు, సర్వమాతృకలు, ఆయనకు నాలుగు పక్కలా ఉన్నారు. దేవతలు శివుడికి స్తోత్రం చేశారు. బ్రహ్మ, విష్ణువు ఆయనను వేదాలతో కీర్తించారు.
ఇవన్నీ చూసిన ఉపమన్యు మహర్షికి ఆనందంతో కళ్లంట నీరు ధారగా కారింది. శివుడి పాదాలపై పడి ఆయనను ఆనందంతో స్తోత్రించాడు. అదే ఉపమన్యు స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. అనంతరం శివుడి నుంచి వరాలు పొందిన ఉపమన్యు హిమత్పర్వతంపై ఆశ్రమం ఏర్పాటు చేసుకుని మళ్లీ తపస్సులో లీనమయ్యాడు. ఒకసారి కృష్ణుడు పన్నెండేళ్లు తపస్సు చేసి, తన భార్య జాంబవతికి ఒక కుమారుడిని నివ్వాలని ఉపమన్యుడిని కోరాడు. అందుకు పన్నెండేళ్లు శివుడి కోసం తపస్సు చేయాలని ఉపమన్యుడు చెప్పగా, కృష్ణ్ణుడు ఆయనకు శిష్యుడై, తపస్సు చేసి శివుడిని దర్శించాడు. ఆ సమయంలో శివుడు అర్థనారీశ్వరుడిగా దర్శనమిచ్చాడు. ఇదీ ఉపమన్యు మహర్షి కథ. పాయసం కోసం మొదలుపెట్టి ఏకంగా పరమాత్మనే దర్శించుకున్న ఘనత ఆయనది.

Review ఉపమన్యు మహర్షి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top