ఊగూగు దేవుడా!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

ఊరోరి పత్తి ఊరోరి చమురు ఊగూగు దేవుడా..
కొంతమంది సొంతానికి ఏమీ లేకున్నా పరుల సొమ్మును హాయిగా అనుభవించేస్తారు. లోకుల సొమ్ముతో సరదాగా కాలక్షేపం చేసేస్తుంటారు. అటువంటి వారి గురించి వ్యంగ్యంగా చెప్పేటపుడు, అటువంటి వారిని ఎత్తిపొడిచేందుకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. దేవుడి ముందు వెలిగించే దీపంలో వత్తికి సంబంధించిన పత్తి, చమురు అన్నీ ఊరి వారివే. కానీ ఆ దీపపు కాంతి ఆలయంలో ప్రసరిస్తూ కాంతిని కలిగిస్తుంటుంది. అలాగే కొంతమంది ఎదుటి వారు ఇచ్చే డబ్బు లేదా ఇతర వస్తువులను వాడుకొంటూ ఉంటారు. అవన్నీ తమవేనన్న భ్రమను ఇతరులకు కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించడం చూడవచ్చు. ఈ జాతీయంలో ‘ఊగూగు దేవుడా..’ అనేది బాగా ఆనందించు.. నీదేమి పోయిందిలే అనే అర్థాని కలిగిస్తుంది.

రాఘవా స్వస్తి.. రావణా స్వస్తి
లోకమంతా శుభకరంగా ఉండాలని కొంతమంది కోరుకునే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుండటం కనిపిస్తుంది. పాపం, పుణ్యం పరమాత్ముడికి ఎరుక.. నేను మాత్రం ఎటువంటి భేదాన్ని పాటించకుండా అందరికీ శుభం కలగాలని కోరుకుంటాను అని రాముడులాంటి వారైనా, రావణుడి వంటి వారైనా ఎవడైనా సరే అంతా క్షేమంగానే ఉండాలన్నది నా ఆకాంక్ష అని అనుకునేవారు ఈ జాతీయాన్ని వాడుతుండటం కనిపిస్తుంది.

రాగం లేని భోగం.. త్యాగం లేని మనసు
జీవిత సత్యాన్ని తెలియచెప్పే జాతీయం ఇది. ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా అలా అనుభవించేటపుడు బంధుమిత్రుల అనురాగం ఉంటేనే ఆ భోగానుభవంలో ఆనందం ఉంటుంది. కానప్పుడు ఎన్ని భోగాలు ఉన్నా, ఎదురుగా ఇంకేమున్నా ఆనందమే ఉండదు. అలాగే ఎదుటి వారి కోసం చిన్నదైనా, పెద్దదైనా త్యాగం చేసినపుడు మనసుకు కలిగే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎలాంటి త్యాగం లేకుండా జీవితం గడుస్తూ ఉంటే మనసుకు ఆనందం ఉండదని తెలియచేప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

ముమ్మాట అరవై రోగాలకు..
ముమ్మాట అరవై రోగాలకు మూడు గుప్పెళ్ల కరక్కాయ పొడి అన్నట్టు అనేది ఈ జాతీయం. జాతీయాలు జీవితానుభవ సారాన్ని నింపుకుని తరతరాలకు చైతన్య దీపికలుగా అందుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఔషధ విలువలను, ఆరోగ్య పరిరక్షణ అంశాలను గురించి తెలియ చెప్పేవి కూడా కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో ఈ జాతీయం ఒకటి.
ముమ్మాట అరమై అంటే మూడు నూర్లు.. ప్లస్‍ అరవై అని అర్థం. అంటే మూడు వందల అరవై అని పూర్తి భావం. మూడు వందల అరవై అనేది ఇక్కడ ఎన్నెన్నో అనే అర్థంలో ఉపయోగించిన సంఖ్యా వాచకం. అంటే అన్నెన్ని రోగాలకు కరక్కాయ పొడి మంచి ఔషధంలా పని చేస్తుందని చెప్పడం ఈ జాతీయం యొక్క ఉద్దేశం. కనుక కరక్కాయ విలువను తెలుసుకోవాలని చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.

మెరుపు దీపమవుతుందా?
తాత్కాలికమైనవేవీ శాశ్వతమైన ఆనందాన్ని లేదా ప్రయోజనాన్ని చేకూర్చలేవని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఆకాశంలో క్షణకాలం పాటు మెరిసే మెరుపులు కాసేపు మంచి కాంతినే ఇస్తాయి. ఇంకా చెప్పాలంటే మామూలు దీపాల కన్నా ఎక్కువ కాంతినే ఇస్తాయి. కానీ, ఆ మెరుపులను దీపాలకు ప్రత్యామ్నాయంగా వాడాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.

Review ఊగూగు దేవుడా!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top