చాలా ఏళ్లుగా తీవ్రమైన సమస్యలతో సతమతం అవు తున్న ఒక యువకుడు విసిగి వేసారి, అన్నీ విడిచి పెట్టేయాలని నిర్ణయించు కున్నాడు. అన్నీ అంటే.. సమస్యలు, ఉద్యోగం, తననే నమ్ముకుని ఉన్న కుటుంబం, తాను నమ్మిన దైవం.. చివరికి దైవమిచ్చిన జీవితం.. ఇవన్నీ విడిచి పెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్లాడు.
‘భగవంతుడా! నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండటానికి కారణం ఒక్కటంటే ఒక్కటి చెప్పగలవా?’ అని అడిగాడు.
అందుకు భగవంతుడు వాత్సల్యంగా-
‘నాయనా! ఒక్కసారి నీ చుట్టూ చూడు. ఎత్తుగా, అందంగా ఎదిగిన గడ్డి, వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?’ అని అడిగాడు.
‘అవును. కనిపిస్తున్నాయి’ అని ఆ యువకుడు బదులిచ్చాడు.
‘నేను ఆ గడ్డి విత్తనాలు, వెదురు విత్తనాలు నాటినపుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు, సూర్యరశ్మి.. అన్నీ అవసరమైన మేరకు అందించాను’ అని భగవంతుడు చెప్పాడు.
భగవంతుని ఆ మాటలు వినడంతోనే గడ్డి వెంటనే మొలకెత్తింది.
భూమిపై పచ్చని తివాచీ పరిచినట్టుగా ఆ పరిసరాలన్నీ క్షణంలో మారిపోయాయి.
కానీ, వెదురు మాత్రం మొలకెత్తనే లేదు.
మళ్లీ భగవంతుడి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు-
‘వెదురు మొలకెత్తలేదు కదా అని నేను దానిని విస్మరించలేదు. ఒక సంవత్సరం గడిచింది. గడ్డి మరింత ఒత్తుగా, ఏపుగా పెరిగింది. అందంగా, ఆహ్లాదంగా అనిపించడసాగింది. కానీ, వెదురు అప్పటికి కూడా చిన్న మొలక కూడా వేయలేదు. రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. వెదురు ఎంతకీ మొలకెత్తలేదు. చివరకు ఐదవ సంవత్సరంలో వెదురు మొలక భూమిపై విచ్చుకుంది. కానీ, అది గడ్డి కన్నా చాలా చిన్నగా ఉంది. కానీ, ఒక్క ఆరు నెలల్లో అది వంద అడుగుల ఎత్తు వరకు ఎదిగింది. అందంగా, బలంగా.. ఈ ఐదేళ్లలో అది తన వేళ్లను భూమి లోపలి కంటూ పెంచుకుంది. బల పరుచుకుంది. పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం దాని వేళ్లు ముందు సంపా దించాయి. ఆ బలం వాటికి లేకపోతే వెదురు మనలేదు (నిలబడలేదు).
నా సృష్టిలో దేనికీ కడా అది ఎదుర్కోలేని సమస్యను నేను ఇవ్వను. ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నీ వేళ్లను (మానసిక స్థైర్యాన్ని) బలపరుస్తూ వచ్చాయి. నేను వెదురు మొక్కను విస్మరించనట్టే, నిన్ను కూడా విస్మరించను. నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు. నేను చెప్పిన ఉదాహరణలోని గడ్డి, వెదురు.. ఈ రెండూ అడవిని అందంగా మలచినప్పటికీ గడ్డి లక్ష్యం వేరు. వెదురు లక్ష్యం వేరు.
నీ సమయం వచ్చినపుడు నువ్వూ ఎదుగుతావు’ అని భగవంతుడు వివరించాడు.
‘దేవా! మరి నేను ఎంత ఎదుగుతాను?’ అని యువకుడు అమాయకంగా అడిగాడు.
‘వెదురు ఎంత ఎదిగింది?’ అని భగవంతుడు ప్రశ్నించాడు.
‘అది ఎంత ఎదగగలదో అంత వరకు ఎదిగింది’ అని యువకుడు బదులిచ్చాడు.
‘నువ్వు కూడా ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు’ అని భగవంతుడు పలికాడు.
ఇది గొప్ప నీతిని బోధించే కథ.
మనకు ఎదురైన సమస్యలు, ఆటంకాలు, అవాంతరాలన్నీ తాత్కాలికమైనవే. వాటికే చలించిపోయి ఇక, జీవితం అయిపోయిందనుకుంటే మన కథ అక్కడితో ముగిసిపోయినట్టే.
మనం సమస్యలతో పోరాడుతున్నామంటే.. వాటిని ఎదుర్కోగల బలాన్ని పెంపొందించుకుంటున్నామన్న మాట. అవి తదుపరి పరిష్కారానికి వీలుగా మనల్ని నిలబెట్టే పునాదిగా నిలుస్తాయి.
యుద్ధమైనా, ప్రయత్నమైనా మధ్యలో విరమించకూడదు. గెలుపే మన లక్ష్యం కావాలంటే, నిరంతరం మనల్ని మనం బలోపేతం చేసు కుంటుండాలి. మన బలహీనతల్ని మరింత బలహీనం చేసుకుంటూ, మన బలాల్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు విజయం మనదే!
Review ఎదుగు నింగే హద్దుగా.