ఎన్నెన్నో వర్ణాలు ఏవేవో అందాలు

హోలీ పండుగ మనకు ఎన్నో నేర్పుతుంది. ఉగాదికి కాస్త ముందు.. వసంతాగమనానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకునే ఈ చెమ్మకేళీ పర్వం ఎన్నెన్నో వర్ణాల సమాహారం.. ప్రకృతిలోని సమస్త రంగులకు అద్దంపట్టే సంబరం. హోలీ పండుగ నాడు రకరకాల వర్ణాలను వెదజల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం రివాజు. అంతేనా? ఈ పండుగలో ఇంకే ప్రత్యేకతా లేదా?.. అంటే ఎంతో ఉంది.

హోలీ పర్వం.. మనిషిలోని వికారాను దహనం చేసుకోమంటుంది. కల్మషాలను కడిగేసుకోవాలని చాటుతోంది. అంతరంగాన్ని వర్ణశోభితం చేసుకోవాలని సూచిస్తోంది. హోలీ పర్వానికి నేపథ్యంగా వినవచ్చే కథలెన్నో ఉన్నాయి.
అసలు రంగులే లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా? మన ఆలోచనలు స్పష్టంగా ఉండాలన్నా, అంతరంగం ఆహ్లాదకరంగా ఉండాలన్నా, మన ఆలోచనలకు అనుగుణంగా మన బుద్ధి ప్రతిస్పందన కలిగి మనం ఒక పని చేయాలన్నా అందుకు కారకంగా నిలిచేవి రంగులే. దూరంగా కనిపించే మం•ల్లోని ఎర్రని రంగు అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అంచనా కలిగిస్తుంది. అందుకు అనుగుణంగా మన మనసు ప్రతిస్పందిస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్న పూలగుత్తులు.. వాలుతున్న మొక్కలు మనసును తేలికపరుస్తాయి.

మోడుగా మిగిలిన చెట్టును చూడగానే విషాద భావన కలుగుతుంది. ఇలా.. ఏ అంశాన్ని చూసినా మనకు మరుక్షణంలోనే ఓ మనస్థితి కలుగుతుంది. నిజానికి ఆ సన్నివేశం కన్నా దాన్ని ప్రకటించే రంగు మన మనసు మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఆ రంగు వల్లే ఆ సంఘటన తీవ్రత మనకు అర్థమవుతుంది. రంగు కేవలం రంజింపచేయడానికే కాదు.. మనో వికాసం కలిగించడం కూడా దాని లక్షణం. మన మనసుపై ఏ రంగు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో.. హోలీ పర్వదినం సందర్భంగా ప్రత్యేక కథనం
(మార్చి 28, 2021, ఆదివారం సాయంత్రం హోలీ ఘడియలు ప్రవేశిస్తున్నాయి. మార్చి 29, 2021, సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతాయి)

శివుడు నీలకంఠుడు..
కృష్ణుడు నీలవర్ణుడు..
రాముడు నీలమేఘ శ్యాముడు..
అంతేకాదు.. ఈ ప్రకృతిలోని ప్రతి పువ్వుకూ ఓ రంగు. ఆకుకో రంగు..
హరివిల్లులో ఏడు రంగులు..
ఇదంతా సృష్టించిన భగవంతుడే ఓ వర్ణ చిత్రకారుడు.
పువ్వు పూస్తే రంగు..
మెరుపు మెరిస్తే రంగు..
రంగుల్లేని ప్రకృతికి ఊహించగలమా?
రుతువు రుతువుకీ కొత్త వర్ణాలను పులుముకునే పరిసరాలు మనసుకు ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తాయి.
ఫాల్గుణ మాసంలో ప్రకృతి శోభాయమానమైన వర్ణాలతో స్వాగతం పలుకుతుంది.
ఫాల్గుణ పౌర్ణమి నాడు హోలీ పేరుతో ప్రకృతి మనల్ని రంగుల్లో ముంచి తేలుస్తుంది. చూసే మనసుకు కళ్లుంటే జీవితం ఓ హరివిల్లు.
ఎంతో భావకుడైన సృష్టికర్త ఈ ప్రపంచాన్ని రంగులమయం చేశాడు… దాన్ని చూసి ఆనందించమని.. అలా చూడ్డానికి అనుకూలంగా కంటిని అద్భుతంగా నిర్మించి మనిషికి ఇచ్చాడు. భగవంతుడి సృష్టికే శోభాయమానం, అద్భుతం అనదగిన విషయమది.
మన సృష్టిలోనరి ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేకత.. ఒక్కో విశేషం.. ఒక్కో ఆకర్షణ ఉన్నాయి. మనిషి మనస్తత్వాన్ని బట్టి వాటిపై ఆరాధన ఉంటుందని అంటారు. అవసరం మారుతుందని అంటారు. జాతకశాస్త్రంలో కూడా రంగుల విశ్లేషణ ఉంది.

రంగులోనే అంతా ఉంది!
ప్రకృతిలోని వర్ణాలకు అద్దం పట్టే పర్వం హోలీ. ఇందులో వాడే రంగు రంగులో ఓ కళ ఉంటుంది. ప్రతి రంగుకో లక్ష్యం ఉంది. అవి చాటే సందేశం ఉంది. ఆ రంగులు.. వాటి వెనుక దాగిన లక్ష్యాలు మనిషి ఆధ్యాత్మికతకు, ఔన్నత్యానికి అద్దం పడతాయి. అందుకే మనిషి ప్రకృతిలోని వర్ణాలను చూసి పరవశిస్తాడు. అంతకుమించి ఉత్తేజం పొందుతాడు. ఆ రంగుల్లోని దైవత్వానికి ప్రణమిల్లుతాడు.

నీలి రంగు దివ్యత్వానికి నిదర్శనం. ఇది ఏకాగ్రతను కలిగిస్తుంది. కళ్లకు హాయిని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. గాఢమైన, ప్రశాంతమైన మనస్థితికి ఇది సూచకం. అందుకే కాబోలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలన్నీ తమ లోగో (చిహ్నాలు)గా ఎక్కువగా నీలి రంగునే ఎంచుకుంటాయి. చూడగానే ఆహ్లాదం కలిగించడంతో పాటు ఆకర్షణ కలిగించడం నీలి రంగు ప్రత్యేకత.

మన రుషులు తమ తపోభూములుగా పచ్చటి ప్రాంతాలను, దండకారణ్యాలనే ఎన్నుకున్నారు. ఇందుకు కారణం.. కీకారణ్యాల్లోని ఆకుపచ్చ రంగే. ఇది ఎదుగుదలకు, ఆత్మోన్నతికి సూచిక. మనసులో ఒక పార్శ్వాన్ని పచ్చగా ఉంచుకోవాలని అంటారు. దీనివల్ల అంతులేని సృజనాత్మకత పెరుగుతుంది.

ఈ సృష్టికి రజోగుణమే కారణం. అలాంటి రజో గుణానికి సూచిక ఎరుపు రంగు. అందుకే ఈ రంగును సృజనాత్మకతకు నిదర్శనంగా భావిస్తారు. ఇది పౌరుషానికి, ఉత్తేజానికి నిదర్శనం. శత్రువులను భయపెట్టే గుణం కూడా ఈ రంగులో ఉంది.

సృష్టిలోని అన్నీ శూన్యంలో నుంచే ఉద్భవిస్తాయి. అందుకే అన్ని రంగులకూ నలుపు రంగును మూలంగా భావిస్తారు. ఇది తమో గుణ చిహ్నం. ఈ రంగు చెడు శక్తులను ఆకర్షించి తనలో లీనం చేసుకుంటుంది. అందుకే మన సంప్రదాయంలో చిన్నపిల్లలకు కాటుకను దిష్టిచుక్కగా పెడతారు. సాధారణంగా నలుపును విషాదానికి చిహ్నంగా భావిస్తారు. కానీ ఇది పవిత్రతకు సూచిస్తుంది. ఐహిక ప్రపంచానికి దూరంగా ఉన్న వారు ఈ రంగు దుస్తులను ధరించాలంటారు. అయ్యప్ప దీక్షధారులు ఈ రంగు దుస్తులను ధరించడంలో పరమార్థమిదే. చీకటిలో నుంచే అనేక రంగులు ఉద్భవించి తెలుపులో లీనమవుతున్నాయి. కాబట్టి ఈ రంగును భగవంతుడి స్వరూపంగా భావిస్తారు. అందుకే ధాన్యం చేసేటపుడు నల్లని చుక్కపై దృష్టి నిలుపుతారు.

అత్యంత ప్రశాంతతకు, అత్యున్నత తాత్త్వికతకు, సత్వ గుణానికి నిదర్శనం తెలుపు రంగు. ఈ వర్ణంలో ఉన్న స్వచ్ఛత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి కారణమవుతుంది. మనిషి ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు తెల్లటి రంగునే ఇష్టపడతాడు. తెలుపు వస్త్రాలను ధరించాలని అనుకుంటాడు. స్వచ్ఛతకు ఈ రంగు ప్రతీక. ్య పసుపు మన సంప్రదాయంలో అత్యంత శుభసూచిక. లోకంలో ఇదే అత్యంత ఆకర్షణీయమైన రంగని అంటారు. ఈ పసిడి వర్ణం శుభాన్ని, శ్రేయస్సును కలిగిస్తుందని నమ్మకం.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతిలోని ప్రతి రంగుకూ ఓ ప్రత్యేకత ఉంది. వాటిని చూడగానే కలిగే ప్రతిస్పందనకు ఒక కథ ఉంది.

ఆ రంగుపై ఇష్టం ఆధారంగా అతని మనో స్వభావాలను విశ్లేషిస్తున్నారు నేటి మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న వర్ణాలకు, మనిషి జీవితానికి ఉన్న సంబంధాన్ని తేటతెల్లం చేసే విషయాలే. ఆయా వర్ణాలు.. అందులో ఇమిడిన అందాన్ని అర్థం చేసుకోవగలితే, విశ్లేషించుకోగలిగితే మన జీవితాన్ని నందనవనంగా తీర్చిదిద్దుకోవచ్చు. సుందరంగా, ఆకర్షణీయంగా, రంగుల లిపిగా మార్చుకోవచ్చు.

మంత్రం.. వర్ణం..
‘మననాత్‍ త్రాయతే ఇతి మంత్ర:’..
నిరంతరం మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది మంత్రం అని అర్థం.
నిరంతరం మననం అంటే త్రికరణశుద్ధిగా ఒక పని మీద లక్ష్యాన్ని ఏర్పర్చుకుని సాధన చేయడమే. అటువంటి సాధనకు మనసు చాలా ముఖ్యం. ఆ సమయంలో కంటితో చూసే దృశ్యం, ధరించిన వస్త్రాలు, రంగులు మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఏ కోరికతో అయితే మనం మంత్రాన్ని జపిస్తున్నామో.. ఆ కోరికను ఆయా రంగులు మరింతగా ఉద్ధీపనం చేస్తాయి.
మంత్రోపాసలో రంగు వస్త్రాలను నిర్దేశించడంలో అంతరార్థం ఇదే. వారాహి, ధూమావతి, దక్షిణకాళి మొదలైన మంత్రాలను ఉపాసన చేసే సందర్భంలో కూడా కొన్ని రంగుల వస్త్రాలను మాత్రమే ధరించాలనే నియమం ఆయా తంత్ర శాస్త్ర గ్రంథాలలో ఉంది.

Review ఎన్నెన్నో వర్ణాలు ఏవేవో అందాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top