ఒక వానాకాలంలో బుద్ధుడు జేతవనంలో విడిది చేశాడు. ఆ రుతువులో విపరీతమైన వానలు, గాలులు, ఉరుములు, మెరుపులతో ప్రకృతి బీభత్సంగా ఉంది. జన సంచారం పూర్తిగా స్తంభించిపోయింది. బుద్ధుడికి, శిష్యులకు భిక్ష సమర్పించే వారే లేరు. ఆ జల్లుల్లో తడిసిన బుద్ధుడికి బాగా జలుబు చేసింది. ఆయన శిష్యుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎవరికీ, ఎక్కడికీ కదిలే అవకాశం లేనందు వల్ల మూలికలు తేవడానికి, ఔషధం తయారు చేసుకోవడానికి కూడా వీల్లేకుండాపోయింది. ఒకవైపు ఆకాశానికి చిల్లు పడినట్టు వాన.. మరోవైపు ఆకలిదప్పులు.. బుద్ధుడి శిష్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. చీకట్లు ముసిరిన వాతావరణంలో రేయింబవళ్లు తేడా తెలియడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంకటం ఎదురుకాలేదు. శిష్యులందరూ కర్తవ్యం తెలియక బుద్ధుడి వద్దకు వెళ్లారు. బుద్ధుడు ఆ సమయంలో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. అలౌకిక స్థితిలో ఉన్న ఆయన చుట్టూ ఒక దివ్య తేజస్సు వ్యాపించి ఉంది. ఆయన దర్శనంతో శిష్యుల శరీర బాధలు కొంత తగ్గినట్టు అనిపించాయి. వారంతా బుద్ధుడి ఎదుట పరమ భక్తితో ప్రణమిల్లారు. కొంతసేపటి తరువాత బుద్ధుడు కళ్లు తెరిచి శిష్యుల వంక చూశాడు. అందరూ వినమ్రంగా చేతులు జోడించారు. ‘దేవా! గతంలో ఎన్నడూ లేని విధంగా కుటీరాల్లో బందీలుగా ఉండాల్సి వస్తోంది. ఆహారం, ఔషధాలు కూడా దొరకడం లేదు. పరిస్థితి దయనీయంగా ఉంది. కానీ, మీ సమక్షంలో ఆ బాధలు లేవు.. ఎలా?’ అన్నారు.
బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ- ‘నాయనలారా! ఆ శక్తి ఆత్మది. సాధనకు, ఆత్మశోధనకు ఇదో గొప్ప అవకాశం. ప్రతికూల వాతావరణంలో ఎవరికి వారు మనో మౌనం పాటించడం వల్ల మనసు శక్తిమంతం అవుతుంది. ఆత్మ తేజరిల్లుతుంది. అది అనేక సమస్యలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. దేహస్మతిలో నుంచి బయటపడి ఆత్మస్థితి కోసం గట్టిగా ప్రయత్నించండి. ఏ పరిస్థితీ శాశ్వతం కాదు. మళ్లీ పూర్వస్థితి వస్తుంది. భయపడొద్దు’ అంటూ జ్ఞానబోధ చేశాడు.
Review ఏ పరిస్థితీ శాశ్వతం కాదు!.