ఐదుగురు తింగరోళ్ళు

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పధంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘సామెత కథ’ల పరిచయం.

‘‘రాజు నీతి తప్పితే కాలం సారం తప్పుతుంది’’
ఒక రాజు గారు మంత్రిని పిలిచి- ‘మహా మంత్రీ! మన రాజ్యంలో తెలివైన వారు ఉన్నట్టే తెలివి తక్కువ వాళ్లు కూడా ఉంటారు కదా!’ అని ప్రశ్నించారు.
మంత్రి సంశయిస్తూనే ‘అవును ప్రభూ!’ అన్నాడు.

అప్పుడు రాజు- ‘అయితే, మన రాజ్యమంతా గాలించి, అందరిలోకి అతి తెలివి తక్కువ వాళ్లను ఐదుగురిని వెతికి పట్టుకుని ఇక్కడ సభలో హాజరుపరచండి’ అని ఆజ్ఞాపించాడు.

మంత్రి ‘చిత్తం ప్రభూ’ అంటూ సభ నుంచి నిష్క్రమించాడే కానీ, ఆ పని ఎలా చేయాలన్న ఆలోచనతో సతమతం కాసాగాడు.
ఎవడికైనా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు వేసో తెలివైన వాడిని గుర్తించవచ్చు. కానీ, తెలివి తక్కువ వాడిని ఎలా గుర్తించాలి? అనేది మదనపడ్డాడు. ఎట్టకేలకు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని రాజసభకు తీసుకువచ్చాడు.

రాజు గారు- ‘మంత్రీ! నేను చెప్పింది ఐదుగురిని తీసుకురమ్మని. మీరు ఇద్దరినే తెచ్చారు’ అన్నారు.
అప్పుడు మంత్రి ఇలా చెప్పసాగాడు.

‘రాజా! ఇతను ఒక ఎడ్ల బండిపై వెళ్తూ కూడా తలపై పెద్ద మూటను నెత్తిన పెట్టుకుని కూర్చున్నాడు. ఎందుకలా అని అడిగితే, ఎడ్లకు భారమవుతుందని మూటను తలపై పెట్టుకున్నానని అన్నాడు. కాబట్టి ఇతను ఐదవ తెలివి తక్కువ వాడు’ అన్నాడు.

రెండో అతను గురించి చెబుతూ- ‘ఇతను తన ఇంటి పై కప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి తన గేదెను ఇంటి పై కప్పు మీదకు లాగుతూ కనిపించాడు. కాబట్టి ఇతనిని నాల్గవ తెలివి తక్కువ వాడిగా గుర్తించాను’ అని వివరించాడు. మళ్లీ ఇలా కొనసాగించాడు.

‘రాజ్యంలో చాలా సమస్యలుండగా, వాటిని పరిష్కరించే బాధ్యతను విస్మరించి తెలివి తక్కువ వాళ్లను గుర్తించేందుకు నెల రోజులు వృథా చేశాను. కాబట్టి నేను మూడవ తెలివి తక్కువ వాడిని’.‘ఇంకా చెప్పండి’ అన్నాడు రాజు.

‘బాధ్యతను విస్మరించి, తెలివి తక్కువ వాళ్ల కోసం వెదుకులాడుతున్న తమరే రెండో తెలివి తక్కువ వారు’ అని మంత్రి అనగానే అందరూ నిశ్చేష్టులైపోయారు.
అంతలో రాజు తేరుకుని, ‘మీరు చెప్పిన దానిలో వాస్తవముంది. మరి, మొదటి తెలివి తక్కువ వాడెవడో కూడా చెప్పండి’ అని అడిగాడు.

‘చెయ్యాల్సిన పనులన్నీ మానేసి, ఈ రోజు ఐదుగురు తెలివి తక్కువ వాళ్లను చూసేందుకు ఈనాటి సభకు వచ్చిన వీరంతా కూడా అత్యంత తెలివి తక్కువ వాళ్లు. వీరంతా మొట్ట మొదటి తెలివి తక్కువ వాళ్ల కిందకు వస్తారు’ అని మంత్రి అనగానే, అందరూ తలలు దించుకున్నారు. రాజు కట్టు తప్పకుండా, నీతిగా, బాధ్యతగా ఉండాలి. ఇటువంటి పనులకు పూనుకుంటే తెలివైన వాళ్లు కూడా ఇలాంటి నిస్సారమైన పనులే చేయాల్సి వస్తుందనే అర్థంలో పై సామెతను వాడుక భాషలో ఉపయోగిస్తుంటారు.

Review ఐదుగురు తింగరోళ్ళు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top