ఒక్క క్షణం ఆలోచించండి!

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.

ఎన్నడూ యోచించని వాడు అవివేకి
ఆలోచన అనేది మనిషికి మాత్రమే లభించిన గొప్ప వరం. అది మనిషి మాత్రమే చేయగలిగిన క్రియ. ఏదైనా ఆలోచనతోనే మొదలవుతుంది. ఏ ఆలోచనా లేకుండా, ఏ తలంపు లేకుండా ఏ పనీ కాదు. ఒకవేళ అటువంటివేవీ లేకుండా ఒక మనిషి క్రియాశూన్యంగా ఉన్నాడంటే.. అతను ప్రాణం ఉండీ.. లేని మనిషి కింద లెక్క. అంటే జీవశ్ఛవంలా బతుకుతున్నట్టు.కొందరు ఎప్పుడూ ఏదో పరధ్యానంగా ఉంటూ ఉంటారు. ఏ పనీ చేయడం మాట అటుంచి, కనీసం ఏం చేయాలనే ఆలోచన కూడా వీరికి ఉండదు. ఏదో రోజూ తెల్లారుతుంది. తింటారు. పడుకుంటారు. మళ్లీ తెల్లారుతుంది. రోజులన్నీ ఇలాగే గడిచిపోతుంటాయి. ప్రగతి, పురోగతి మాత్రం కనిపించవు. మనం ఏ పని చేయాలన్నా.. అదెలా చేయాలనే ఒక ఆలోచన ఉండాలి. అందు కోసం ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ బాపతు మనుషులు మాత్రం అసలు పని చేయాలనే అనుకోరు. ఇంకెక్కడ ఆలోచన? అసలు వారికి ఆలోచన అనేది ఉంటేనే పని చేయాలనే తలంపు పుడుతుంది.ఏ ఆలోచనా లేని మనుషులు అవివేకులుగా మిగిలిపోతారు. వీరి మాటల్లో తర్కం ఉండదు. లోక జ్ఞానం నేర్చుకోరు. కాబట్టి వీరిని సమాజం అవివేకులుగా పరిగణిస్తుంది.

ఎప్పుడు ఆలోచిస్తుండే వాడు అభాగ్యుడు
వెనకటికి ఎవరో- ‘ఏం చేస్తున్నావురా?’ అని అడిగితే..‘ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నా’ అన్నాడట ఓ అతి తెలివి మనిషి.నిజానికి అసలు ఆలోచన అనేది లేకపోవడం.. అతిగా ఆలోచించడం రెండూ మనిషిని దిగజార్చు తాయి. అదే పనిగా ఆలోచించడం వల్ల కలిగే లాభం ఏదీ లేదు. ఆ ఆలోచనను ఆచరణలో పెడితేనే ఫలం, ఫలితం దక్కుతాయి. కొందరు ఇరవై నాలుగు గంటలూ ఏదో ఆలోచిస్తున్నట్టే ఉంటారు. పోనీ ఆ ఆలోచన ఫలితంగా ఏదైనా అద్భుతం జరుగుతుందా అంటే అదీ ఉండదు. గతాన్నో, భవిష్యత్తునో తలుచు కుంటూ, జీవితానికి ఏమాత్రం ఉపయోగపడని విషయాల గురించి గంటల తరబడి ఆలోచిస్తూ గడిపేస్తుంటారు. అతిగా ఆలోచించడం వల్ల కించిత్తు కూడా ఉపయోగం ఉండదు. ఆలోచన అయినా, మరొకటైనా ఎంత వరకు యోచించాలో అంత వరకే ఉండాలి. మన ఆలోచనలు సవ్యంగా
ఉంటేనే మన చర్యలు సవ్యంగా ఉంటాయి. ఈ భూమ్మీద మనిషికి మాత్రమే ఆలోచన అనే శక్తి ఉంది. అయితే దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని వాళ్లే ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారనే కోణంలో ‘ఎన్నడూ యోచించని వాడు అవివేకి’, ‘ఎప్పుడు ఆలోచిస్తుండే వాడు అభాగ్యుడు’ అనే సామెతలు పుట్టుకొచ్చాయి. నిజానికి మన ఆలోచన మనల్ని భాగ్యవంతుడిని చెయ్యాలి. కానీ, అదే పనిగా ఆలోచించడం వల్ల కలగాల్సిన భాగ్యం కలగకపోగా, అభాగ్యం చుట్టుకుంటుంది.

Review ఒక్క క్షణం ఆలోచించండి!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top