కాకులు వాలని కోటప్ప కొండ

‘కాకులు దూరని కారడవి’ అంటుంటాం కదా!. కానీ, కాకులు వాలని కొండ కూడా ఒకటుంది. అదే కోటప్పకొండ. ఇక్కడ శివుడు దక్షిణామూర్తిగా వెలిశాడు. ఆంధప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నరసారావుపేటకు సమీపంలో కోటప్ప కొండ క్షేత్రం ఉంది. ఇక్కడ కొండపై ఒక్క కాకి కూడా వాలిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని అంటారు. శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఏపీలో ఇదొక్కటే.
దక్ష యజ్ఞాన్ని భగ్నం చేశాక శివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. బ్రహ్మ ఆయనను దర్శించి, తనకు జ్ఞానబోధ చేయాలని కోరతాడు. త్రికుటాచలానికి వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని శివుడు అంటాడు. బ్రహ్మ ఇతర దేవతా పరివారంతో కలిసి వెళ్లి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్పకొండ. ఈ కొండను ఎటువైపు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. వీటిని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగానూ, ఇక్కడ కొలువైన స్వామిని త్రికుటాచలేశ్వరుడని, త్రికోటేశ్వరుడని పిలుస్తారు.
త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలోని కొండకావూరులో సుందుడు అనే యాదవుడు భార్య కుందిరితో కలిసి జీవించే వాడు. ఒకరోజు సుందుడు పశువులను కాచుకుంటూ త్రికుటేశ్వరుడిని దర్శించి సేవిస్తాడు. తరువాత సుందుడు ఇంట కుమార్తె పుడుతుంది. ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు. ఆమె జన్మించిన తరువాత సుందుడి కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది.
గొల్లభామ పరమ శివభక్తురాలు. రోజూ కొండపై ఉన్న శివుడిని పూజించేది. ఒకసారి ఆమెను పరీక్షించదలిచిన శివుడు.. ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. నిండు గర్భిణి అయి ఉండి కూడా ఆమె శివుడిని కొలిచేందుకు కొండకు వస్తుంది. ఒకరోజు శివుడికి చల్లకుండలో పెరుగును నైవేద్యంగా తెస్తూ.. ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఒక కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది.
దీంతో విచారంలో మునిగిపోయిన గొల్లభామ వద్దకు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో శివుడు వచ్చి.. ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్పకొండపై కాకులు వాలవని పురాణ కథనం.
కాగా, గర్భంతో ఉన్న గొల్లభామ- రోజూ నీ దర్శనానికి పాత కొండపైకి రాలేకపోతున్నానని, నువ్వే కిందికి దిగి రావాలని శివుడిని కోరుతుంది. సరేనన్న శివుడు- నువ్వు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడవద్దని అంటాడు. కానీ, గొల్లభామ కొంత దూరం వెళ్లాక భీకర శబ్దాలు వినబడటంతో భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. దీంతో శివుడు అక్కడే జంగందేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అనంతరం గొల్లభామ కూడా శివుడిలో ఐక్యమవుతుంది.
మహా శివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. ఇక్కడ శివుడిని పూజిస్తే గురుబలం పెరుగుతుందని అంటారు.
కోటప్పకొండ గుంటూరుకు 60 కి.మీ. దూరంలో, నరసరావుపేటకు 15 కి.మీ. దూరంలో ఉంది. రోడ్డు రవాణా మార్గాల ద్వారా ఇక్కడకు సులువుగా చేరుకోవచ్చు.

Review కాకులు వాలని కోటప్ప కొండ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top