కొయ్య – చెట్లు

ఒక కొండ మీద ఉన్న అడవిలో మూడు చెట్లు ఉన్నాయి. అవి వాటి ఆశలు, ఆశయాల గురించీ, వాటి కలలను గురించీ ముచ్చటించు కుంటున్నాయి. మొదటి చెట్టు ‘‘ఏదో ఒక రోజున నేను ధనాగారాన్ని అవుతాననే ఆశ ఉంది. నేను బంగారంతోను, వెండితోను నింపబడి ఉంటాను. మణులతోను అలంకరింపబడి ఉంటాను, నా మీద నగిషీ పని చెక్కబడి ఉంటుంది. నా అందాన్ని చూడడానికి ప్రతివారూ వస్తారు’’ అంది.
రెండవ చెట్టు, ‘‘ఒక రోజున నేను ఒక పెద్ద ఓడనవుతాను. రాజుల్ని, రాణుల్ని ప్రపంచం నలుమూలలకి నావికా ప్రయాణం చేయిస్తాను. నాలో ప్రయాణం చేయడం సురక్షితంగా ఉంటుందని అందరూ భావిస్తారు’’ అంది.

మూడవ చెట్టు, ‘‘చాలా ఎత్తుగా, తిన్నగా వంకర లేకుండా పెరగాలని ఉంది. ఈ అడవిలో నేనే చాలా ఎత్తైన చెట్టుగా మారాలి. ప్రజలందరూ ఎత్తైన కొండ మీద నుండి నా కొమ్మల్ని చూడగలగాలి. వారికి స్వర్గం, భగవంతుడు గుర్తుకి రావాలి. ఎందుకంటే నేను స్వర్గానికి దగ్గరగా వెళ్తాను కాబట్టి. ఏ కాలంలోనైనా నా అంత గొప్ప చెట్టు యింకొకటి ఉండకూడదు. అందరూ నన్ను గుర్తుంచుకోవాలి’’ అంది.

తమ కలలు సాకారం కావాలని చాలా సంవత్సరాలు ఆ చెట్లు ప్రార్థించాయి. కొంత కాలానికి కొంతమంది కట్టెలు కొట్టేవాళ్లు ఆ చెట్ల వద్దకు వచ్చారు. ఒకడు మొదటి చెట్టు వద్దకి వచ్చి, ‘‘ఈ చెట్టు చాలా బలంగా, గట్టిగా ఉంది. దీనిని కొట్టి కట్టెల్ని వడ్రంగికి అమ్ముతాను’’ అనుకుని దానిని నరకడం ప్రారంభించాడు. చెట్టు చాలా సంతోషించింది. తనని వండ్రంగికి అమ్మితే తాను ఒక అందమైన ధనపేటికగా తయారువుతా ననుకుంది.

రెండవ చెట్టు వద్దకు యింకొకడు వెళ్లి, ‘‘ఇది చాలా గట్టిగా, బలంగా పెరిగిన చెట్టు. దీనిని నేను ఓడలు తయారు చేసే వానికి అమ్ముతాను’’ అనుకున్నాడు. రెండవ చెట్టు కూడా చాలా సంతోషించింది. తాను ఒక పెద్ద ఓడగా మారబోతున్నానని గర్వపడింది.

ఇంకొకడు మూడవ చెట్టు వద్దకు వచ్చాడు. అతని చూసి, ఆ చెట్టు భయపడింది. తనను అతడు నరికి వేస్తే తన కల నెరవేరదనుకుంది. ‘‘నాకు ప్రత్యేకంగా చెట్టు నుండి ఏమీ ఆశించలేదు. కాబట్టి యీ చెట్టు నాకు చాలు’’ అనుకుని దానిని నరికి వేశాడు.

మొదటి చెట్టు వడ్రంగి వద్దకి వచ్చింది. అతడు దానిని జంతువులకి దాణా పెట్టే పెట్టెగా తయారుచేశాడు. దానిని ఒక ధాన్యాగారంలో ఉంచి, గడ్డితో నింపారు. ఇలా తయారవడం కోసం ఆ చెట్టు ప్రార్థించలేదు.

రెండవ చెట్టుని కోసి, చేపలు పట్టే పడవగా తయారు చేశారు. పెద్ద ఓడగా మారాలనే కోరిక, కల, రాజుల్ని, రాణుల్ని తీసుకుని వెళ్తాననే కల కరిగిపోయింది.
మూడవ చెట్టుని పెద్ద చెక్కలుగా కోసి, ఒంటరిగా చీకట్లో పడవేశారు.

చాలాకాలం గడిచింది. చెట్లు తమ కలల్ని మరిచి పోయాయి.

ఒక రోజున ఒక పురుషుడు, ఒక స్త్రీ ధాన్యాగారం వద్దకు వచ్చారు. ఆమె ఒక శిశువుని ప్రసవించింది. ఆ శిశువుని దాణా పెట్టెలో ఉన్న గడ్డిలో ఉంచింది. ఆ శిశువు కోసం ఒక తొట్టెని తయారు చేయించా లనుకున్నాడు ఆ పురుషుడు. కాని దాణా పెట్టే తొట్టి అయింది. మొదటి చెట్టు తన యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించింది. ఆ సంఘటన చాలా ప్రాముఖ్యత కలది. అంటే గొప్ప ధనాగారంగా మొదటి చెట్టు మారినట్లయింది.

కొన్ని సంవత్సరాల తరువాత కొంత మంది రెండవ చెట్టు నుండి తయారు కాబడిన చేపల పడవలో ఎక్కారు. అందులో ఒకరు బాగా అలసిపోయాడు. బాగా నిద్రపోతున్నాడు. అంతలో తుఫాను చెలరేగింది. వారిని కాపాడగలిగినంత బలం తనకి లేదనుకుంది రెండవ చెట్టు. మిగిలిన వారు నిద్రపోతూన్న వ్యక్తిని నిద్ర నుండి లేపారు. అతడులేచి నిలబడి, ‘‘శాంతం’’ అన్నాడు. తుఫాను ఆగిపోయింది. అప్పుడు తాను రాజులకి రాజునే మోశాననుకుంది రెండవ చెట్టు.

ఒకరు మూడవ చెట్టు వద్దకు వచ్చాడు. దానిని వీధుల గుండా మోసుకుని వెళ్తున్నాడు. అది చూసిన వారందరూ అతనిని హేళన చేస్తున్నారు. వారు ఆగవలసిన ప్రదేశం వచ్చింది. ఆ చెట్టుని మోసుకుని వచ్చిన వ్యక్తిని చెట్టుకి మేకులతో కొట్టి, గాలిలోకి లేవనెత్తి, కొండమీద చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

తాను కొండ మీద నిలబడడానికి తగినంత బలంగా ఉన్నాననీ, స్వర్గానికి, భగవంతుడే స్వయంగా చెట్టు మీద శిలువ వేయబడ్డాడు గనుక.
మనం అనుకున్న పనులు జరగకపోతే, అది భగవంతుడు వేసిన ప్రణాళికగా మనం భావించాలి. ఎందుకంటే, మనం ఒకటి తలిస్తే, భగవంతుడు యింకొకటి తలుస్తాడేమో!

Review కొయ్య – చెట్లు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top