గురువును మించిన శిష్యుడు

తెనాలి రామకి•ష్ణునికి వసుంధరుడు అనే పుత్రుడు ఉండేవాడు. అతడు ఒకనాడు విధివశాన దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తూ దారి తప్పి ఎక్కడికో చేరుకున్నాడు. దారి తెలియక అతను అరణ్యంలో సంచరిస్తుండగా ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో తుందిలుడు అనే యోగి ఉండేవాడు. వసుంధరుడు చేసేది లేక ఆ ఆశ్రమంలోనే తలదాచుకున్నాడు. రోజూ తుందిలుడు దగ్గరలోని ఓ స్ఫటిక స్తంభం వద్దకు వెళ్లి అక్కడ నున్న యక్షిణీ దేవాలయంలో జపం చేస్తూ ఉండేవాడు.

ఒకరోజు తుందిలుడు వసుంధరుని వెంటబెట్టుకొని ఆ దేవాలయానికి వెళ్లాడు. తుందిలుడు జపం చేసుకుంటుండగా వసుంధరుడు అక్కడి విశేషాలు చూస్తూ ఉన్నాడు. స్ఫటిక స్తంభం మీద ఓ శిలాఫలకం కనిపించింది. అందులో సులోచన అనే యక్షిణిని వశపరచుకోవటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందులో ముప్ఫయ్యేళ్లు మంత్రానుష్ఠానం చేసి పధ్నాలుగేళ్ల ప్రాయం గల బ్రాహ్మణ యువకుణ్ణి బలి ఇవ్వాలని అలా బలి ఇస్తే అప్పుడు సులోచన అనే యక్షిణి వశమౌతుందని రాయబడి ఉంది.

దీనిని బట్టి తుందిలుడు తనను బలి ఇవ్వడానికే ఇక్కడ తీసుకువచ్చాడని వసుంధరుడు అర్థం చేసుకున్నాడు. అయినా ఏమీ తెలియని వాడిలా ఉంటూ తన జాగ్రత్తలో తాను ఉన్నాడు. అప్పటి నుండి తుందిలుని వసుంధరుడు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. ఇద్దరూ పదవరోజు స్నానం చేసి ఆలయానికి వెళ్లారు. అప్పుడు వసుంధరునితో తుందిలుడు ఓయీ బాలకా! నీ మీద నాకు వాత్సల్యం కలిగింది. ఇవాళ నీకొక మంత్రం ఉపదేశిస్తాను. దానితో నీ దేశానికి నీవు పక్షిలా ఎగిరిపోవచ్చు అన్నాడు తుందిలుడు. అందుకు వసుంధరుడు ‘ఆ మంత్రం మీకు సిద్ధించిందా అయితే ఒకసారి మీరే ఎగిరి చూపించండి’ అని అడిగాడు. ఇలా ఎదురు ప్రశ్నిస్తాడని ఊహించని తుందిలుడు ‘‘బిడ్డా ఒక మంత్రం అనుష్ఠిస్తున్నప్పుడు ఇంకొక మంత్రం ప్రయోగించరాదు’’ అని అన్నాడు.

‘‘అందునా గురువులు ఎప్పుడు ఏది తోస్తే అప్పుడు అది చెపుతారు. అందుకే శిష్యులు నిత్యం గురువుని అనుసరించి తిరగాలని పెద్దలు చెపుతారు’’ అన్నాడు.

‘‘నా దగ్గర ఉపదేశం పొందాలనుకుంటే కుశంకలు మానివేసి నా పాదాలు రెండింటి మీద నీ శిరస్సు వంచి నేను చెప్పే మంత్రం ఉచ్చరిస్తూ ఉండు. నీవు నాకు గురుదక్షిణ కూడా ఇవ్వనక్కరలేదు’’ అన్నాడు. తనను దేవతకు బలి ఇవ్వటానికే తుందిలుడు ఇలా అంటున్నాడని గ్రహించాడు వసుంధరుడ. దాంతో వసుంధరుడు ‘‘స్వామీ! నేను పుట్టి బుద్ధెరిగాక ఇంతరకు బోర్లా పడుకొని ఎరుగను. మీరు చెప్పినట్లు చేయాలని ఉంది. కనుక ప్రణామ విధి ఎలాగో మీరు స్వయంగా చేసి చూపించండి. నేనూ అలాగే చేస్తాను అని బదులిచ్చాడు.

అప్పుడు తుందిలుడు ‘‘ఇతడు పుట్టిన దగ్గర నుండి రాజులతో కలిసి తిరగటం వల్ల ఇతరులచే మొక్కించు కోవడమేకాని మొక్కడం తెలియదు కాబోలు. వీడికి ఆ ప్రణామవిధి చూపించాలి’’ అనుకుంటూ ప్రణామం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. వెంటనే వసుంధరుడు చర్రున కత్తి దూసి ‘‘ఓరీ దురాత్మా, నీ ప్రాణం కత్తికి బలి కాబోతుంది. నీ యిష్టదైవాన్ని తలచుకో’’ అని అతని జుట్టును లంకించుకున్నాడు. తుందిలుడు ‘‘వసుంధరా నన్ను రక్షించు, కాపాడు. నన్ను చంపవద్దు. నీ దాసుడనై ఉంటాను’’ అని మొరపెట్టాడు. ‘‘ నీవు నన్ను చంపడానికి ప్రయత్నించావా లేదా చెప్పు’’ అని గద్దించాడు.

‘‘అవును నేను నిన్ను చంపడానికి ప్రయత్నించాను. నన్ను క్షమించు’’ అని వేడుకున్నాడు తుందిలుడు. ‘‘ఓయీ రాజపుత్రా వీడిని విడవకు. నాకు బలి ఇవ్వు. నేను నీకు వశమవుతాను’’ అని అశరీరవాణి పలికింది. దానికి ‘‘అమ్మా వీడి ఇంట పదిరోజులు భోంచేశాను. ఆ కృతజ్ఞత నన్ను బాధిస్తోంది.
బ్రహ్మహత్య చేయడంపాపం కదా !’’ అని బదులిచ్చాడు వసుందరుడు. దేవత ఆ యువకుని కృతజ్ఞతకు, మంచి గుణానికి మెచ్చి అనేక వరాలిచ్చి అదృశ్యమైంది.

తుందిలునితో ‘‘ నీవు దయలేని కపటుడివి. నీకు ఈ ఆకారం ఎందుకు అంటూ అతని జుట్టును శిఖ మొదటికంటా తెగకోశాడు. శిష్యుడి జాలి గుణానికి, అతని తెలివితేటలకు తుందిలుడు సిగ్గుపడి అచటి నుండి దూరంగా వెళ్లిపోయాడు.

Review గురువును మించిన శిష్యుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top