సూర్యుడికి ఇష్టమైన నైవేద్యాలలో గోధుమ రవ్వ చక్కెర పొంగలి ఒకటి. ఇది ఆయనకు ప్రీతికరమైనదిగా చెబుతారు. రథ సప్తమి (ఫిబ్రవరి 19) సందర్భంగా ఆ ప్రత్యక్ష నారాయణుడికి భక్తిపూర్వకంగా సమర్పించుకునే నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ- అర కప్పు, పెసర పప్పు- అర కప్పు, పాలు- ఒక కప్పు, పంచదార- అర కప్పు, నెయ్యి- రెండు (2) టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి- అర టీ స్పూన్; ఫుడ్ కలర్- చిటికెడు (ఇష్టాన్ని బట్టి మాత్రమే..), డ్రై ఫ్రూట్స్: బాదంపప్పు, జీడిపప్పు, కిస్‍మిస్.
తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టుకుని కొద్దిగా వేడి చేసుకోవాలి. తొలుత నెయ్యి వేసి, కొద్దిగా కాగిన తరువాత వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ను అందులో వేసి వేయించాలి. దోరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ను తీసి ఒక చిన్న బౌల్‍లో పెట్టుకోవాలి. అనంతరం అరకప్పు గోధుమ రవ్వ, అరకప్పు పెసరపప్పు (గోధుమ రవ్వను కూడా ముందే వేయించుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. పెసరపప్పును కలిపి నానబెట్టి ఉంచిన తరువాత ముద్దగా ఉడికించుకుని సిద్ధంగా ఉంచుకోవాలి).
ఇలా ఉడికించుకుని ఉంచుకున్న ఈ రెండింటి మిశ్రమాన్ని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు వేయించిన తరువాత అంతకుముందే కాచి చల్లార్చుకున్న పాలను ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అనంతరం సరిపడా చక్కెరను వేసి కలపాలి. మళ్లీ ఇందులో నైవేద్యం వంటకం మంచి రంగు రావడం కోసం కేసరిని కొద్దిగా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం బాగా కలుపుతూ ఉడికించాలి. ఇలా పావుగంట పాటు ఉడికాక దించే ముందు కొద్దిగా యాలకుల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని బౌల్‍లోకి తీసుకుని.. అంతకుముందు వేయించిన డ్రై ఫ్రూట్స్ను ఈ పదార్థంపై అలంకరిస్తే…. రవ్వ చక్కెర పొంగలి సిద్ధం. సాధారణంగా బియ్యంతో చక్కెర పొంగలి చేసుకుంటారు కదా! అదే గోధుమ రవ్వతో చేసుకుంటే.. ఆ రవ్వ పలుకులు ఆహారంగా తీసుకునేటపుడు నోటికి తగిలి భలే రుచి కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రథ సప్తమికి మీరూ ఈ నైవేద్యపు వంటకాన్ని వెంటనే ట్రై చేయండి మరి..
సూర్యుడికి ఈ వంటకాలంటే ఇష్టం..
సూర్యుడు ‘వేడి’ వేలుపు. ఆయన ఎర్రటి పండ్లు, చిక్కుడు కాయలతో చేసిప పొంగలి, బూరెలను కూడా నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇంకా రథ సప్తమి నాడు ఆయనకు నివేదించే వంటకాల వివరాలివీ..
– రథ సప్తమి నాడు సూర్యుడికి నివేదించే వంటకాల తయారీలో నూనెను వినియోగించడం ఉత్తమం.
– పరమాన్నం కూడా సూర్యుడికి నివేదించే నైవేద్యాలలో ఒకటి. దీనిని ఎలా తయారు చేయాలంటే.. గోమయంతో చేసిన పిడకలను తీసుకుని పొయ్యి మీద ఇత్తడి పాత్రలో ఆవుపాలను పోసి కర్పూరంతో వెలిగించాలి. పాలు పొంగుతున్న సమయంలో కొత్త బియ్యం, బెల్లం వేసి, చెరుకు గడతో తిప్పుతూ పరమాన్నం తయారుచేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి.
– ఇలా చేయడం వల్ల వేడి చక్కెర పొంగలి లేదా పరమాన్నం చిక్కుడు ఆకు మీదనే వేసి చల్లార్చడం చేత చిక్కుడు ఆకులో ఉండే పసరు, ఆర్ద్రత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనిక మార్పు వస్తుంది. ఆ పదార్థ సేవనం ఆరోగ్య ప్రదాయకం.
– రథ సప్తమి నాడు తరిగిన కూరను తినకూడదని పెద్దలు చెబుతారు. అందువల్ల నైవేద్యాల తయారీలోనూ, రథం తయారీలోనూ ఉపయోగించే చిక్కుడు కాయలను చేతితో తుంపి మాత్రమే ఆ కూరను వండుకోవాలి.
Review గోధుమ రవ్వ చక్కెర పొంగ.