కొందరు సక్సెస్ చుట్టూ తిరుగుతారు. ఇంకొందరు సక్సెస్‍నే తమ ఇంటి పేరుగా మార్చుకుని సక్సెస్‍ను తమ చుట్టూ తిప్పుకుంటారు. విజయం సాధించడం అంటే ఏదైనా విషయంలో విజయం సాధించడం కాదు.. ఆ గెలుపును పది మందికీ ప్రయోజనం కలిగించే రీతిలో మలచడం. అదే నిజమైన సక్సెస్. అటువంటి సక్సెస్‍కు కేరాఫ్‍గా నిలుస్తారు.. బుర్రా వెంకటేశం. ఆయన ఓ ఐఏఎస్ అధికారి. కానీ, మిగతా అందరిలా ఆయన కేవలం ‘విధులు నిర్వహించరు’. దానికి మానవత్వాన్ని జోడిస్తారు. చేసే పనిని మనసు పెట్టి చేస్తారు. ఆయన తన లైఫ్‍లో, కెరీర్‍లో, సేవలో ఎన్నో విజయాలు సాధించారు. అన్నింటా ఆయనతో ముచ్చటపడి సక్సెస్ సెల్ఫీ దిగింది. నిజమైన, అసలుసిసలైన విజయమంటే ఇలాగే ఉంటుందంటూ ప్రపంచానికి వెంకటేశాన్ని చూపించింది. పుస్తకాలు చదవడం, రాయడం ఆయనకు హాబీ. అలా ఆటవిడుపుగా రాసిన ఓ పుస్తకం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‍గా మారింది. ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పేరుతో ఆయన ఆంగ్లంలో రాసిన ఈ పుస్తకం అమెజాన్‍లో టాప్ రేటింగ్‍ను సొంతం చేసుకుంది. మహామహుల రచనలను తోసి రాజని అగ్రస్థానం రేటింగ్‍లో కొనసాగుతున్న ఆ పుస్తకంలో ఇంతకీ ఏముంది? ఆయన ఏం రాశారు? ఎవరి గురించి రాశారు? అసలు బుర్రా వెంకటేశం ఎవరు? ఆయన జీవిత నేపథ్యం
డిగ్రీకి వచ్చే వరకు రైలెక్క లేదు. ఫోనంటే తెలియదు. టీవీ చూడలేదు.
కళ్లెదుట మాత్రం విస్పష్టమైన లక్ష్యం..
దేవుడి విగ్రహాన్ని అయినా సరే.. శిల్పి చెక్కితేనే ఓ రూపం వస్తుంది.
కానీ, ఆయన స్వయంకృషితో తన జీవి తాన్ని తానే తీర్చిదిద్దుకున్న శిల్పి. కష్టాలకు వెరవక.. ఇబ్బందులకు తలొంచక.. అవ రోధాలను తలుచుకుని వెనకడుగు వేయక నేడు ప్రపంచ విజేతగా నిలిచిన బుర్రా వెంకటేశం గ్రౌండ్ జీరో నుంచి గ్రాండ్ హీరోగా అవతరించారు. ఆయన జీవన నేపథ్యం నేటి యువతకు ఓ సక్సెస్ లెస్సన్.
బాల్యం
బుర్రా వెంకటేశం స్వగ్రామం ప్రస్తుత జనగామ జిల్లాలోని ఓబుల కేశవపురం. ఏప్రిల్ 10, 1968లో జన్మించారు. తండ్రి బుర్రా నారా యణ. తల్లి గౌరమ్మ. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వెంకటేశం అన్నయ్య పేద రికం రీత్యా పెద్దమ్మ ఇంట్లో ఉండి చదువుకునే వారు. అక్కకు చిన్న వయసులోనే వివాహమైంది. వెంకటేశం చివరివారు. చిన్న ఇంట్లో నివాసం.. కటిక నేలే ఆశ్రయం. సెలవుల్లో తోటి పిల్లలంతా ఆటపాటలతో గడుపుతోంటే వెంకటేశం మాత్రం వ్యవసాయ పనులకు వెళ్లేవారు. ఆ డబ్బులతోనే చదువు సాగేది. గుక్కెడు తాగు నీళ్లకూ మైళ్ల దూరం నడిచిన అనుభవం ఆయ నది. పొయ్యిలోకి కట్టెలు కావాలన్నా కష్ట పడాల్సిన పరిస్థితి. ఆయన రెండో తరగతిలో ఉండగానే, అంటే ఏడేళ్ల వయసులోనే తండ్రి పరమ పదించారు. తల్లి రెక్కల కష్టమే వెంకటేశాన్ని చదివించింది. ఏడవ తరగతి వరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. సెవన్త్లో జిల్లా ఫస్ట్గా నిలిచారు. సాయంత్రం వేళలో కేవలం రెండు గంటలు మాత్రమే కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకునేవారు. అంతకంటే ఎక్కువసేపు చదివితే కిరోసిన్ అయిపోతుందనే భయం..
అంచలంచెలుగా..
8 నుంచి పదో తరగతి వరకు నల్లగొండ జిల్లా సర్వేయల్ రెసిడెన్షియల్ స్కూల్‍లో చదివారు. టెన్త్లోనూ టాపర్‍గా నిలిచారు. ఇంటర్ హైదరాబాద్‍లో ప్రైవేటుగా చదివారు. అందులోనూ టాపరే. అప్పటి నుంచి చదువు కుంటూనే మరోపక్క ట్యూషన్స్ చెబుతూ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూని వర్సిటీ నుంచి ఎల్‍ఎల్‍బీ పూర్తి చేశారు. తరువాత సివిల్ సర్వీసెస్‍కు ప్రిపేరై.. ఐఏఎస్ సాధించారు.
స్టార్ తిప్పిన మాస్టారు
వెంకటేశం ఐదో తరగతిలో ఉండగా, అప్పటి మాస్టారు ఎం.కెమొహియిద్దీన్ ‘నువ్వు ఐఏఎస్ కావాలిరా’ అనేవారు. దేశంలోనే అత్యున్నతమైన పోస్టు అదని ఆయన చెప్పేవారు. నిజానికి ఐఏఎస్ అంటే ఏమిటో కూడా తెలియని వయసు వెంకటేశానిది. ఐఏఎస్‍ల హోదా, గౌరవం, వారి ప్రజాసేవ, విధి నిర్వహణల గురించి ఆ మాస్టారు తరచూ చెబుతుంటే వెంకటేశం తనకు తెలియకుండా ‘ఐఏఎస్’ ధ్యాసలో పడ్డారు. అదే చివరకు ఒక లక్ష్యంగా మారింది. ఆ కలను సాకారం చేసుకోవాలనే ధ్యేయంతో మరింత కష్టపడి చదివేవారు. ఈ క్రమంలో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సబ్జెక్టులుగా తీసుకుని 1990లో తొలిసారి సివిల్స్ రాశారు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన సెంట్రల్ ఎక్సయిజ్ డిపార్ట్మెంట్‍లో ఉద్యోగం సాధించారు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే వివాహమైంది. 1993, జనవరిలో గ్రూప్-బీలో కస్టమ్స్ అధికారిగా చేరారు. అయితే చిన్ననాటి ఐఏఎస్ కల అలాగే ఉండి పోయింది. అది ఆయనను కుదురుగా ఉండనివ్వలేదు. మొదటి ప్రయత్నంలో ఆ కల ఫలించకపోయినా.. 1993 నాటికి తన జీవితంలోని ఒక్కొక్క అవరోధాలను అధిగమించి స్థిరపడ్డారు. దీంతో ఐఏఎస్ లక్ష్యంపై మరింతగా గురిపెట్టారు. ఆంత్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సబ్జెక్టులుగా సివిల్స్ రాశారు. ఎటువంటి కోచింగ్ లేకుండానే 1994లో సివిల్స్కు ప్రిపేర్ అయి 1995లో మెయిన్స్ రాశారు. వెలువడిన ఫలితాల్లో ఆరవ ర్యాంకు సాధించిన ఉమ్మడి ఏపీ టాపర్‍గా నిలిచారు. తొలి ప్రయ త్నంలో తాను ఓడిపోవడానికి తనకు అప్పట్లో అంతగా ఆత్మవిశ్వాసం లేకపోవడమే కారణమని నిజాయతీగా చెబుతారు.
ఉద్యోగ బాధ్యతలు.. అమెరికా చదువు
1996లో ఆదిలాబాద్ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‍గా తన ఐఏఎస్ ప్రస్తానాన్ని ప్రారంభించారు. అదే ఏడాది తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్‍గా పని చేశారు. ఆపై 1998లో రాజమండ్రి సబ్ కలెక్టర్‍గా, 1999లో వరంగల్ మునిసిపల్ కమిషనర్‍గా, 2001లో చిత్తూరు జాయింట్ కలెక్టర్‍గా, 2003లో గుంటూరు జాయింట్ కలెక్టర్‍గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో వరల్డ్బ్యాంక్ స్కాలర్‍షిప్‍తో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లే అవకాశం దక్కింది. ఈ క్రమంలో కొలంబియా యూనివర్సిటీలో చేరి ఎకనమిక్ పాలసీపై ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ కోర్సులో 40 సీట్లు మాత్రమే ఉంటాయి. వీటిలో రెండు సీట్లనే వరల్డ్బ్యాంక్ స్కాలర్‍షిప్‍తో భర్తీ చేస్తుంది. అలా ఈ స్కాలర్‍షిప్‍కు ఎంపికైన వారిలో వెంకటేశం కూడా ఒకరు.
సమాజం అంటే గౌరవం..
ఐఏఎస్ కావడంతోనే తన బాధ్యత మరింత పెరిగిందని భావించారు వెంకటేశం. దానిని ఓ హోదాగా భావించి దర్పం ప్రదర్శించలేదు. ఇప్పటికీ ఆయన చెప్పేదేమిటంటే- ‘ఐఏఎస్ అధికారి కావడం అనేది నా తెలివితేటలకు నేను పెట్టుకున్న పరీక్ష మాత్రమే. అంతేతప్ప ఆ హోదాలో సుఖాన్ని అనుభ వించాలని ఏనాడూ అనుకోలేదు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ నా జీవితంలో మార్పు లేదు. నాలో మార్పు లేదు’. నిజంగా ఈ మాటలకు కట్టుబడి, అత్యంత క్రమశిక్షణ, కట్టుబాట్లతో తన అధికార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారాయన. చట్టాలను గౌరవించడం, బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం ఆయన ప్రధమ ప్రాధాన్యాలు. ఒక ప్రభుత్వ అధికారిగా చట్టాన్ని గౌరవిస్తూ, దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన మొ•దటి వ్యక్తిని తానేనని భావిస్తారు. ‘నా ప్రతి అడుగు చట్టబద్ధంగా ఉండేలా చూసు కుంటాను. నేను ఏ శాఖలో పని చేస్తే ఎంతమందికి సాయపడగలనో అంతమందికీ సహాయపడుతుంటాను. పేదరికం నుంచి నా ప్రస్తానం మొదలైంది. కాబట్టి సమాజంలో చట్ట పరిధికి లోబడి ఎవరికి ఎంత సాయపడాలో అంత వరకు సాయపడతాను’ అని అంటారు.
డబ్బుకున్న విలువ మనిషికేదీ?
ప్రస్తుతం సమాజంలో డబ్బుకు ఇస్తున్న విలువ తోటి మనిషికి ఎవరూ ఇవ్వడం లేదనేది వెంకటేశం మాట. ‘ఏ మనిషైనా ఇది నాది’ అని చెప్పుకోగలుగుతున్నాడంటే అందుకు అవకాశం ఇచ్చింది ఈ సమాజమే. నాది అనే పదానికి చట్టబద్ధత కల్పించిందీ వ్యవస్థ. కానీ, ఈ వ్యవస్థను, సమాజాన్ని నేడు మనం మర్చిపోతున్నాం’ అంటారు వెంకటేశం. ‘జంతువుల్లో స్వార్థం ఉండదు. వాటికి దగా, మోసం వంటివి తెలి యవు. పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటాయి. లేకుంటే తమకున్న కొద్దిపాటి ఆహారాన్ని తోటి జంతువులతో పంచుకుంటాయి. మనిషికి ఈ స్ప•హ ఏమైంది? ఇటువంటి పరిస్థితి ఉన్నంత కాలం మన సంస్క•తి, సంప్రదాయాల గురించి గొప్పగా చెప్పుకోవడం అనవసరం. తోటి మనిషి పట్ల కనీస జాలి, దయ చూపలేని సంస్కారం వ్యర్థం. ఆకలి లేని సమాజాన్ని సృష్టించడం తక్షణ కర్తవ్యం అని బుర్రా వెంకటేశం ఉద్వేగంగా చెబుతారు.
కుటుంబ నేపథ్యం..
బుర్రా వెంకటేశం సతీమణి పేరు శ్రీమతి గీతా లక్ష్మి, వీరికి 1992లో వివాహమైంది. ఆమె హోమియోపతిలో డిగ్రీ చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు పేరు యోగ్య హరిప్రకాశ్. పాప భవ్యశ్రీ. తన ప్రతి విజయం వెనుక తన శ్రీమతి అడుగులు ఉన్నాయని, కుటుంబం కోసం తన ప్రాక్టీస్‍నే మానుకున్న ఆమె త్యాగం ఎన్నటికీ మరువలేనిదని వెంకటేశం అంటారు. ఇక, తాను చిన్నప్పుడు కష్టపడి చదువుకున్న సందర్భాల్లోనూ, ఆ తరువాత ఉన్నత స్థితికి చేరుకున్న సందర్భంలోనూ తన తల్లి ఒకేలా స్పందించారని, కష్టాల పునాదిపై నిర్మించుకున్న జీవితంలో ఆనందం.. బాధ.. ఎటువంటి సందర్భంలోనైనా ఒకేలా ఉండగలిగే స్థితప్రజ్ఞత కలిగి ఉండా లని ఆమె నూరిపోశారని, ఇప్పటికీ తనకు అదే ఆదర్శమని బుర్రా వెంకటేశం చెబుతారు.
విజయాన్ని ఆస్వాదిస్తూ..
బుర్రా వెంకటేశం ప్రస్తుతం బీసీ సంక్షేమం, క్రీడలు, పర్యాటక, సాంస్క•తిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. 2018 నుంచి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్య తలు కూడా ఆయనే చూస్తున్నారు. వెంకటేశం హయాంలోనే జమ్ము అండ్ కశ్మీర్, గోవా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు, తెలం గాణ ప్రభుత్వానికి మధ్య అంతరాష్ట్ర టూరిజమ్ ప్రమోషన్‍కు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. సక్సెస్ అంటే సమష్టి కృషి ఫలితమని నమ్మే ఆయన తాను సాధించిన ప్రతి విజయంలోనూ తన కుటుంబంతో పాటు తన తోటి ఉద్యో గులు, అధికారులు, ప్రభుత్వం, ప్రజలు, సిబ్బంది ప్రోత్సాహం, మద్దతు ఉందని చెబుతారు. ఊపిరి సలపని విధి నిర్వహణ మధ్యలోనే కాసింత తీరిక చేసుకుని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ‘‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’’ పుస్తక రచన అనంతరం ఆయనకు తోటి ఐఏఎస్ అధికారులు, మిత్రులతో పాటు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు కె.డేవిస్, రాజా కృష్ణమూర్తి వంటి ప్రముఖుల నుంచి అనేక ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పిడికెడు బియ్యం
బుర్రా వెంకటేశం గుంటూరు జిల్లా కలెక్టర్‍గా ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఓ సేవా కార్యక్రమమే ‘పిడికెడు బియ్యం’ కార్యక్రమం. అన్నార్తులు, అనాథల ఆకలి తీర్చేందుకు ఆయన అప్పట్లో మహిళలు, మహిళా సంఘాల్లో చైతన్యం తెచ్చారు. అందులో భాగంగా ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో వంట చేసే ముందు ఒక పిడికెడు బియ్యం తీసి పక్కన పెట్టించే వారు. ఆ బియ్యాన్ని మహిళా సంఘాలు సేకరించి వండి ఊరిలోని ఎలాంటి ఆధారం లేని వృద్ధులకు, అనాథలకు పెట్టేవారు. అలా మొదలైన ఈ పిడికెడు బియ్యం ఆలోచన గుంటూరు జిల్లాలో వందలాది మంది ఆకలిని రోజూ తీర్చేది. అన్నార్తుల ముఖాల్లో ఆనందం నింపేది.
ఇదీ సెల్ఫీ అఫ్ సక్సెస్ స్టోరీ..
బుర్రా వెంకటేశం.. ఐఏఎస్ అధికారుల్లో ఆయనా ఒకరు. కానీ, ఆయన ప్రత్యేకతే వేరు.
విధి నిర్వహణలో సిన్సియర్. నిజా యతీకి మారు పేరు. వ్యక్తిత్వంలో రోల్ మోడల్.
ఆయనకు పుస్తకాలంటే బాగా ఇష్టం. విధి నిర్వహణలో, నిత్య జీవితంలో ఏమాత్రం వీలు చిక్కినా చాలు పుస్తకాలకు అతుక్కుపోతారు. బుర్రా వెంకటేశం దాదాపు ముప్పై దేశాల్లోపర్యటించారు. విభిన్న అభిరుచులు, అలవాట్లు, అభిప్రాయాలు ఉన్న మనుషులతో కలిసిమెలిసి తిరుగుతూ వారి జీవన విధానాలను, సామాజిక, ఆర్థిక పరిస్థితులను బాగా దగ్గరిగా పరిశీలించిన అనుభవం ఆయనది. అలా వివిధ సందర్భాలలో ఆయన చేసిన అధ్య యనమే ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తకం రాసేందుకు కారణమైంది. ఈ పుస్తకం విశేషం ఏమిటంటే.. ఇందులో విజయం గురించి కాదు.. విజయం తోనే విజయం అంటే ఏమిటో చెప్పించే ప్రయత్నం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ విజయాలను సాధించిన అద్భుతమైన వ్యక్తుల మహోన్నత జీవితాలను అమోఘంగా విశ్లేషించారు. ఇందులో సబ్జెక్టుగా తీసుకున్న మహోన్నత వ్యక్తుల ఇమేజ్‍కు అనుగుణంగా పుస్తకాన్ని ఆంగ్లంలో రాయాల్సి వచ్చిందని బుర్రా వెంకటేశం చెబుతున్నారు. అయితే, దీనిని త్వరలోనే తెలుగులోనూ తెచ్చే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోకీ, ప్రపంచలోని అన్ని భాషల్లోకి అనువదించే క్రమంలో బుర్రా వెంకటేశం ఉన్నారు.
ఏ మనిషైనా సాధారణంగా నాలుగు అంశాల చుట్టూ తిరుగుతుంటాడు.
1. పని, 2. గెలుపు, 3. ఆనందం, 4. జీవన సాఫల్యత.
కొందరు సంపాదన యావలో పడి పని చుట్టూ తిరుగుతారు. వీరు పని గురించి పట్టించుకోరు. వీరికి మిగిలిన మూడు అంశాలు పట్టవు.
మరికొందరు పని చేసి విజయం సాధిస్తారు. అలాంటి వారికి పని, తర్వాత గెలుపు, ఆ తర్వాత పని.. ఇదీ రొటీన్‍గా మారుతుంది. ఇక ఇంకొందరు పని చేసి గెలుపొంది దాని ఫలితాన్ని ఆస్వాదిస్తూ ఆనందం పొందుతారు. చాలా తక్కువ మంది మాత్రం.. పనిచేసి, గెలుపొంది, దాని ఫలితాలను తమ చుట్టూ ఉన్న పది మందికీ పంచి.. అందులో లభించే ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అదే లైఫ్ అచీవ్‍మెంట్.
ఈ నాలుగో రకం మనుషులే నిజమైన విజేతలు. వీరిదే అసలైన విజయం. ఎందుకంటే విజయం లేదా గెలుపు అనేది మోసం చేసి కూడా సాధించవచ్చు. అటువంటి వారి గెలుపు వారిని సంతోషపెడుతుందేమో కానీ, ఇతరులను మాత్రం బాధిస్తుంది.
కొందరు గెలిచిన ప్రతిసారీ ఇంకా గెలవాలని ఆరాటపడుతుంటారు. వీరికి సాధించిన దానితో సంతృప్తి ఉండదు. అటువంటి వారి గెలుపు ఏదో సందర్భంలో వారినే బాధిస్తుంది.
ఇటువంటి పరిస్థితులను ప్రపంచ స్థాయి వ్యక్తుల జీవిత కథల ఆధారంగా అందంగా అభివర్ణించారు బుర్రా వెంకటేశం ఈ పుస్తకంలో.
క్లుప్తంగా ఇదీ ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తక కథ
బుర్రా వెంకటేశం సక్సెస్ లెస్సన్స్ అండ్ టెక్నిక్స్
పరీక్ష అంటే జస్ట్ ఓ టెక్నిక్. అంతే. పరీక్షలో పాసైనంత మాత్రాన సబ్జెక్టులో నిష్ణాతులమని కాదు. నిష్ణాతుడు అంటే కాలువ అడుగు కంటూ మునిగి, అందులోని సారాన్ని, విలువైన సంపదను తెలుసు కోగలగాలి.
పరీక్ష పేపర్ దిద్దే ఎగ్జామినర్‍ను ఆకట్టుకోవాలంటే మనం రాసేది ఆకట్టుకునేలా ఉండాలి. మనం బయటకు వెళ్తున్నామంటే.. అందంగా ముస్తాబవుతాం. అందరినీ ఆకర్షించాలనుకుంటాం. అదే ఏడాది చదివిన చదువుకు పెట్టిన పరీక్షలో నెగ్గాలంటే.. మన కంటికి కనిపించని ఎగ్జామినర్‍ను ఆకట్టుకోవాలంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అందుకే ఎగ్జామినర్‍కు ఆసక్తి కలిగేలా, విసుగు కలిగించకుండా సమాధానాలను విశ్లేషణాత్మకంగా రాయాలి. సొంత అభిప్రాయాలు శృతిమించకుండా, సమాజంతో ముడిపెడుతూ భావం పోకుండా అందరి కంటే భిన్నంగా పదజాలాన్ని ఉపయోగించాలి.
ఏ పనైనా చేయగలమని పదేపదే భావిస్తే కచ్చితంగా దానిని సాధించి తీరగలం. వల్ల కాదనుకుంటే ఏం చేయలేం.
మనకున్న సంకల్ప బలంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
చిన్న పిల్లాడు నడక నేర్చేటప్పుడు లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో తడబడితే తల్లిదండ్రులు ఆసరాగా నిలుస్తారు. దీంతో మళ్లీ లేచి నిలుచునేందుకు యత్నిస్తాడు. అలాగే రిజర్వేషన్లు కూడా ఉపయోగపడాలి తప్ప వాటిని ఆధారం చేసుకునే ఎదగాలని ప్రయత్నించకూడదు.
ప్రస్తుతం కాలేజీలో చేరడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి, ప్రమోషన్ పొందడానికి.. ఇలా ప్రతీ దానికీ రిజర్వేషనే. అయితే, ఏదైనా ఒక్క అవకాశంగానే రిజర్వేషన్ సదుపాయం ఉండాలి. మిగతాదంతా స్వశక్తితో ఎదిగేందుకే ప్రయత్నించాలి.
మన విద్యా విధానం సమాజ, చట్ట పరిరక్షణకు, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అనుకూలంగా ఉండాలి.
అమెరికాలోని హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీల విద్యా బడ్జెట్ మన రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన విద్యా వ్యవస్థ మెరుగుకు కేటాయింపులు మరింతగా పెరగాలి.
చిన్న పిల్లల విద్యకు ప్రాధాన్యం ఎక్కువివ్వాలి. ప్రాథమిక స్థాయిలో మన వద్ద చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటిని సరిదిద్దితేనే పిల్లలు మన దేశ భవిష్యత్తుగా మారతారు.
ఐఐటీ, ఎంఐఎం స్థాపించినంత మాత్రాన దేశం, రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నట్టు కాదు. వాటిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు చేరడానికి వీలుగా ప్రాథమిక, ఉన్నత విద్యా స్థాయిల్లో ప్రమాణాలు పెంచాలి. అ భవిష్యత్తులో చైనా, భారత్‍లే ప్రపంచాన్ని శాసిస్తాయి. మన యువత ప్రపంచ దేశాల్లో తన ప్రతిభను చాటుకుంటోంది. చైనాతో పోలిస్తే మన వాళ్లకు ఆంగ్లం పెద్ద సమస్య కాదు. కాబట్టి మనకిదే మంచి అవకాశం.
Review గ్రౌండ్ జీరో టూ రియల్ హీరో.. సక్సెస్ అఫ్ వెంకటేశం.