చిదంబర రహస్యమేమిటో!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
తంజావూరు సత్రం
తంజావూరు రాజులు గొప్ప కళా పోషకులు. నిత్యం అన్నదానం చేసేవారు. ఆనాటి కాలంలో వారి రాజ్యానికి రాజధాని తంజావూరు నగరం. ఆ నగరానికి నిత్యం పెద్దసంఖ్యలో సందర్శకులు వస్తుండే వారు. నగరంలోని ఆలయాలను దర్శించుకోవడానికి వచ్చే సందర్శకులు కొందరైతే, రాజు గారి ఆశ్రయం పొందడానికి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలు మరికొందరు. మొత్తానికి రాజధాని తంజావూరుకు వివిధ పనులపై రోజూ వచ్చే బాటసారులకు అన్నపానీయాలకు లోటు రాకుండా ఉండటానికి తంజావూరు రాజులు సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ సత్రంలో ఉచితంగా మూడు పూటలా వేళకు భోజనం వడ్డించే వారు. బాటసారులు తలదాచుకోవడానికి వసతి సౌకర్యం కూడా కల్పించే వారు. సత్రంలో అందరూ భోజనం చేశాక గంట మోగించే వారు. సత్రంలోని గంట మోగిన తరువాతే రాజు గారు భోజనం చేసేవారట. వేళకు అన్నీ అమరుతున్న ఆ సత్రం కాలక్రమేణా బద్ధకస్తులకు నిలయంగా మారింది. పనీపాటా లేని బద్ధకస్తులు, సోమరిపోతులు అక్కడ ఆశ్రయం పొందుతుండే వారు. ఈ క్రమంలోనే పనిలేని వాళ్లను, పని చేయడానికి బద్ధకించే సోమరిపోతులు ఉన్న ఇళ్లను తంజావూరు సత్రంతో పోల్చడం మొదలైంది. కాల క్రమేణా అదే జాతీయంగా స్థిరపడిపోయింది.
చిదంబర రహస్యం
ప్రాచీన శైవ క్షేత్రాలలో తమిళనాడులోని చిదంబరం ఒకటి. చిదంబరంలో శివుడు నిరాకార స్వరూపుడిగా ఉంటాడు. ఇక్కడ శివుడు పార్వతీదేవితో కలిసి నాట్యరూపుడై, నటరాజ స్వరూపుడై నిత్యం తాండవం చేస్తుంటాడని అంటారు. ఈ ఆలయ గర్భగుడిలో శివుడు లింగ రూపంలో కనిపించడు. గర్భగుడిలో ఖాళీ స్థలం ఉంటుంది. ఖాళీ స్థలానికి ఒక తెర కప్పి ఉంచుతారు. దేవాలయంలోని ఆ ప్రదేశానికి ప్రధాన అర్చకుడికి తప్ప మరెవరికీ ప్రవేశం ఉండదు. ప్రధాన అర్చకుడు కొన్ని సందర్భాలలో తెరను తొలగించి చూపినప్పుడు ఆ తెర వెనుక బంగారు బిల్వ ప్రతాలు వేలాడుతూ కనిపిస్తాయట. భక్తుల మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ దర్శనంలోని మర్మం ఏమిటో మాత్రం అంతు చిక్కదు. ఏ విషయమైన దాని లోతుపాతులను తెలుసుకోవడానికి ఎవరికీ వీలు కాకపోయినా, వివరించడానికి వీలు లేకపోయినా దానిని చిదంబర రహస్యం అనడం పరిపాటిగా మారింది.
ఉత్సవ విగ్రహం
దేవాలయాలలో ఉండే దేవతా మూర్తులను మూల విరాట్లు అంటారు. సమాజంలో కొందరికి దేవాలయాలలో ప్రవేశం నిషిద్ధం. కొన్ని పర్వదినాల్లో ఉత్సవ సమయాలలో ప్రజలు అందరూ ఆ ఉత్సవాలను తిలకించడం కోసం దేవతా మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వెళ్లేవారు. మూల విరాట్టును దేవాలయంలో మంత్రోక్తంగా ప్రతిష్ఠించిన తరువాత ఆ విగ్రహాన్ని కదపడం నిషిద్ధం. కనుక ఉత్సవాల కోసం దేవతామూర్తులను కంచు, ఇత్తడి లోహాలతో తయారు చేయించి, వాటిని ఆయా మూర్తులకు సంబంధించిన వాహన రూపాలపై ఉరే గిస్తూ ఉంటారు. దేవాలయాలలో ఉత్సవ విగ్రహాలంటే ఇలాంటి ఊరేగింపులకు మాత్రమే పరిమితం అయ్యే విగ్రహాలు. వీటికి నిత్య పూజలు ఉండవు. గర్భగుడిలో ఉండే విగ్రహానికే నిత్య పూజలు జరుగుతాయి. ఉత్సవ విగ్రహాలు కేవలం ఊరేగడానికి మాత్రమే ఉపయోగ పడతాయి. ఈ అర్థంలోనే పెద్ద పెద్ద నాయకులను అనుసరించే అనుచరులను ఉత్సవ విగ్రహాలు అనడం పరిపాటైంది. పదవులలో ఉన్నా నిర్ణయాధికారాలు లేని అధికారులను కూడా ఉత్సవ విగ్రహాలతో పోలుస్తారు.

Review చిదంబర రహస్యమేమిటో!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top