వివాహం, గృహప్రవేశం, విద్యాభ్యాసం.. ఇలా ఏ శుభకార్యానికైనా తిథి వార నక్షత్రాలనే చూస్తాం. పుట్టిన నక్షత్రానికి ప్రస్తుత తిథి అనుకూలమో కాదో తెలుసుకుంటాం. హైందవ సంప్రదాయంలో మొక్క నాటడం దగ్గర్నుంచి దూర ప్రయాణం వరకూ తిథులు పాటిస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది తిథులకు. చాంద్రమానం ప్రకారం తిథి వార నక్షత్ర కరణ యోగాలు కాలానికీ, కాలగమనానికీ సహకరించే పంచాంగాలు. రోజులో 16 నుంచి 19 గంటల పాటు సాగే సమయాన్ని తిథి అంటారు. ఈ పదహారు తిథులూ.. పదహారు కళలకు నిలయాలు. ఒక్కో తిథికి ఒక్కో విశేషం ఉంది. దేని ప్రత్యేకత దానిదే. ఒక్కో తిథికి ఒక్కో దేవత అధిదేవతగా నిలిచి, సంచార ఫలాలను అందచేస్తూ లోకాన్ని సర్వదా రక్షిస్తోంది. ఈ కారణంగానే శుభ ముహూర్తాలకు, ముహూర్తం బలంగా ఉండటానికి తిథులనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో మనకు నెలలో వచ్చే పదహారు (16) తిథుల ప్రాముఖ్యతను, ఆయా తిథి కాలాలు ఏయే దేవతల పూజాధికాలకు అనుకూలమో తెలుసుకుందాం.
పాడ్యమి:
ఇది మొదటి తిథి. దీనికి ప్రతిపత్తు అని మరో పేరు. పాడ్యమి నాటి పూజ ఇహపర సౌఖ్యాలను అందిస్తుంది. పాడ్యమికి అధిదేవత అయిన అగ్నిదేవుడిని ఈ తిథి నాడు పూజించాలి. ముఖ్యంగా మార్గశిర పాడ్యమి నాడు విధిగా అగ్నిదేవుడిని ఆరాధించాలి. చైత్ర శుద్ధ పాడ్యమి కూడా విశిష్టమే. ఆ రోజే ఉగాది పర్వదినం. పాడ్యమి బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టం. అందుకే ఈ తిథి నాడు బ్రహ్మదేవుడిని కూడా పూజించాలి. దేవీ నవరాత్రులు ఆరంభమయ్యే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున ఆదిపరాశక్తిని ఆరాధిస్తాం.
విదియ:
ఇది లక్ష్మీనారాయణులను, అశ్వినీ దేవతలను పూజించే తిథి. దీనికి అశ్వినీ దేవతలు అధి దేవతలు. కార్తీక శుద్ధ విదియ భగినీ హస్త భోజన పర్వదినం. సోదరుడైన యమధర్మరాజును యమునా దేవి ఇంటికి పిలిచి వండిపెట్టి వరాలు పొందింది. అన్నదమ్ములకు ప్రేమగా తినిపించి, వారి ఆత్మీయతను పొందుతున్న రాఖీ సంప్రదాయం అలా ఏర్పడినదే. విదియ నాడు మృత్యుభయ నివారణకు యమదేవుడిని పూజిస్తారు. ఈరోజు చేసే పూజ ఆయురారోగ్యాలను ఇస్తుంది.
తదియ:
దీనికి అధి దేవత గౌరీదేవి. చైత్ర శుక్ల తదియ పరమశివుడు పార్వతీదేవిని వివాహమాడిన రోజు. ఆ రోజు అర్థనారీశ్వర రూపాన్ని ఆరాధిస్తారు. అట్ల తదియ, ఉండ్రాళ్ల తదియ, అక్షయ తృతీయలు విశిష్ట దినాలు. తదియ నాటి పూజ సౌభాగ్యాన్నిస్తుంది.
చవితి:
ఇది గణేశుడికి ప్రీతికరమైన తిథి. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. ఆ రోజు చేసే పూజ సిద్ధిని, బుద్ధిని ఇస్తుంది. ప్రతి మాసంలో బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు. ఇది కష్టాలను తొలగిస్తుందని నమ్ముతారు. కార్తీక చవితి నాగుల చవితి పర్వదినం. ఈ తిథికి అధిదేవత విఘ్నాలను తొలగించే వినాయకుడు.
పంచమి:
ఈ తిథిని శ్రీ తిథి అని కూడా అంటారు. సకల దేవతలకూ ఈ తిథి ప్రీతికరమైనది. ఈ రోజు ఏ దేవతను పూజించినా విద్య, ఆయుష్షు అందుతాయి. నాగపంచమి, రుషి పంచమి పర్వదినాలు ప్రసిద్ధి. పంచమి తిథికి అధిదేవత నాగదేవత. అంటే ఆదిశేషుడు.
షష్ఠి:
ఇది షణ్ముఖుడికి చాలా ఇష్టమైన తిథి. కుమార షష్ఠి మహా పర్వదినం. షష్ఠి రోజు చేసే పూజ ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ తిథికి అధిదేవత కుమారస్వామి.
సప్తమి:
సప్తాశ్వాల రథాన్ని అధిరోహించిన సూర్యదేవుడు ఈ తిథికి అధిదేవత. సప్తమి నాడు చేసే పూజ సకల పాపాలనూ పోగొడుతుంది. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం శ్రేష్ఠం. అలాగే సరస్వతీదేవిని పూజిస్తే కోరిన విద్య లభిస్తుంది.
అష్టమి:
శ్రావణ బహుళాష్టమి శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినం. ఆదిపరాశక్తి- యోగమాయాదేవి రూపంలో యశోదమ్మకు జన్మించింది ఈ తిథి నాడే. శ్రీకృష్ణాష్టమి, దుర్గాష్టమి వంటివి పర్వదినాలు. అష్టమి రోజున ఏ దేవతను పూజించినా మోక్షం తథ్యమని అంటారు. ఈ తిథికి అష్టమాతృకలైన బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి అధిదేవతలు.
నవమి:
చైత్ర శుద్ధ నవమి శ్రీరామచంద్రుని జన్మదినం. మహర్నవమి, శ్రీరామ నవమి వంటి పర్వదినాలు ఈ తిథి కాలంలోనే వస్తాయి. నవమి రోజు చేసే పూజ మోక్షాన్నిస్తుంది. ఈ తిథికి అధిదేవత దుర్గాదేవి.
దశమి:
సర్వ జగాలకూ సకల విజయాలను ప్రసాదించే మహా తిథి ఇది. సాక్షాత్తూ జగన్మాతకే విజయాన్ని కలుగచేసిన రోజు విజయదశమి. అందుకే అపరాజిత అయిన ఆదిపరాశక్తిని ఈ రోజున పూజించాలి. దశమి నాటి పూజ శక్తిని ప్రసాదిస్తుంది. ఈ తిథికి ఇంద్రాది దశ దిక్పాలకులు అధిదేవతలు.
ఏకాదశి:
ఏకాదశి విష్ణువు నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహా విష్ణువు ఉత్తర ద్వార దర్శనంతో వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి మహాపర్వదినం. ఏకాదశి తిథికి అధిదేవత కుబేరుడు. ఈ రోజు విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనది.
ద్వాదశి:
ఇది వామన, త్రివిక్రమ మూర్తులకు, లక్ష్మికి ప్రతిరూపమైన తులసిమాతకు ఇష్టమైన తిథి. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ రోజు తులసీ నారాయణులకు (తులసి కొమ్మకు, ఉసిరిక కొమ్మకు) కల్యాణం చేసి పూజిస్తారు. ద్వాదశి రోజున చేసే పూజతో ఇహలోకంలో భుక్తి, పరలోకంలో ముక్తి ప్రాప్తిస్తాయి. ఈ తిథికి అధిదేవత విష్ణువు.
తయ్రోదశి:
ఈ తిథి శివకేశవులకూ, శనిదేవుడికీ ప్రీతికరమైనది. శనివారం నడు త్రయోదశి తిథి కలిస్తే అది విశిష్ట దినమవుతుంది. ఆ రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేసి, అనుగ్రహం పొందుతారు. త్రయోదశి రోజు చేసే పూజ ఇహలోక సౌఖ్యాన్నిస్తుంది. ఈ తిథికి అధిదేవత ధర్ముడు.
చతుర్దశి:
శివకేశవులకు ఇష్టమైన తిథి ఇది. లోక కంటకుడైన నరకాసురుడిని సంహరించి విశ్వ శ్రేయస్సు చేకూర్చింది ఈ రోజే. చతుర్దశి నాడు చేసే పూజ ఆనందాన్ని అందిస్తుంది. ఈ తిథికి అధిదేవత రుద్రుడు.
అమావాస్య:
శివుడికి ఇష్టమైన తిథి ఇది. నరకాసురుడిని వధించిన ఆనందంతో వేడుక చేసుకునే దీపావళి పర్వదినం ఆశ్వయుజ అమావాస్య నాడే. శుభ, అశుభ కర్మలకు అమావాస్య పెట్టింది పేరు. పితృదేవతలకు ప్రీతిని కలిగించేది మహాలయ అమావాస్య. ఈ రోజు చేసే పూజ కైలాసప్రాప్తిని కలిగిస్తుంది. ఈ తిథికి అధి దేవతలు పితృదేవతలు.
పూర్ణిమ:
వరాహమూర్తి, భూదేవి, సావిత్రీ మాతలకు ప్రియమైన తిథి ఇది. వైశాఖ పూర్ణిమ, గురుపూర్ణిమ, శ్రావణ పూర్ణిమ (రాఖీ), కార్తీక పూర్ణిమలు ముఖ్య పర్వదినాలు. పూర్ణిమ నాడు చేసే పూజ విద్య, వినయ, శక్తి, ధైర్య సౌభాగ్యాలను ఇస్తుంది. ఈ తిథికి అధిదేవత చల్లదనాల చంద్రుడు.
ఆయా తిథులకు ప్రత్యేకత, విశిష్టత ఉన్నప్పటికీ నిజానికి ప్రతి రోజూ పర్వదినమే. తిథి పేరు ఏదైనా పూజా విధానం వేరైనా ఆరాధించేది కాల స్వరూపుడినే. తిథి కాలానుగుణం. కాలం భగవదనుసరణం. కాలమే భగవంతుడు.































































































































































































































































































































































































Review తిథి.. పుణ్యాల పరమా‘విధి’.