తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజుకు అంత ప్రాధాన్యమెందుకు?

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన రోజు ఏది? ముఖ్యంగా ఐదవ రోజుకే ఎక్కువ ప్రాధాన్యమని చెబుతారు? కారణం ఏమిటి?

తిరుమల శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజులూ ప్రాధాన్యమైనవే. తొమ్మిది రోజులూ భక్తులకు నయనానందకరమే. అయితే ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో ఐదవ రోజును మాత్రం చాలా ప్రాధాన్యమైనదిగా భావిస్తారు. అందుకు కారణం ఉంది. తొమ్మిది రోజుల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు అత్యంత ప్రధానమైనది. ఆ రోజు గరుడ సేవ జరగడమే అందుకు కారణం. గరుత్మంతుడు స్వామి వారి నిత్య వాహనం. గరుడ సేవలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సేవల్లో కొత్త గొడుగులు ఉపయోగిస్తారు. వీటిని ఆనాటికి తిరుమల చేరుకునే విధంగా చెన్నై నుంచి కాలినడకన తీసుకువస్తారు. సాయంత్రం మాడవీధుల్లో వీటిని ఊరేగించి, తర్వాత వాహన సేవలో వాడతారు.
శ్రీవిల్లిపుత్తూరు (తమిళనాడు) క్షేత్రంలో గోదాదేవికి అలంకరించిన పుష్పమాలికలు తీసుకువచ్చి స్వామి వారికి అలంకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టువస్త్రాలు స్వామి వారికి ధరింపచేస్తారు. అంతేకాకుండా, ఆనంద నిలయంలో కొలువుదీరి ఉన్న శ్రీవారి మూలవిరాట్టుకు విశేషమైన నగలను అలంకరిస్తారు. ఐదో నాటి ఉదయం పల్లకీ ఉత్సవం జరుగుతుంది. మోహినీ అవతారాన్ని ధరించిన స్వామి పల్లకీలో ఊరేగుతాడు. పక్కనే మరో పల్లకీలో శ్రీకృష్ణుడు ఊరేగుతాడు. పల్లకీ ఉత్సవం ఆలయం నుంచి ప్రారంభం కావడం విశేషం.
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైనది ఐదో రోజు ఎందుకంటే అందుకు మరో కారణం కూడా ఉంది. ఆ రోజు ఉత్సవాల్లో భాగంగా ఉదయం మోహినీ అవతారంలో స్వామి వారు భక్తజనానికి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహనపరిచి, క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. ఈ అవతార సందర్శనం వల్ల మాయా మోహాలన్నీ తొలగిపోతాయి.
సాలకట్ల బ్రహ్మోత్సవాలంటే..?
అధికమాసం వచ్చిన ప్రతి సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు రెండుసార్లు నిర్వహిస్తారు. భాద్రపదంలో వార్షిక లేదా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో దసరా సమయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది (2022) అధికమాసం లేదు కాబట్టి నవరాత్రి బ్రహ్మోత్సవాలనే నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మొత్సవాలను ఏటా దసరాను పురస్కరించుకుని జరిగేవి. సాధారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మాత్రమే అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.

బహ్మోత్సవ వైభవం

2022, సోమవారం, సెప్టెంబరు 26 నుంచి బుధవారం, అక్టోబరు 5 వరకు

తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అంటారు? ఎందుకు?

శ్రీవారి బ్రహ్మోత్సవాలతో పాటు దాదాపు అన్ని సేవల్లోనూ స్వామి వారి ఉత్సవమూర్తి మలయప్ప స్వామే పాల్గొంటాడు. వాస్తవానికి వేంకటేశ్వరుడికి ఉత్సవమూర్తులు నలుగురు ఉన్నారు. భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామి. 1339 సంవత్సరంలోని శాసనం ప్రకారం ఉత్సవమూర్తిగా శ్రీదేవి, భూదేవితో కూడిన ఉగ్ర శ్రీనివాసమూర్తి పాల్గొనే వాడు. అయితే 14వ శతాబ్దంలో ఒకానొక సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగుతూ ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి ఇళ్లన్నీ తగులబడ్డాయి. తర్వాత తిరుమల పర్వతాలలోని ‘మలయప్ప కోన’లో లభించిన విగ్రహాలను స్వామి వారి ఉత్సవమూర్తిగా నిర్ణయించారు. అప్పటి నుంచి వేంకటేశుడి ప్రతినిధిగా మలయప్ప స్వామే అన్ని సేవల్లో పాల్గొనడం ఆనవాయితీగా మారింది.
శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ ప్రతినిధి అయిన మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతాడు. ఈ సందర్భంగా వివిధ రూపాలను ధరించే స్వామి కొన్ని వాహనాల్లో ఒక్కడే తరలివస్తాడు. మరికొన్నిటిలో ఇరు దేవేరులతో కలిసి అనుగ్రహిస్తాడు.
చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, మోహినీ అవతారంలో పల్లకీలో, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చందప్రభ, అశ్వ వాహనాలపై మలయప్ప స్వామి ఒక్కరే వస్తారు. పెద్ద శేష వాహనం, ముత్యాలపందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనంతో పాటు స్వర్ణ రథోత్సవం, పెద్ద రథోత్సవంలో దేవేరులతో కలిసి వేంచేస్తాడు. స్వామి హంస వాహనంపై సరస్వతీ రూపంలో తరలివస్తాడు.

Review తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజుకు అంత ప్రాధాన్యమెందుకు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top