
జాతక కథలు రెండు రకాలని చెప్పుకున్నాం కదా.. అవి- వర్తమాన కథలు, అతీత కథలు.
అందుకు ఒక ఉదాహరణ..
ఒకనాడు అనాథ పిండక శ్రేష్ఠి జేతవనంలో ఉన్న బుద్ధుడి వద్దకు వచ్చి తన మిత్రులు కొందరు బుద్ధుడు బోధించిన మార్గం విడిచి వేరే మార్గంలోకి వెళ్లారన్న విషయం చెబుతాడు. ఇది వర్తమాన కథ. ఈ వర్తమాన కథను పురస్కరించుకుని బుద్ధుడు ఆ సందర్భంలో తన ఒకనాటి పూర్వజన్మలో జరిగిన సంఘటన గురించి చెబుతాడు. అది అతీత కథ. ఆ కథ ప్రకారం.. ఆ జన్మలో బుద్ధుడు వర్తకుడు. తన కంటే ముందు బయల్దేరి వెళ్లిన మరో వర్తకుడు దారిలో కనిపించిన యక్షుడి మాయమాటలు నమ్మి.. తన దగ్గరున్న నీరంతా పారబోయిస్తాడు ఫలితంగా అనుచరులతో సహా యక్షులకు ఆహారం అవుతాడు. ఆ వెనుకే వచ్చిన మరో వర్తకుడు యక్షుడి మాటలు నమ్మకుండా బతికి బయటపడతాడు. ఇది చెప్పి ధర్మోపదేశం చేసిన బుద్ధుడు ఇలా అంటాడు-
‘అప్పటి తెలివి గల వర్తకుడిని నేనే. మూర్ఖ వర్తకుడు దేవదత్తుడు’. ఇలాంటి కథా నిర్మాణం అన్ని జాతక కథల్లోనూ కనిపిస్తుంది.
ఒకడు తన గాడిద మీద సింహం తోలు కప్పి పంట పొలాల్లోకి విడిచి పెట్టేవాడు. మొదట్లో దానిని చూసి ఊరి వాళ్లంతా భయపడేవారు. అయితే, అది ఓండ్ర పెట్టడం చూసి వెంటపడి దాన్ని కర్రలతో కొట్టి చంపుతారు.
రెండు కొంగలు కర్రపుల్లను నోట కరుచుకుని, దాన్ని పట్టుకుని ఉన్న తాబేలుతో సహా పైకి లేచి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుంటాయి. కింద నుంచి ఇది చూసిన కొందరు కొంటె పిల్లలు హేళన చేస్తూ తాబేలును ఆటపట్టిస్తారు. కొంగలు ఎంత వారించినా వినకుండా తాబేలు.. పిల్లలతో వాదించడానికి నోరు తెరుస్తుంది. నోరు తెరవడం వల్ల కర్రపుల్ల నుంచి జారి కిందపడి మరణిస్తుంది. ఇలాంటి కథ ఒకటి పంచత్రంత్రం కథల్లోనూ కనిపిస్తుంది. ఈసప్ కథల్లో కూడా ఇలాంటిదే ఒక కథ ఉంది.
Review తెలివైన వర్తకుడు.. తెలివితక్కువ తాబేలు.