ధర్మార్థ కామమోక్షాలను చతుర్విధ పురుషార్థాలని అంటారు. ఇవన్నీ మానవుడు సాధించాల్సినవి. ఇందులో కామం కూడా ఒకటి. మరోవైపు కామక్రోధమోహలోభమదమాత్సర్యాలను అరిషడ్వర్గాలుగా చెప్పారు. అంటే ఇవి మనకు శత్రుకూటమి వంటివన్న మాట. ఈ కూటమికి నాయకత్వం వహించేది కూడా కామమే. మరోవైపు తనకు గల విభూతుల్లో కామం ఒకటిగా భగవానుడు పేర్కొన్నాడు. మరి కామంపై అభిప్రాయాల్లో ఎందుకింత విభిన్నత అంటే.. ఇక్కడ మనం ధర్మకామాన్ని గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ధర్మాన్ని అనుసరించిన కామం ఎప్పుడూ వాంఛింపదగినదే. అదే అధర్మంతో కలిస్తే అది మనిషి పాలిట శత్రువు అవుతుంది. కాబట్టి అటువంటి కామాన్ని విసర్జించాలని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. మనకు కుమార సంభవంలో కనిపించేది కూడా అదే.
పార్వతీదేవిని వివాహం చేసుకోవాలనే కోరికను శివుడికి కల్పించాలనే లక్ష్యంతో మన్మథుడు శివుడిపై తన బాణాలను ప్రయోగిస్తాడు. దీంతో ఆగ్రహించిన శివుడు తన మూడోకన్ను తెలిని మన్మథుడిని భస్మం చేస్తాడు. తన భర్త మరణానికి దు:ఖిస్తూ మన్మథుడి భార్య రతీదేవి శివుడిని ప్రార్థిస్తుంది. కరుణించిన శివుడు అతనిని బతికించి, కేవలం మన్మథుడి భార్య రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చి, ఆమెలో వసంతాన్ని చిగురింపచేస్తాడు. తీవ్ర తపస్సులో మునిగి ఉన్న శివుడిపైకి మన్మథ బాణాలు సంధించడం అవాంఛనీయం. ఆయన మనసుపై జరిగిన దాడి అది. అందుకే పరమేశ్వరుడు కామానికి ప్రతీక అయిన మన్మథుడిని తన చూపుల వేడితో భస్మం చేస్తాడు. అదే సమయంలో పునరుత్పత్తికి, తద్వారా సృష్టికి కారణమై లోకానికి అత్యంత ఆవశ్యకమైన మన్మథుడికి కరుణించి కాపాడాడు. అందరిలో కామపరమైన ఆలోచనలు కలిగించే వాడు కాబట్టే మన్మథుడికి కాముడనే పేరు కూడా ఉంది. కాముడు దహనమైన రోజు కాబట్టి ఈ రోజుకు ‘కామదహనం’ అనే పేరు వ్యావహారికంలోకి వచ్చింది. ఆ రోజునే హోలీ పర్వాన్ని ఆచరిస్తారని చెబుతారు. ఇక్కడ ధర్మకామం మాత్రమే అనుసరణీయని చెప్పడమే హోలీ పండుగలో ఇమిడి ఉన్న సందేశం.
‘నవ’వర్ణాలు
రంగు రాళ్లు.. రంగు వస్త్రాలు
మనిషి నడవడిక, ఆలోచన, వ్యవహారం, దైనందిన జీవితం, భవిష్యత్తు అంతా ఆయా గ్రహాల సంచారం మీదనే ఆధారపడి ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అందుకే, నవగ్రహాల ఆరాధన, జపం, దానాలు తప్పనిసరిగా చేయాలని ఆ శాస్త్రం చెబుతోంది. వీటితోపాటు ప్రత్యేకంగా ఆయా గ్రహాలకు ప్రతీకలుగా కొన్ని రంగులను కూడా పేర్కొంది. పూజా సమయంలో ఏ గ్రహానికి అర్చన చేస్తున్నామో దానికి సంబంధించిన రంగు వస్త్రాన్ని ధరించాలని పండితులు చెబుతారు. దీనివల్ల ఆ గ్రహాధిదేవతకు తృప్తి కలుగుతుంది. ఆయా గ్రహాలకు సంబంధించిన రంగుల్లో ఉండే ముత్యం, వజ్రం, కెంపు, పగడం వంటి రత్నాలను ఉంగరాల్లో ధరించాలని కూడా జ్యోతిష్కులు చెబుతారు. ఇవన్నీ ఆయా రంగులతో ముడిపడి ఉన్న భావనలను ఆ వ్యక్తి మనసులో తీవ్రతరం చేయడం లేదా మందగింప చేయడం కోసం ఉద్దేశించినవే.
సూర్యుడు ఎరుపు
చంద్రుడు తెలుపు
కుజుడు ఎరుపు
బుధుడు ఆకుపచ్చ
గురుడు పసుపు
శుక్రుడు తెలుపు
శని నలుపు
రాహువు తేనె రంగులో ఉండే నలుపు
కేతువు చిత్రవర్ణ
ఆ ఐదు బాణాలు ఐదు పుష్పాలు
మన్మథుడు అంటే మనసును మధించేవాడని అర్థం. ఆయన మహా విష్ణువుకు మానసపుత్రుడు. చెరుకుగడను విల్లుగా ఉపయోగిస్తాడు. అరవిందం (తామరపువ్వు), అశోకం (అశోక వృక్షం పువ్వు), చూతం (మామిడిపువ్వు), నవమల్లిక (అప్పుడే విరిసిన మల్లెపువ్వు), నీలోత్పలం (నల్ల కలువ) అనే అయిదు పుష్పాలు ఆయన వాడే బాణాలు.
సుఖభోగాల లాలసలో పడి..
భక్తి అనే అగ్నిలో లౌకిక సుఖభోగాలనే అవివేకాన్ని దగ్ధం చేయడానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందనే సందేశాన్నిచ్చే కథ ఒకటి వ్యాప్తిలో ఉంది. ఇదీ ఆ కథ సారాంశం.
ఉజ్జయినీ నగరంలో నివసించే వసంతిక అనే యువతి అప్సరసలను మించిన సౌందర్యవతి. యుక్త వయసు రాగానే ఆమెతో పోటీపడే అందగాడైన వరుడితో వివాహం జరిపిస్తారు తల్లిదండ్రులు. మితిమీరిన సౌందర్య గర్వంలో భర్తతో సుఖభోగాలను అనుభవిస్తూ, వంశపారంపర్యంగా వచ్చే శివపూజను విస్మరిస్తుంది వసంతిక. తల్లిదండ్రులు ఈ విషయమై ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె పెడచెవిన పెడుతుంది. పరమేశ్వరుడే ఆమెకు కపువిప్పు కలిగించాలని ఆ తల్లిదండ్రులు ప్రార్థిస్తారు. దీంతో వసంతికకు జ్ఞానోదయం కలిగించడానికి పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో వసంతిక ఇంటికి వస్తారు. తాను ఊరు వెళ్తున్నానని, తిరిగి వచ్చే వరకు వృద్ధుడైన తన భర్తను జాగ్రత్తగా చూడాలని వసంతికను అడుగుతుంది వృద్ధురాలి రూపంలో ఉన్న పార్వతీ దేవి. సరేనంటుంది వసంతిక.
కానీ, తన దైనందిన సుఖభోగాల విషయంలో పడి వసంతిక వృద్ధుడి విషయం మరిచిపోతుంది. సరిగ్గా వృద్ధురాలు వచ్చే సరికి వృద్ధుడు మరణిస్తాడు. సుఖభోగాల్లో తేలుతూ తన భర్తను పట్టించుకోకపోవడం వల్లే తన భర్త మరణించాడని, ఇందుకు వసంతికే బాధ్యత వహించాలని అంటుంది వృద్ధురాలు. తన వల్లే పొరపాటు జరిగిందని అంగీకరించిన వసంతిక, జరిగిన దానికి చింతిస్తూ చితిని పేర్చుకుని అందులో దహనం అయ్యేందుకు సిద్ధపడుతుంది. ఆమెలో వచ్చిన మార్పును గమనించిన పార్వతీ పరమేశ్వరులు నిజరూపంతో సాక్షాత్కరించి, ఆమె పేర్చుకున్న చితిని పూలపాన్పుగా మారుస్తారు. సుఖభోగాలు అనుభవించాల్సిందే కానీ, ఆ మాయలో పడి దైవపూజను విస్మరించడం తగదని, క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన దైవ పథాన్ని వదులుకోవడం అవివేకమని వసంతికకు హితబోధ చేస్తారు ఆది దంపతులు. తన తప్పును మన్నించాలని ప్రార్థించిన వసంతికను ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరులు అంతర్థానమవుతారు.
హోలిక రాక్షసి వృత్తాంతం
హోలిక అనే రాక్షసి దహనమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని హేమాద్రికాండం, భవిష్యత్తు పురాణం, ధర్మసింధు, నిర్ణయసింధు అనే గ్రంథాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం.. హిరణ్యకశిపుడి సోదరి హోలిక. కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పరాయణుడు కావడంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు అతడిని ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు అటువంటి ప్రయత్నాలన్నిటినీ అధిగమించి క్షేమంగా ఉంటాడు. చివరకు హిరణ్యకశిపుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల అతడి సోదరి హోలికకు ఓ పై వస్త్రం లభిస్తుంది. ఎంతటి భయంకరమైన అగ్ని అయినా ఆ వస్త్రం ధరించిన వారిని ఏమీ చేయదు. హోలికను ఆ వస్త్రాన్ని ధరించాలని చెప్పి, ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టి, తన భటుల చేత నిప్పు అంటింపచేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ చేత హోలిక కప్పుకున్న ఆ మాయా వస్త్రం గాలికి ఎగిరిపోయి, చివరికి ఆ మంటల్లో ఆమే దగ్ధమవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈ విధంగా హోలిక దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు.
దైవభక్తి ముందు ఎటువంటి మాయోపాయాలు పనిచేయవని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడి, వారికి అన్నివేళలా భగవంతుడు రక్షగా ఉంటాడనే సందేశాన్ని ఈ వృత్తాంతం తెలియ చెబుతుంది.
Review ధర్మకామమే ఆచరణీయం.