ఆంధప్రదేశ్‍లోని అన్నమయ్య జిల్లా నందలూరులో బహుదా నదీ తీరాన కొలువుదీరాడు సౌమ్యనాథస్వామి. ఇది అతి పురాతన ఆలయం. గర్భాలయంలో స్వామి వారి విగ్రహం ఏడడుగుల ఎత్తున ఉంటుంది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య ఇక్కడే కొంతకాలం ఉండి పలు సంకీర్తనలు రచించినట్టు చరిత్ర చెబుతోంది. చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గాలి గోపురం నిర్మించాడు. అనంతరం పాండ్య రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారని వివిధ శాసనాల ద్వారా తెలుస్తోంది.
శ్రీమహావిష్ణువు భూలోకంలో అనేక రూపాలలో, వివిధ నామాలతో కొలువుదీరాడు. వెలసిన ప్రతిచోటా కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు. అలాంటి క్షేత్రాలలో అతి పురాతనమైనది ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయం. నందనందనుడు వెలసిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం ఉన్న ఊరికి నందలూరు అనే పేరు వచ్చిందని అంటారు. అద్భుతమైన శిల్పకళకు ఆటపట్టయిన ఈ క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది.
నూట ఎనిమిది (108) స్తంభాలపైన ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. స్తంభాలపైన పురాణ ఘట్టాలను, నాటి ప్రజల జీవనశైలిని, చిత్రవిచిత్రమైన జంతువులను, ఆంజనేయ, గరుడ రూపాలను జీవం ఉట్టిపడేలా చిత్రించారు. గర్భాలయ వెలుపలి గోడలలో నిలిపిన గణేశ, ఆదిశేష విగ్రహాలు నేత్రపర్వం చేస్తాయి. ముఖమండపం నుంచి కొద్దిగా ఎత్తులో ఉన్న గర్భాలయానికి వెళ్లడానికి సోపాన మార్గం ఉంది. ఈ మార్గానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు ఉంటాయి. మండపద్వారం వద్ద నుంచే సౌమ్యనాథస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకోవచ్చు.
తూర్పు గోపురం నుంచి ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే ఈశాన్యంలో పుష్కరిణి, రాతిస్తంభం, ధ్వజస్తంభం, గరుడాళ్వార్ సన్నిధి, పక్కనే ఉన్న మండపంలో ఆంజనేయస్వామి సన్నిధి ఉంటాయి. పూర్తిగా ఎర్రరాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రాన్ని తిరువణ్ణామలై (అరుణాచలం)లో ఉన్న అరుణాచలేశ్వరస్వామి ఆలయానికి ప్రతిరూపంగా చెబుతారు.
ఈ క్షేత్రానికి పౌరాణిక గాథ కూడా ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామిలో ఉగ్రత్వం తగ్గలేదు. అనంతరం లక్ష్మీదేవి చెంచులక్ష్మి రూపంలో స్వామి చెంతన చేరడంతో ఆయన సౌమ్యుడయ్యాడట. అందుకే ఇక్కడ వెలసిన స్వామికి సౌమ్యనాథుడనే పేరు వచ్చింది. ఈ క్షేత్రం చెంతనే బాహుదా నది ఉంది. దీనినే స్థానికులు ‘చెయ్యేరు’గా వ్యవహరిస్తారు. ఈ నది గురించి అనేక పురాణాలలో ప్రస్తావన ఉంది. నారద మహర్షి స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనే కథ కూడా స్థానికంగా ప్రచారంలో ఉంది. నారదుడు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా, దేవతలే ఆలయాన్ని నిర్మించారని, కాలక్రమంలో అది శిథిలమైపోగా, దాని మీదే ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ ఆలయ స్తంభాలకు సింహపు తలలు పైన కాకుండా కింద ఉండటం విశేషం.
నలువైపులా నాలుగు గోపురాలతో, దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మితమైంది. పదకొండవ శతాబ్దంలో కులోత్తుంగ చోళరాజు ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని శాసనాలను బట్టి తెలుస్తోంది. తదనంతరం ఈ ప్రాంతం పాండ్య, కాకతీయ, విజయనగర రాజుల ఏలుబడిలోకి వచ్చింది. ఆయా వంశాల రాజులు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. చివరకు 17వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయినట్టు శాసనాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలోని ప్రధాన విశేషం ఏమిటంటే, గర్భాలయంలో విద్యుత్ దీపాలు ఉండవు. అయినా సౌమ్యనాథుడు తన దివ్యకాంతులతో భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే సూర్యకాంతిలో స్వయం ప్రకాశమై వెలుగొందుతుంటుంది మూల విరాట్టు.
అలాగే, మరో విశేషం ఏమిటంటే- కలియుగ వైకుంఠంగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఈ స్వామి విగ్రహం ప్రతిరూపంగా కానవస్తుంది. అయితే ఏడడుగుల ఈ స్వామి అభయహస్తంతో ఉంటాడు. తిరుమలలో వేంకటేశ్వరుడు వరదహస్తంతో దర్శనమిస్తాడు. అదొక్కటే రెండు విగ్రహాలకు తేడా.
ఆలయం పై కప్పుపైన ఒక పెద్ద మీనం (చేప) ఆకారం చెక్కి ఉంటుంది. కలియుగం ముగిసిపోయే సమయంలో జలప్రళయం ముంచెత్తుతుందని, ఆ సమయంలో ఈ మీనం ప్రాణం పోసుకుని ఈదుకుంటూ వెళ్తుందని స్థానికులు చెబుతారు. ఆలయంలో ఎక్కువగా తమిళ శాసనాలే చెక్కి ఉన్నాయి. తెలుగులో కొన్ని మాత్రమే ఉంటాయి. బహుశా చోళ, పాండ్య రాజులు ఆలయ పునర్నిర్మాణానికి ఇతోధికంగా పాటుపడినందున ఆ రాజులు వేసిన శాసనాలే ఇవి అయ్యుంటాయని అంటారు. వివిధ రాజవంశాల రాజులు స్వామికి సమర్పించిన కైంకర్యాలు, కానుకల వివరాలు ఆయా శాసనాల్లో చెక్కబడి ఉన్నాయి. కాకతీయ ప్రతాపరుద్రుడు గాలి గోపురం నిర్మించి వంద ఎకరాల మాన్యం ఆలయ నిర్వహణకు ఇచ్చినట్టు ఒక శాసనం చెబుతోంది. అలాగే, నందలూరుకు సమీపంలోని పొత్తపి ప్రాంతాన్ని పాలించిన తిరువేంగళనాథుని సతీమణి చెన్నమరాణి సౌమ్యనాథుడికి బంగారు కిరీటం, శంఖుచక్రాలు, మరెన్నో వెలకట్టలేని స్వర్ణాభరణాలను సమర్పించుకున్నట్టు మరికొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది.
ఈ క్షేత్రంలో తొమ్మిది (9) ప్రదక్షిణాల సంప్రదాయం ఉంది. బలమైన నమ్మకంతో, గట్టి సంకల్పంతో ‘ఓం శ్రీ సౌమ్యనాథాయ నమ:’ అనే దివ్య నామాన్ని స్మరిస్తూ గర్భాలయం చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే మనోభీష్టాలు నెరవేరుతాయనే విశ్వాసం ఇక్కడ తరతరాలుగా కొనసాగుతోంది. భక్తుల కోరిక నెరవేరిన వారం రోజులలో తిరిగి వచ్చి ఈసారి నూట ఎనిమిది (108) ప్రదక్షిణలు చేయాలని అంటారు. సంతానం లేని దంపతులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు చాలాకాలం పాటు నందలూరులోని సౌమ్యనాథుని సేవలో గడిపారని, ఆ కాలంలో పలు సంకీర్తనలు రచించారని, తన కీర్తనలతో స్వామిని ప్రస్తుతించారని ఆయా శాసనాలను బట్టి తెలుస్తోంది.
నారద మహర్షి స్వయంగా స్వామిని ప్రతిష్ఠించగా, దేవతలు ఆలయాన్ని నిర్మించారని, ఈ శుభ సందర్భాన్ని పురస్కరిచుకుని బ్రహ్మదేవుడు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడని అంటారు. అందుకే స్వామికి నిర్వహించే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో శ్రవణా నక్షత్రం నాడు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. ఆలయం వెలుపల మరో కోనేరు ఉంది. అక్కడ తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.
ప్రతి నిత్యం ఉదయం ఆరు (6) గంటల నుంచి పన్నెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం నాలుగు (4) గంటల నుంచి రాత్రి ఎనిమిది (8) గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. నిత్య పూజలు ఈ ఆలయంలో ఎంతో నియమంగా జరుగుతుంటాయి. అష్టమి, నవమి తిథులలో, ధనుర్మాసంలో విశేష పూజలు నిర్వహిస్తుంటారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి బస్సు, విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గంలో చేరుకోవడం సులభం. కడప నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. బస్సులు, ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంటాయి.





































































































































































































































































































































































Review నందలూరు సౌమ్యనాథుడు.