నసీరుద్దీన్ కొడుకు

నసీరుద్దీన్‍… ఈ పేరు విన్నారా? మన తెనాలి రామకృష్ణుడి మాదిరిగానే నసీరుద్దీన్‍ కూడా మంచి చమత్కారి. హాస్యకారుడు. భారతీయ బాల సాహిత్యంలో నసీరుద్దీన్‍ కథలది చెరగని ముద్ర. పిల్లలు నసీరుద్దీన్‍ కథలు చదవడానికి, వినడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఆ చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా పంచతంత్రం కధలు, కాశీమజిలీ కథలు, మర్యాదరామన్న కథలు.. పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పడానికి ‘తెలుగు పత్రిక’ సిద్ధంగా ఉంది. ప్రతి మాసం ఒక్కో నీతి కథ.. పిల్లలూ సిద్ధమేనా?
నసీరుద్దీన్‍ – కొడుకు
ఒకసారి తైమూర్‍కి నసీరుద్దీన్‍లాగే నసీరుద్దీన్‍ కొడుకు కూడా తెలివైన వాడో కాదో తెలుసుకోవాలనిపించింది. పిల్లవాడిని రాజభవనానికి పిలిపించాడు. పిల్లవాడు అచ్చంగా నసీరుద్దీన్‍ పోలికలతో ఉన్నాడు.
తైమూర్‍ పిల్లవాడిని చూసి ముచ్చటపడి దగ్గరకు పిలిచి ఒక బంగారు నాణెం ఇవ్వబోయాడు.
పిల్లవాడు వద్దన్నాడు. ఎందుకు వద్దని తైమూర్‍ అడిగాడు.
‘‘ముక్కూ మొహం తెలియని వాళ్ల దగ్గర ఏం తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది’’ అన్నాడు పిల్లవాడు.
‘‘మీ అమ్మ చాలా బాగా చెప్పింది. కానీ నేను ముక్కూ మొహం తెలియని వాడిని కాదు. ఈ దేశానికి రాజును’’ అన్నాడు తైమూర్‍.
‘‘అయినా సరే వద్దు’’ అన్నాడు పిల్లవాడు.
‘‘ఎందుకు?’’ మళ్లీ అడిగాడు తైమూర్‍.
‘‘రాజుగారైతే ఎక్కువ బంగారు నాణేలు ఇస్తారు. కానీ ఒకటి ఎందుకిస్తారు? అంటుంది’’ మా అమ్మ అన్నాడు.
తైమూర్‍కి సమాధానం దొరికింది. కానీ దాంతో తెల్లబోవాల్సి వచ్చింది.
ధనవంతుడు – వేటకుక్క
నసీరుద్దీన్‍ కాలంలో బాగా పిసినారి అయిన ఒక ధనవంతుడు
ఉండేవాడు. ఒక రోజు ఆ ధనవంతుడు, నసీరుద్దీన్‍, కొంత మంది పెద్దమనుషులు ఊరిలో రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు.
అక్కడ చర్చలు చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయ్‍. మంచి జాతి కుక్కలు, వాటి లక్షణాలను గురించి రసవత్తరంగా చర్చ సాగుతుంది.
అప్పుడు ధనవంతుడు తనకు బాగా నచ్చిన జాతికుక్క ఇంత వరకు దొరకలేదనీ, దొరికితే ఎంత ధరపెట్టి అయినా కొని పెంచుతానని సవాల్‍ చేశాడు. నసీరుద్దీన్‍ అప్పుడు అతనికి నచ్చిన జాతి కుక్కను ఎక్కడైనా సాధించి తీసుకొస్తానన్నాడు.
ధనవంతుడు పది మందిలో చేసిన సవాల్‍ని కాదనలేక కక్కలేక మింగలేక ‘‘నసీరుద్దీన్‍ ఏం తీసుకొని వస్తాడులే’’ అనుకొని ‘‘తీసుకురా’’ అన్నాడు.
తరువాత రోజు నసీరుద్దీన్‍ బాగా బలిసిన ఊరకుక్కని తీసుకొని వచ్చాడు. దాన్ని చూసి ధనవంతుడు ‘‘ఇదేం కుక్క? జాతి కుక్కలకు కాళ్లు సన్నగా ఉంటాయి. పొట్ట నడ్డికి అంటుకొని ఉంటుంది’’ అని తనకు తెలిసిన జాతి లక్షణాలు చెప్పడం మొదలు పెట్టాడు.
అప్పుడు నసీరుద్దీన్‍ ‘‘ఆగండాగండి! అదెంత సేపు. ఒక నెల మీ దగ్గర కనక ఈ కుక్క ఉంటే మీరు చెప్పిన లక్షణాలన్నీ దీనికి వస్తాయ్‍!’’ అన్నాడు.
తెలిసిన వారు తెలియని వారికి చెప్పండి
అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు తైమూర్‍. ఆయన దగ్గర• ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. అతని పేరు నసీరుద్దీన్‍. నసీరుద్దీన్‍ పిల్లలకు, పెద్దలకు మంచి మంచి విషయాలు బోధిస్తూ ప్రసిద్ధి పొందాడు. నసీరుద్దీన్‍ ప్రసిద్ధి విని నగర ప్రజలు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడవలసిందిగా కోరారు.
సమావేశం ప్రారంభమైంది. నసీరుద్దీన్‍ మాట్లాడుతూ ‘‘నేను ఏం మాట్లాడతానో మీకు తెలుసా!’’ అన్నాడు. ప్రజలు ‘‘మాకు తెలియదు మీరు చెప్పండి’’ అన్నారు. ‘‘నేను మాట్లాడే విషయం తెలియని వారికి నేనేం చెప్పను’’ అని విచారిస్తూ ఉపన్యాసం ముగించాడు. సభలో కలకలం చెలరేగింది.
రెండో రోజు సమావేశంలో మళ్లీ నసీరుద్దీన్‍ని మాట్లాడమన్నారు. ‘‘ఈ రోజు నేనేమి మాట్లాడుతానో మీకు తెలుసా!’’ అన్నాడు. మొదటి అనుభవాన్ని తలచుకొని ప్రజలు ‘‘మాకు తెలుసు’’ అన్నారు. అప్పుడు నసీరుద్దీన్‍ ‘‘తెలిసిన వారికి చెప్పేదేముంటుంది నేననుకున్న పని అయిపోయింది. తెలిసిన వారికి చెప్పడం అనవసరం’’ అన్నాడు. సభలో మరోసారి కలకలం రేగింది.
ముచ్చటగా మూడో రోజు సమావేశం ప్రారంభమైంది. నసీరుద్దీన్‍ మళ్లీ అదే ప్రశ్న వేశాడు. ఈసారి సభ్యులు కొందరు తెలివిగా ‘‘మాకు తెలియదు మీరు చెప్పండి’’ అన్నారు. మరికొందరు ‘‘మాకు తెలుసు. మాకు తెలుసు చెప్పండి. అన్నారు. ఇక నసీరుద్దీన్‍ తప్పించుకోలేడు అనుకున్నారు.
కానీ నసీరుద్దీన్‍ మెల్లిగా లేచి ‘‘సభలో కొందరికి తెలుసు. కొందరికి తెలియదు కదా !’’ అన్నాడు. ‘‘అవును’’’ అన్నారు సభికులు సంతోషంగా. అప్పుడు నసీరుద్దీన్‍ ‘‘ఇప్పుడు తెలిసిన వారు తెలియని వారికి చెప్తారు. కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు’’ అని ఉపన్యాసం ముగించాడు.

Review నసీరుద్దీన్ కొడుకు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top