రుషులు మన అర్ష్య ధర్మానికి ఆద్యులు. ప్రస్తుతం ఆచరణలో ఉన్న ఆచారాలను, సంప్రదాయాలను ఎన్నెన్నో తప, యాగ, అధ్యయన ఫలాలుగా వారు మనకు ఒసగినవే. అందుకే మన మహర్షులు వివిధ అంశాలలో మనకు దారి చూసే మార్గదర్శకులు. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం.
ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క గొప్పదనంతో ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసమే తపస్సులు సాగించారు. ఆ కోవలో అస్తీక మహర్షి కూడా నిలుస్తారు. మరి, ఆయన ఏ లోకహితం కోరి తపస్సు చేశారో తెలుసుకుందాం.
పూర్వకాలంలో జరత్కారుడు అనే మహర్షి ఉండేవారు. ఆయన ఘోటక బ్రహ్మచారి. ఆయన అన్ని తీర్థాల్లోనూ స్నానం చేస్తూ, అన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తిరుగుతున్నాడు. ఆయన అలా సంచరిస్తుండగా, ఒకనాడు తలకిందులుగా చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతున్న రుషి దంపతులను చూశాడు. వారి కింద లోతైన లోయలు ఉన్నాయి. ఈ స్థితిలో వారిని చూసిన జరత్కారుడు.. ‘మీకు నేను ఏమైనా సాయం చేయగలనా?’ అని అడిగాడు.
‘నాయనా! నువ్వు మాకు చేయగల సాయం ఏమీలేదు. మేమే బాగా తపస్సు చేసిన వాళ్లం. ఏం కావాలన్నా మేమే చేసుకోగలం. అయితే మాకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడు బ్రహ్మచారి. వాడు పెళ్లి చేసుకుని సంతానం పొందితేనే మాకు పుణ్యలోకాలకు వెళ్లే అర్హత లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మేం చేస్తున్న తపస్సు ఉపయోగం లేదు.
నాయనా! నువ్వు మాకు ఒక సహాయం చేసిపెట్టు.
మా పరిస్థితిని మా కుమారుడికి చెప్పి పుణ్యం కట్టుకో’ అన్నారు ఆ రుషులు.
జరత్కారుడు అది విని- ‘స్వామీ! మీ కుమారుడి గురించిన వివరాలు చెప్పండి’ అన్నాడు.
అప్పుడు వాళ్లు- ‘మా అబ్బాయి పేరు జరత్కారుడు. వేదవేదాంగ వేత్త. గొప్ప తపస్వి. అతడు పెళ్లి చేసుకుని సంతానం పొందితేనే మాకు ముక్తి’ అన్నారు.
అది విని జరత్కారుడు చాలా బాధపడ్డాడు. వారు తన తల్లిదండ్రులే అని తెలుసుకుని క్షమించమని అడిగాడు. త్వరలోనే మీరు చెప్పినట్టే చేసి మీకు విముక్తి కలిగిస్తానని మాట ఇచ్చాడు.
అయితే, ఒక షరతు విధించాడు. తన పేరు కలిసిన పేరు గల అమ్మాయినే పెళ్లి చేసుకుని, సంతానం కలగగానే వదిలేస్తానని తల్లిదండ్రులకు చెప్పి జరత్కారుడు అక్కడి నుంచి బయల్దేరాడు.
ఒకసారి వినత, కదృవ అనే నాగ వనితలు పందెం వేసుకుని, ఓడిపోయిన వాళ్లు రెండో వాళ్లకు దాసిగా ఉండాలని అనుకున్నారు. ఈ పందెంలో వినత ఓడిపోయింది. కదృవకు దాసిగా వినతను పంపించడానికి నాగపుత్రులు అంగీకరించలేదు. అప్పుడు కదృవ జనమేజయ మహారాజు సర్పయాగం చేసినపుడు సర్పాలన్నీ చచ్చిపోవాలని వారిని శపించింది.
వాసుకి మొదలైన వాళ్లంతా సర్పయాగం ఆపించాలని ఆలోచిస్తున్నారు. వాసుకి చెల్లెలైన జరత్కారువుకి అస్తీకుడు అనే వాడు పుట్టి సర్పయాగాన్ని ఆపగలడని బ్రహ్మ దేవతలు కలిసి మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్పాడు నాగుడు. అంతలో జరత్కారుడు భిక్ష కోసం అటుగా వచ్చినపుడు వాసుకి తన చెల్లెలు జరత్కారువును భిక్షగా ఇచ్చి, ‘నా చెల్లెల్ని నేనే పోషించుకుంటాను. పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపొమ్మ’ని అడిగాడు. జరత్కారుడు అలాగేనని ఆమెను పెళ్లాడాడు.
కొంతకాలానికి జరత్కారువు గర్భవతి అయింది. జరత్కారుడు సంతానం కలిగే వరకు ఉంటే మళ్లీ బంధాలు ఏర్పడతాయని భావించి భార్యను పిలిచి, నీకు ఇద్దరి వంశాలను ఉద్ధరించగల కొడుకు పుడతాడు. నేను వెళ్లిపోతున్నాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ విధంగా అస్తీక మహర్షి జన్మించాడు. ఈయన పుట్టుక వెనుక ఇంత కథ ఉంది.అస్తీక మహర్షి చ్యవన మహర్షి కొడుకైన ప్రమతి దగ్గర వేదవేదాంగాలు నేర్చుకుని గొప్ప జ్ఞాని అయ్యాడు. అంతలో జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్తును పాము కరిచింది. ఆయన పాముకాటుకు చనిపోయాడు. జనమేజయుడు పాములన్నిటి మీద కోపంతో సర్పయాగం తలపెట్టాడు.
అప్పుడు అస్తీకుడు జనమేజయుడి దగ్గరకు వెళ్లి, మహారాజును, యాగానికి అక్కడికి వచ్చిన వారందరినీ స్తోత్రం చేశాడు. జనమేజయుడు సంతోషించి ఏం కావాలని అడిగాడు. అస్తీకుడు సర్పయాగం ఆపి, నాగుల్ని రక్షించాలని కోరాడు.
ఈ విధంగా అస్తీక మహర్షి జరత్కారుని తల్లిదండ్రులు పుణ్యలోకాలకు వెళ్లడానికి, నాగులను రక్షించడానికి కారకుడయ్యాడు. ఈ విధంగా అస్తీకుడు నాగలోకాన్ని
ఉద్ధరించాడన్న మాట.
Review నాగలోక ఉద్ధారకుడు అస్తీకుడు.