మానవ జన్మ లభించడం ఒక వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. ‘తింటున్నాం. సరదాలతో, సుఖాలతో హాయిగా కాలం గడిపేస్తున్నాం.’ అనుకుంటారు చాలామంది. ఏదో ఒక రోజు ఈ బొందిలో ప్రాణం కాస్తా ఎగిరిపోతుంది. అశాశ్వతమైన జీవితం కోసం మనిషి తాపత్రయపడుతున్నాడు. ఇంద్రియ సుఖాల కోసం అదేపనిగా వెంపర్లాడుతున్నాడు. అతడు నిగ్రహం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం అజ్ఞానమే అవుతుంది.
ఇతర ప్రాణుల కంటే మిన్న అయిన ఈ మానవ జన్మను సత్కార్యాలు, సదాలోచనలతో సార్ధకం చేసుకోవాలి. సుఖాలే విలువైనవి. ప్రాముఖ్యమైనవి అనుకుంటాడే తప్ప అవి ఎండమావుల వంటివి, తుచ్ఛమైనవి అని మనిషి అనుకోడు. మొహాగ్నితో దహించుకుపోతాడు. నిజమైనవి ఎరుగడు. విషయవాంఛల్లో మునిగిన అతడు శ్లేష్మంలో చిక్కిన ఈగ లాగా విలవిల్లాడతాడు.
విషయలోలత విషయమైనది. మనిషి బయటి శత్రువులను తెలసుకోగలడు. తన లోపలే దాగి వున్న అంతఃశ్శత్రువులను తెలుసుకోలేడు. అవి అతడిని భగవంతుడి సన్నిధికి దూరం చేస్తాయి. అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యా లకు లొంగితే అధోగతి తప్పదు. వాటి మాయలో పడకుండా జాగ్రత్త వహించకపోతే అనర్థాలు వాటిల్లుతాయి. విషయ వాసనలు, వాంఛలు మనిషిని స్థిరంగా ఉండనివ్వవు. అటువంటి వ్యక్తి అశాంతితో అలమటిస్తాడు.
చిత్తాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంతఃకరణ అనే మనసు అధీనంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వర్తిస్తున్నప్పుడే మనిషి మోక్షాన్ని సాధించేందుకు ప్రయత్నించగలడు. కాని అది దుర్లభమైన విషయం. మనసు తన మాట వినేలా చేయాలని, తాను ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తించేలా అనుగ్రహిం చాలని అతడు భగవంతుణ్ని వేడుకోవాలి.
చూస్తుండగానే కాలం గడచిపోతుంది. ఆయువు తరిగిపోతుంది. ఎందుకూ కొరగాని విషయాల పట్ల వ్యామోహం పెంచుకుంటే ఆ తరవాత విచారించాలి. పోతన ఒకచోట ‘ఇంతకాలం దేహం మీద విపరీత వ్యామోహంలో పడి, ఐహిక సుఖాల పట్ల మక్కువ, మిక్కుటమై నిన్ను తెలుసుకోలేకపోయాను’ అని వాపోతాడు. భగవద్గీతలో కృష్ణుడు నీటి మీద నడిచే నావను గాలి ముంచివేసినట్లు, విషయాసక్తితో రమించే ఇంద్రియాల్లోని ఏదో ఒకదానితో మనసు చెదిరిపోతుంది. ఆ ఒక్క ఇంద్రియంతో కూడిన మనసే సాధకుడి బుద్ధిని హరించివేస్తుంది. అంటాడు. ఇంద్రియ నిగ్రహానికి దారిచూపి, ఈ మోహబంధాల నుండి విముక్తి కలిగించాలని మనిషి ఆ పరాత్పరునిని ప్రార్థించాలి.
విషయలోలత నిండిన వ్యక్తి అజ్ఞానం, అవివేకంతో కొట్టు మిట్టాడతాడు. బతికి ఉండగానే ఈ భూమ్మీద అందాలు, ఆనందాలు, ఆకర్షణలు అనుభవించాలి. చనిపోయాక ఏం జరుగుతుందో అనవసరం’ అనుకుంటాడు. అది పొరపాటు. భోగలాలసుడై భగవంతుణ్ణి విస్మరించడం సరికాదు.
పరుల ధనాన్ని ఆశించడం, దాని కోసం వంచన, దౌర్జన్యానికి పాల్పడటం, ఆ ధనాన్ని హరించడం, పరస్త్రీ సాంగత్యం…. ఇటువంటి వన్నీ తాత్కాలిక ఆనందాలే.
దైవకృప వల్ల మనకు సకల భోగభాగ్యాలు లభిస్తున్నాయి. అంతా దైవ సంపదే ఇతరుల సంపద కోసం ఆరాటపడటం తగదని భక్త రామదాసు బోధించాడు. మనసుని ఉద్దేశించి ఆయన సమరిని నమ్ముకుంటే, ఇతర గుణాలకు వశమైతే చెడు తప్పదు’ అని హెచ్చరించాడు. సత్యాంగత్యం కలిగినవారికి ఆయన మాటల అంతరార్థం సులువుగానే బోధపడుతుంది.
Review నిగ్రహ శక్తి.