నీలోకి ప్రయాణం..

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.
కస్తూరి మృగం.. ఇదొక జంతువు. ఈ జంతువు పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మృగం నుంచి వెలువడే పరిమళం చాలా తీవ్రమైనది. ప్రాచీన కాలం నుంచి దీనిని ప్రసిద్ధ సుగంధ పరిమళ ద్రవ్యంగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ఖరీదైన, అరుదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి పరిమళం ఒకటి. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సేవలో కూడా వినియోగిస్తుంటారు. ఈ మృగంపై మన తెలుగు కవి వేమన గారు అద్భుతమైన పద్యం కూడా రాశారు.
మృగమదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ
(కస్తూరి చూసేందుకు నల్లగా కనిపించినప్పటికీ, దాని సువాసన నాలుగు దిక్కులకూ వెదజల్లుతుంది. అలాగే పెద్దలైన వారు బయటికి ఆడంబరంగా కనిపించకపోయినప్పటికీ, వారు గొప్ప గుణాలను కలిగి ఉంటారు)
అయితే కస్తూరి జింక ఇంత గొప్పదైనప్పటికీ దాని జీవితం చాలాసార్లు అత్యంత విషాదభరితంగా ముగుస్తుంది. వేదాంతంలొ ఈ జంతువుకు సంబంధించిన కథ ఒకటి ఉంది.
కస్తూరి మృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మంచి మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం ప్రారంభిస్తుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగి తిరిగి చివరికి ఏదో పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది.
మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్థంగా ఇలాగే తిరుగాడుతూ ఉంటాడు. పుణ్య క్షేత్రాలనీ, తీర్థయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ, కాలాన్నీ వృథా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి ఇలా తిరగడం వల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగమంటూ ఏదీ లేదు.
పాండవులు తీర్థయాత్రలకు వెళ్తూ కృష్ణుడిని కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తూ భగవంతుడైన కృష్ణుడికి తీర్థయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయా మోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుడిని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ ఇచ్చి ‘నా ప్రతినిధిగా దీనిని తీసుకెళ్లి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి’ అని చెబుతాడు. పాండవులు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వస్తారు.
అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది. ‘అదేంటి బావా? ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని పాండవులు అడుగుతారు.
అందుకు కృష్ణుడు నవ్వి- ‘బావా! ఎన్ని గంగలలో మునిగిగా ఈ దోసకాయ చేదు పోలేదు చూశావా?’ అంటాడు ధర్మరాజును ఉద్దేశించి.
ఎన్ని తీర్థయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు దీని ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.
మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపలికి జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంతరంగిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా.. చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న చోట నుంచే కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాత కాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.

Review నీలోకి ప్రయాణం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top