‘నేను ఎవరు?’ అనేది తెలుసుకోవడం ఎలా? అసలు ‘నేను ఎవరు?’ వివరంగా చెప్పగలరా?
అరవై నాలుగు లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకుని బతకకపోతే ముక్కలై బయటకు వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటానికి దేవుడిచ్చిన సమయం 24 గంటలు మాత్రమే. నిలిస్తే బతుకు.. లేదంటే ముక్కలై బయటకు వచ్చేయడమే.
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటకు వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్లు, చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి.. ఏం చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది. ఆ దేహాన్నే ‘నేను’ అంటాం.
కానీ ఎలా? నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది? ఏ భాగం వినదు? వినాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు రెండడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ ఆరడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా ఆ అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి ఒక్కో అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకుని పని చేయడానికి మొరాయిస్తుంది.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం నీదే కదా? ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు? ఈ దేహం నీదే కదా! ఎందుకు నీ మాట వినడం లేదు? ఈ దేహం నీదే కదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?.
ఎందుకంటే ఈ దేహం మనది కాదు. మనకు ఆ పరమాత్మ ఇచ్చిన ఒక ఉపకరణం మాత్రమే. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ‘ఈ దేహం నాదే.
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరకు రూపం ధరించిన రూపం ఇక్కడే వదిలి వెళ్లిపోతాం. ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యదార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. రూపానికి ముందు మనం ఉన్నాం. రూపంలో మనం ఉన్నాం. రూపం వదిలేశాక కూడా మనం ఉంటాం. ఎక్కడో ఒకచోట నువ్వు అనేవాడు లేకపోతే అసలే రూపమే ఉండదు. ఈ దేహం దేవుడిచ్చిన ఒక అద్భుత వరం. ఆయనే ఈ దేహానికి ఏం కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్టు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి. ఆయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.
కాబట్టి ఎవరికి వారు ‘నువ్వు ఎవరో’ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి? ఈ కాలంలో ఏం చేయాలి?
14.01.2021 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఇది ఆరు నెలలు ఉంటుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకరరాశిలోకి మారిన క్షణమే సంక్రాంతి అయితే, ఆ క్షణం నుంచీ ఉత్తరాయణ కాలం ఆరంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగా, దక్షిణాయం రాత్రిగా ఉంటాయి. అందుకే దేవతలు మేల్కొని ఉంటే ఉత్తరాయణ కాలాన్ని దేవయానం అనీ, దక్షిణాయనాన్ని పితృయానమని అంటారు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో ముఖ్యంగా నదీస్నానం, సూర్య నమస్కారం, వేదాధ్యయనం, నూతన గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం వంటి పుణ్య కార్యాలు ఆచరిస్తారు. నువ్వులు, బియ్యం, వస్త్రాలు, దుంపలు, ఫలాలు, చెరకు, విసనకర్ర, బంగారం, గోవులు వంటివి ఈ కాలంలో దానం చేస్తే ఉత్తమ గతులు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణంలో గుమ్మడి కాయను దానం చేస్తే సాక్షాత్తూ బ్రహ్మాండాన్నే దానం చేసిన ఫలం పొందుతారని ప్రతీతి.
Review ‘నేను ఎవరో’ తెలుసుకోవాలి!.