పంచాంగ శ్రవణం.. జీవన వికాసం

ఉగాది నాడు పంచాంగ శ్రవణం మహా పుణ్యదాయకమైన విషయమే అయినా, ఇందులో జీవన వికాస పాఠం కూడా నిగూఢంగా దాగి ఉంది. ఏడాది తొలిరోజే ఆదాయ వ్యయాలూ, అవమాన రాజ్యపూజ్యాలూ తెలుసుకోవడం ద్వారా మనిషి రాబోయే కష్టసుఖాలన్నింటికీ మానసికంగా సన్నద్ధమవుతాడు.
ఏ కొత్త బాధ్యతో మీదపడితే, ‘ఆ రోజు పంచాంగంలో చెప్పిన భారం ఇదేనన్న మాట’ అని సరిపెట్టుకుంటాడు.
ఏ అనుకోని ఆపదో ఎదురైతే, ‘గ్రహగతి మారుతుందని ముందే పంచాంగంలో చదివాం కదా!’ అని సర్దుకుంటాడు.
చివరకు అనని మాటలు అన్నారన్నా, లేనిపోని వ్యవహారాల్లో ఇరుక్కున్నా ‘నీలాపనిందలు ఊహించినవేగా’ అని ఊరుకుంటాడు.
ఏ ఉన్నతాధికారో నలుగురి ముందు అక్షింతలేస్తే, ‘అవమానాలు అధికమని అనుకున్నదేగా’ అని మిన్నకుండిపోతాడు.
సుఖసంతోషాలు ఉంటాయి అన్న పంచాంగ వాక్యానికి పొంగిపోయి ‘ఈ ఏడాది నాకు ఇవీ ఉన్నాయన్న మాట’ అని నిండు మనసుతో ముందుకెళతాడు.
మనిషి ధైర్యంతో, కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఏడాది తొలినాడు ఈ మాత్రం ఉత్సాహం చాలు. నిజానికి షడ్రుచులతో పంచే ఉగాది పచ్చడి ఆంతర్యమూ అదే.
నాకు బెల్లం ముక్కలే కావాలంటే కుదరదు. అరటి పండొక్కటే తింటానంటే వీలుపడదు.
వేప చేదునూ, మామిడి వగరునూ రుచి చూడాల్సిందే. చింతపండు పుల్లదనాన్నీ, మిరియాల ఘాటునీ అనుభవించాల్సిందే.
అప్పుడే •యాపజయాలనూ, లాభనష్టాలనూ సమదృష్టితో చూసే మనో ధైర్యం ఏర్పడేది. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలనూ, ఊహించని మలుపులనూ సులువుగా దాటగలిగే సత్తా ఇచ్చేది. ఉగాది పండుగ నుంచి మనం నేర్చుకోవాల్సిందీ, ఆ రోజు నుంచి స్ఫూర్తి పొందాల్సిందీ ఈ కోణంలోనే.
ఇక, పంచాంగం విషయానికి వస్తే.. పంచాంగం అంటే- పంచ అంగాలతో కూడినదని అర్థం. ఇందులో ఐదు విభాగాలుంటాయి. అవి- తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథులు పదిహేనూ, వారాలు ఏడూ, అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలూ, విష్కంభం మొదలు వైధృతి వరకు 27 యోగాలూ, బవ మొదలు కింస్తుఘ్నం వరకు 11 కరణాలన్నింటినీ గురించి తెలియ చేసేదే పంచాంగం. ముహూర్త బలం కోసం ఈ అయిదింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అన్నది చరిత్రకారుల విశ్లేషణ. మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కవేసి, వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. తిథి విషయంలో జాగ్రత్తపడితే సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాపపరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు.

Review పంచాంగ శ్రవణం.. జీవన వికాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top