పంచేద్రియాల మధ్య కలహం

ఒకానొకప్పుడు మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఒక దానితో ఒకటి పోట్లాడుకున్నాయి. వాటిలో ఎవరు గొప్ప అనేది కలహానికి కారణం. నేను గొప్ప అంటే నేను గొప్ప అని అవి పోట్లాడుకున్నాయి

అవి బ్రహ్మ వద్దకు వెళ్లి, ‘‘అయ్యా! మాలో ఎవరు గొప్ప?’’ అని అడిగాయి. ‘‘ఏది లేకపోతే శరీరం వ్యర్థమో అదే గొప్ప’’ అన్నాడు బ్రహ్మదేవుడు.

మొదటగా వాక్కు శరీరం నుండి బయటికి వెళ్లిపోయింది. అది ఒక సంవత్సరం పాటు శరీరంలోకి రాకుండా బయటే ఉండిపోయింది. తరువాత తిరిగి వచ్చి, ‘‘నేను లేకుండా మీరు ఎలా ఉండగలిగారు?’’ అని మిగిలిన ఇంద్రియాలని అడిగింది.’’ మూగవాడు ఎలా ఉంటాడో అలాగ. అతడు శ్వాస తీసుకోగలడు. కళ్లతో చూడగలడు. చెవితో వినగలడు, మనస్సుతో ఆలోచించగలడు. ఆ విధంగా మేము ఉండగలిగాం.’’ అన్నాయి మిగిలిన ఇంద్రియాలు. అప్పుడు వాక్కు శరీరంలోకి ప్రవేశించింది.

కన్ను శరీరం నుండి బయటికి వచ్చింది. అది ఒక సంవత్సరం వాక్కులాగే బయట ఉండి తిరిగి వచ్చింది. ‘‘నేను లేకుండా మీరు ఎలా ఉండగలిగారు?’’ అంది. ‘‘గుడ్డివానిలా చూడలేకపోయినా, శ్వాస పీల్చగలడు. నోటితో మాట్లాడగలడు. చెవితో వినగలడు. మనస్సుతో ఆలోచించగలడు. అలా ఉండగలిగాం.’’ అన్నాయి మిగిలినవి. కన్ను మళ్లీ శరీరంలోకి ప్రవేశించింది.

తరువాత చెవి కూడా కన్ను లాగా, వాక్కులాగా శరీరం నుండి బయటికి వచ్చి ఒక సంవత్సరం తరువాత తిరిగి వచ్చి, ‘‘నేను లేకుండా ఎలా ఉండగలిగారు?’’ అంది. ‘‘చెవిటివానిలా వినలేకపోయినా, శ్వాస పీల్చగలడు. నోటితో మాట్లాడగలడు. కళ్లతో చూడగలడు. మనస్సుతో ఆలోచించగలడు. అలా ఉండగలిగాం’’ అన్నాయి. చెవి మళ్లీ శరీరంలోకి ప్రవేశించింది.

తరువాత మనస్సు శరీరం నుండి బయటికి వచ్చి, ఒక సంవత్సరం ఉండి, తిరిగి వచ్చింది. ‘‘నేను లేకుండా మీరు ఎలా ఉండగలిగారు?’’ అంది.
‘‘చిన్న పిల్లల్లా ఉన్నాము. ఆలోచించకుండా ఉన్నాం. శ్వాస పీల్చగలడు. నోటితో మాట్లాడగలడు. కళ్లతో చూడగలడు. చెవితో వినగలడు. అలా ఉండగలిగాం’’ అన్నాయి. మనస్సు శరీరంలోకి ప్రవేశించింది.

ఇక మిగిలింది శ్వాస. శ్వాస బయటికి రావడానికి ప్రయత్నించింది. అది మిగిలిన ఇంద్రియాల్ని చీల్చుకుని బయటికి రావాలనుకుంది. మిగిలిన ఇంద్రియాలు శ్వాస చుట్టూచేరి, ‘‘దయచేసి మీరు వెళ్లవద్దు, మీరే మా అందరికంటే గొప్ప, బయటికి వెళ్లకండి’’ అని బ్రతిమాలాయి.

అప్పుడు వాక్కు, ‘‘నేను అభివృద్ధి చెందితే మీరు అభివృద్ధి చెందుతారు.’’ అంది.
కన్ను ‘‘నేను బలమైన ఆధారాన్నైతే, మీరు బలమైన ఆధారమే’’ అంది.
మనస్సు, ‘‘నేను నివాస స్థానాన్నయితే, మీరు నివాస స్థానమే’’ అంది.

కాబట్టి వీటిని అనగా వాక్కు, కన్ను, చెవి, మనస్సు మొదలైన వాటిని ఇంద్రియాలు అనడానికి వీలులేదు. వాటిని జీవ చిహ్నాలు అనాలి. అన్నీ కలిస్తేనే జీవం. వాటిలో ఒకటి పోయినా జీవితం అసంపూర్ణం అవుతుంది. ప్రాణంపోతే ఏవీ పనికిరావు కదా?

Review పంచేద్రియాల మధ్య కలహం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top